Madanapalle: నిరుద్యోగులపై దాడులపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించరు రెడ్డి సాహెబ్

Madanapalle: మదనపల్లెలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్. రెడ్డి సాహెబ్. యువత, నిరుద్యోగుల సమస్యలపై పవన్ కళ్యాణ్ మౌనంపై విమర్శ.

Srinivasulu, Madanapalle
Published on: 4 Aug 2026 8:45 PM IST
Madanapalle
X

Madanapalle: నిరుద్యోగులపై దాడులపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించరు రెడ్డి సాహెబ్

మదనపల్లె: ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శిస్తే బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, యువత, నిరుద్యోగులపై జరుగుతున్న దాడులపై ఎందుకు స్పందించడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్. రెడ్డి సాహెబ్ ప్రశ్నించారు. మంగళవారం మదనపల్లెలోని ఇందిరానగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సమావేశంలో అన్నమయ్య జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శరత్ కుమార్ రెడ్డి, నాయకులు ఈశ్వరయ్య, మహమ్మద్ అలీ, హబీబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్. రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ, 2024 ఎన్నికల్లో కూటమికి మద్దతుగా నిలిచిన యువత, నిరుద్యోగుల సమస్యలను పవన్ కల్యాణ్ పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ప్రశ్నాపత్రాల లీకేజీలపై యువత 23 రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, వారి సమస్యలను తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి ఎలాంటి ప్రయత్నం చేయలేదన్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనతో విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురయ్యారని, నిరుద్యోగుల ఆందోళనల్లో జరిగిన ఘర్షణలు, దాడులపై కూడా పవన్ కల్యాణ్ స్పందించకపోవడం బాధాకరమన్నారు.

అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శించారని మాత్రమే బహిరంగ సభలో వ్యాఖ్యానించడం ఆయన వైఖరిని స్పష్టంగా చూపిస్తోందని ఆరోపించారు. చే గువేరా భావజాలాన్ని ఆదర్శంగా చెప్పుకున్న పవన్ కల్యాణ్, ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. వేలాది పుస్తకాలు చదివినట్లు చెప్పడం కంటే, వాటిలోని విలువలను ప్రజల కోసం అమలు చేయడం ముఖ్యమన్నారు.

దేశంలో గత 12 ఏళ్లలో పలుమార్లు ప్రశ్నాపత్రాల లీకేజీలు జరిగినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం వాటిని అరికట్టడంలో విఫలమైందని ఆరోపించారు. యువత భవిష్యత్తుతో ముడిపడిన అంశాలపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. యువత సమస్యలను తక్కువ చేసి చూడకుండా, వారి ఆవేదనను అర్థం చేసుకుని స్పందించాలని పవన్ కల్యాణ్‌కు సూచించారు. లేదంటే యువత ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story