Madanapalle: మదనపల్లెలో విజయవంతమైన విద్యాసంస్థల బంద్
Madanapalle: నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ మదనపల్లెలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్. కేంద్ర మంత్రి రాజీనామాకు డిమాండ్.
Madanapalle: మదనపల్లెలో విజయవంతమైన విద్యాసంస్థల బంద్
మదనపల్లె: నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్. రెడ్డి సాహెబ్ డిమాండ్ చేశారు.
భారత జాతీయ యువజన కాంగ్రెస్ దేశవ్యాప్తంగా చేపట్టిన "ఛాత్రోన్ కి గూంజ్" కార్యక్రమంలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి రెడ్డి చైతన్య ఆధ్వర్యంలో, అన్నమయ్య జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శరత్ కుమార్ రెడ్డి నాయకత్వంలో జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలను సందర్శించి విద్యాసంస్థల బంద్‌ను విజయవంతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని పలు విద్యాసంస్థలు విద్యార్థులకు మద్దతుగా స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. స్థానిక సత్సంగ్ స్కూల్‌లో గురుపౌర్ణమి కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థి సంఘాల విజ్ఞప్తి మేరకు అక్కడున్న విద్యార్థులు, సిబ్బందిని ఇళ్లకు పంపించి పాఠశాలను కూడా మూసివేశారు.
మీడియాతో మాట్లాడిన రెడ్డి చైతన్య, శరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నీట్ ప్రశ్నాపత్రం లీక్ దేశ విద్యార్థులను మోసం చేసిన అతిపెద్ద కుంభకోణమని, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని విమర్శించారు. ప్రస్తుతం దేశ విద్యా వ్యవస్థపై విద్యార్థులు విశ్వాసం కోల్పోయారని, పరీక్షల నిర్వహణలో పారదర్శకత కనిపించడం లేదన్నారు.
ప్రస్తుత నీట్ విధానాన్ని యువజన కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, గతంలో అమలులో ఉన్న ఈఎంసెట్ (EAMCET) తరహాలో రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా వైద్య ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునే అధికారం కలిగి ఉండాలని అభిప్రాయపడ్డారు. విద్య అనేది సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి అనుగుణంగా రాష్ట్రాల హక్కులను గౌరవించే అంశమని, కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దన్నారు.
నీట్ పేపర్ లీక్‌కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, దేశ విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లీక్‌కు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నూనె పవన్ తేజపై విజయవాడలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.
ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు. విద్యార్థుల ఉద్యమానికి మద్దతు తెలిపిన లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా, డి.కె. శివకుమార్, వి.డి. సతీశన్, సి. జోసెఫ్ విజయ్ తదితర కాంగ్రెస్ నాయకులకు యువజన కాంగ్రెస్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
చివరిగా మాట్లాడుతూ, ఒకప్పుడు చిన్న ప్రమాదాలకే నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రులు రాజీనామా చేసిన చరిత్ర ఉందని గుర్తు చేశారు. అయితే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసిన నీట్ కుంభకోణం జరిగినప్పటికీ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవిలో కొనసాగడం దురదృష్టకరమన్నారు.
తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే భారత జాతీయ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధమైన ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వలిగేశ్వర్, జీవన్, రాజు, ఉమాశంకర్, భానుప్రకాశ్ రెడ్డి, మహమ్మద్ అలీతో పాటు యువజన కాంగ్రెస్ నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




