Gajulamandyam: మైనర్‌పై అత్యాచారం కేసులో నిందితుడికి 17 ఏళ్ల జైలు!

Gajulamandyam: గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు రాఘవేంద్రన్‌కు పోక్సో కోర్టు 17 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 4 Sept 2026 4:17 PM IST
Gajulamandyam
X

Gajulamandyam: మైనర్‌పై అత్యాచారం కేసులో నిందితుడికి 17 ఏళ్ల జైలు!

Gajulamandyam: మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడికి పోక్సో ప్రత్యేక న్యాయస్థానం 17 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.15 వేల జరిమానా విధించింది. ఈ మేరకు చిత్తూరు పోక్సో ప్రత్యేక న్యాయస్థానం గురువారం (03-09-2026) తీర్పు వెలువరించింది.

గాజులమండ్యం పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 165/2021లో ఈ కేసు నమోదైంది. రేణిగుంట–రామకృష్ణాపురం రోడ్డులోని ఇన్ఫెంట్ జీసస్ స్కూల్ సమీపంలో 29-07-2021న మైనర్ బాలికను A1 ఎస్. రాఘవేంద్రన్ తన స్నేహితులైన A2 పి. వెంకటేష్, A3 సి. ధనయ్య, A4 కె. వెంకటేష్‌ల సహాయంతో కారులో బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. తొలుత గర్ల్ మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బాధితురాలి పుట్టిన తేదీ 29-07-2005 కావడంతో సంఘటన సమయంలో ఆమె మైనర్‌గా ఉన్నట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. 05-08-2021న బాలిక తిరిగి ఇంటికి చేరుకుని పోలీసుల ఎదుట హాజరైంది. ఆమె వాంగ్మూలం ఆధారంగా కేసులో కిడ్నాప్, అత్యాచారం, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్లను పోలీసులు చేర్చారు.

దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థలాలను పరిశీలించిన పోలీసులు బాధితురాలి దుస్తులు, చెన్నైలోని ఓ ప్రైవేట్ లాడ్జికి సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత సాక్షులను విచారించడంతో పాటు A2 నుంచి A4 వరకు నిందితులను అరెస్ట్ చేసి, వారు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రధాన నిందితుడు A1 ఎస్. రాఘవేంద్రన్‌ను కూడా అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.

కేసు విచారణ అనంతరం A1 ఎస్. రాఘవేంద్రన్‌ను IPC సెక్షన్ 363, 376(1)తో పాటు పోక్సో చట్టం సెక్షన్ 3 రీడ్ విత్ 4 కింద నేరస్థుడిగా న్యాయస్థానం నిర్ధారించింది.

శిక్ష వివరాలు: IPC సెక్షన్ 363 కింద మైనర్ బాలికను చట్టబద్ధ సంరక్షకుడి సంరక్షణ నుంచి కిడ్నాప్ చేసిన నేరానికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 3 నెలల సాధారణ కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

అలాగే పోక్సో చట్టం సెక్షన్ 4(1) కింద 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో 3 నెలల సాధారణ కారాగార శిక్ష విధించింది. రెండు శిక్షలు కలిపి నిందితుడికి మొత్తం 17 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.15,000 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.

దర్యాప్తు నుంచి కోర్టు విచారణ పూర్తయ్యే వరకు కేసును సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన గాజులమండ్యం పోలీస్ స్టేషన్ దర్యాప్తు అధికారులు, కోర్టు డ్యూటీ సిబ్బంది, సంబంధిత పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

మైనర్ బాలికలపై జరిగే నేరాల విషయంలో గాజులమండ్యం పోలీసులు కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ, సమర్థవంతమైన దర్యాప్తుతో నిందితులకు శిక్ష పడేలా చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story