Kalikiri: కలికిరి సీఆర్పీఎఫ్‌ కేంద్రంలో భవనాలు ప్రారంభించిన మంత్రి

Kalikiri: కలికిరి సీఆర్పీఎఫ్‌ కేంద్రంలో రూ.26 కోట్లతో నిర్మించిన నూతన భవనాలను ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 17 Aug 2026 4:20 PM IST
Kalikiri
X

Kalikiri: కలికిరి సీఆర్పీఎఫ్‌ కేంద్రంలో భవనాలు ప్రారంభించిన మంత్రి

కలికిరి: దేశ అంతర్గత భద్రతను కాపాడటంలో సీఆర్పీఎఫ్‌ బలగాలు చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్ అన్నారు. సీఆర్పీఎఫ్‌ జవాన్ల వల్లే దేశం సురక్షితంగా ఉందనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందని పేర్కొన్నారు. దేశ భద్రత, సార్వభౌమత్వ పరిరక్షణ కోసం 24 గంటలూ విధులు నిర్వహిస్తున్న జవాన్ల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి టీటీడీ సభ్యుడు భానుప్రకాశ్‌, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో కలికిరిలోని సీఆర్పీఎఫ్‌ కేంద్రానికి చేరుకున్న కేంద్ర మంత్రి తొలుత అమరవీరుల స్థూపాన్ని సందర్శించి నివాళులర్పించారు. సీఆర్పీఎఫ్‌ ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

రూ.26 కోట్లతో ఆధునిక భవనాలు

కలికిరి సీఆర్పీఎఫ్‌ కేంద్రంలో రూ.26 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆఫీసర్స్‌ మెస్‌, సబార్డినేట్‌ ఆఫీసర్స్‌ మెస్‌, రిక్రియేషన్‌ క్లబ్‌, స్టోర్‌ బ్లాక్‌, ట్రేడ్స్‌మెన్‌ బ్లాక్‌ భవన సముదాయాలను కేంద్ర మంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

వీటిలో రూ.9.47 కోట్లతో ఆఫీసర్స్‌ మెస్‌, రూ.7.90 కోట్లతో సబార్డినేట్‌ ఆఫీసర్స్‌ మెస్‌, రూ.4.90 కోట్లతో రిక్రియేషన్‌ క్లబ్‌, రూ.4.55 కోట్లతో స్టోర్‌ బ్లాక్‌ నిర్మించారు. ఈ ఆధునిక మౌలిక వసతులు సీఆర్పీఎఫ్‌ అధికారులు, జవాన్లకు మెరుగైన సౌకర్యాలను అందించడంతో పాటు వారి విధి నిర్వహణ సామర్థ్యాన్ని మరింత పెంచనున్నాయి.

ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్‌ జవాన్లు, అధికారులకు అందుతున్న సౌకర్యాలపై కేంద్ర మంత్రి ఆరా తీశారు. కొత్తగా నిర్మించిన భవనాలను పరిశీలించి వాటి వినియోగం, నిర్వహణ తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

జవాన్ల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యం

ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్‌ జవాన్లను ఉద్దేశించి బండి సంజయ్‌ కుమార్ మాట్లాడుతూ, కొత్తగా ప్రారంభించిన భవనాలు కేవలం నిర్మాణాలు మాత్రమే కాదని, జవాన్ల సంక్షేమం, సౌకర్యాలు, పనితీరు మెరుగుపర్చాలనే కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు ప్రతీకలని అన్నారు.

దేశ అంతర్గత భద్రత, సార్వభౌమత్వ పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్‌ సిబ్బందికి సాధ్యమైనంత మెరుగైన, ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు.

రిక్రియేషన్‌ క్లబ్‌తో ఒత్తిడి దూరం

కఠినమైన విధుల అనంతరం జవాన్లు కొంత సమయం ప్రశాంతంగా గడిపేందుకు రిక్రియేషన్‌ క్లబ్‌ ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. జవాన్ల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఆటలు, క్రీడలు, వినోద కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇది దోహదపడుతుందన్నారు.

స్టోర్‌, ట్రేడ్స్‌మెన్‌ బ్లాక్‌లు ముఖ్యమైన వస్తువులు, వనరులను సురక్షితంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు ఉపయోగపడతాయని చెప్పారు. ఆధునిక సౌకర్యాలతో కూడిన ఈ భవనాలు బలగాల కార్యాచరణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.

సీఆర్పీఎఫ్‌ ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మార్గదర్శకత్వంలో సీఆర్పీఎఫ్‌ సహా కేంద్ర సాయుధ పోలీసు బలగాల ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని బండి సంజయ్‌ తెలిపారు.

జవాన్లతో పాటు వారి కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. జవాన్లు దేశ భద్రత కోసం విధుల్లో ఉన్నప్పుడు దేశ ప్రజలు సురక్షితంగా ఉన్నామనే నమ్మకంతో ఉంటారని, అందుకే వారి ప్రతి అవసరాన్ని చూసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.

కొత్త భవనాల నిర్మాణాన్ని రికార్డు సమయంలో పూర్తి చేసిన ఇంజనీర్లు, కార్మికులు, అధికారులు, సిబ్బందిని కేంద్ర మంత్రి అభినందించారు. ఈ ఆధునిక సౌకర్యాలు జవాన్ల ఆత్మవిశ్వాసం, మనోధైర్యాన్ని మరింత పెంచి దేశ సేవకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయని అన్నారు.

2017లో కలికిరి సీఆర్పీఎఫ్‌ కేంద్రం ఏర్పాటు

వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే సిబ్బందికి యాంటీ టెర్రరిజం, కౌంటర్‌ ఇన్‌సర్జెన్సీ వంటి ప్రత్యేక నైపుణ్యాల్లో శిక్షణ అందించాలనే లక్ష్యంతో కలికిరిలో 2017 మే 11న సీఆర్పీఎఫ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2018లో మౌలిక వసతుల అభివృద్ధి చేపట్టగా, 2019 నుంచి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్‌ ఏడీజీ సౌత్‌ జోన్‌ రవిదీప్‌ సింగ్‌ సాహి, ఐజీ దినేష్‌ ప్రతాప్‌ ఉపాధ్యాయ్‌, బ్రిగేడియర్‌ అనుపమ్‌ శర్మ, డీఐ సుభాష్‌ చంద్రశర్మ, చీఫ్‌ ఇంజనీర్‌ సీఎన్‌ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story