Inter New Syllabus Leak: ఏపీ ఇంటర్ కొత్త సిలబస్ లీక్.. రంగంలోకి పోలీసులు

Inter New Syllabus Leak: ఏపీ ఇంటర్ సెకండియర్ కొత్త సిలబస్ సోషల్ మీడియాలో లీక్ కావడంపై ప్రభుత్వం సీరియస్. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

KVD Varma
Published on: 26 March 2026 10:44 AM IST
Inter New Syllabus Leak: ఏపీ ఇంటర్ సెకండియర్ కొత్త సిలబస్ సోషల్ మీడియాలో లీక్
X

Inter New Syllabus Leak

Inter New Syllabus Leak: ఏపీ ఇంటర్మీడియట్ సెకండియర్ కోసం విద్యాశాఖ కొత్త సిలబస్ రూపొందించింది. దీనిని ఇంకా విడుదల చేయలేదు. అయితే, ఈ కొత్త సిలబస్ లో ని కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ఇటీవల ప్రత్యక్షం అయ్యాయి. ఈ విషయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో కలకలం రేపింది. ప్రభుత్వం అధికారికంగా విడుదల కాకముందే సిలబస్ సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థుల కోసం ఈ విద్యా సంవత్సరం(2026-27) నుంచి కొత్త సిలబస్ ప్రవేశ పెట్టడానికి రెడీ అయింది. దీనికోసం తెలుగు అకాడమీ, ఇంటర్మీడియట్ బోర్డు కలసి సిలబస్ ను రూపొందించాయి. ఈ సిలబస్ తో కొత్త పాఠ్య పుస్తకాల ప్రచురణకు విద్యాశాఖ సిద్ధపడింది. ఈమేరకు ప్రింటింగ్ దశలో టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. సాధారణంగా ప్రింటింగ్ పూర్తయి.. టెక్స్ట్ బుక్స్ బయటకు వచ్చేవరకూ సిలబస్ ఏమిటనేది తెలియదు. కానీ, టెక్స్ట్ బుక్స్ ప్రింటింగ్ దశలో ఉండగానే ఈ సిలబస్ కు సంబంధించిన కొన్ని అంశాలు పీడీఎఫ్ రూపంలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి.

కోటేశ్వరమ్మ ఫిర్యాదుతో..

ఇంటర్ కొత్త సిలబస్ లీకేజీపై తెలుగు, సంస్కృత అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ కోటేశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ కి సంబంధించిన పీడీఎఫ్ లు బయటకు రావడంతో విద్యాశాఖ అధికారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. అలా ఎలా బయటకు వచ్చాయి అనేదానిపై రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఈ కేసుపై సమగ్ర దర్యాప్తును చేపట్టారు.

ఈ లీక్ వెనుక ప్రముఖ పబ్లిషింగ్ సంస్థ?

ఈ లీక్ వ్యవహారం వెనుక వీజీఎస్ పబ్లిషర్స్ హస్తం ఉన్నట్లు తెలుగు అకాడమీ ప్రాథమికంగా అనుమానిస్తోంది. దీంతో ఆ సంస్థకు నోటీసులు జరీ చేసింది తెలుగు అకాడమీ. బోర్డులోని కొందరు సిబ్బంది సహకారంతోనే ఈ సమాచారం బయటకు వచ్చి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

విజయవాడ సైబర్ క్రైమ్ బృందం ఈ వ్యవహారంలో డిజిటల్ ఆధారాలను సేకరించింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన వారు ఎవరు అనే కోణంలో విచారణ సాగుతోంది. త్వరలోనే ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అప్పటి వరకు సామాజిక మాధ్యమాల్లో వచ్చే అనధికారిక పీడీఎఫ్ ఫైల్స్‌ను విద్యార్థులు నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు.

KVD Varma

KVD Varma

జర్నలిజం రంగంలో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. 2008లో సాక్షి పత్రికలో రిపోర్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించాను. డిజిటల్ విప్లవంతో ఇటువైపు ప్రయాణంలో భాగంగా HMTVతో ప్రారంభించి TV9, RTV, Mahaa News వంటి అగ్రగామి సంస్థల్లో డిజిటల్ జర్నలిస్టుగా పనిచేశాను. ప్రస్తుతం HMTV వెబ్‌సైట్ వేదికగా పాఠకులకు తాజా వార్తలను అందిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ.. హిందీ, ఇంగ్లీష్ వార్తలను తెలుగు పాఠకుల అభిరుచికి అనుగుణంగా అనువదించి, విశ్లేషణాత్మక కథనాలను అందించడం నా ప్రత్యేకత.

Next Story