Madanapalle: మదనపల్లెలో రూ.32.11 లక్షల గుట్కా, కూల్ లిప్స్ స్వాధీనం!
Madanapalle: మదనపల్లె ఇబ్రహీం ట్రేడర్స్‌పై వన్‌టౌన్ పోలీసుల మెరుపు దాడి. రూ.32.11 లక్షల విలువైన 26,760 నిషేధిత పొగాకు ప్యాకెట్లు సీజ్. ఒకరి అరెస్ట్
Madanapalle: మదనపల్లెలో రూ.32.11 లక్షల గుట్కా, కూల్ లిప్స్ స్వాధీనం!
Madanapalle: మదనపల్లె పట్టణంలో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో భారీ మొత్తంలో గుట్కా, కూల్ లిప్స్, చ్యూయింగ్ టొబాకో తదితర నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో, మదనపల్లె వన్‌టౌన్ సీఐ కె. రాజారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఆదివారం దాడులు నిర్వహించింది.
సమాచారం మేరకు మదనపల్లె పట్టణంలోని ఇబ్రహీం ట్రేడర్స్‌లో తనిఖీలు చేపట్టగా, పిక్టోరియల్ హెల్త్ వార్నింగ్ లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న గుట్కా, కూల్ లిప్స్, చ్యూయింగ్ టొబాకో, వైట్ లాండీ తదితర నిషేధిత పొగాకు ఉత్పత్తులను గుర్తించారు. ఈ సందర్భంగా 26,760 ప్యాకెట్ల నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకోగా, వాటి విలువ సుమారు రూ.32,11,384గా పోలీసులు అంచనా వేశారు.
ఈ కేసులో కాలగడ్డ నబీహాన్ అలియాస్ ఇబ్రహీం (48) ను అరెస్ట్ చేసి, సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం–2003 (COTPA)లోని సంబంధిత సెక్షన్లు, అలాగే బీఎన్‌ఎస్ సెక్షన్ 318(4) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా వన్‌టౌన్ సీఐ రాజారెడ్డి మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు, నిల్వలపై నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గుట్కా, కూల్ లిప్స్, ఇతర నిషేధిత పొగాకు ఉత్పత్తులను విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు కూడా ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సీఐ రాజారెడ్డి పేర్కొన్నారు.




