Madanapalle: ఏపీ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో 5 పతకాలు సాధించిన శశికళ!
Madanapalle: ఏపీ పోలీస్ తొలి రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో మదనపల్లె కానిస్టేబుల్ శశికళ రెండు స్వర్ణాలతో సహా ఐదు పతకాలు సాధించి సంచలనం సృష్టించారు.
Madanapalle: ఏపీ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో 5 పతకాలు సాధించిన శశికళ!
Madanapalle: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ తొలిసారిగా నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో అన్నమయ్య జిల్లా మదనపల్లి శక్తి టీమ్ కు చెందిన శశికళ కళ అసాధారణ ప్రతిభ కనబరిచి ఐదు పతకాలతో చరిత్ర సృష్టించింది. అమరావతి సమీపంలోని VIT-AP యూనివర్సిటీలో జరిగిన 1st AP State Police Sports & Games Meet-2026 లో కర్నూలు రేంజ్ తరపున బరిలోకి దిగిన శశికళ, పలు విభాగాల్లో తన పటిమ చూపింది.
రెండు స్వర్ణాలు, ఒక కాంస్యం:
వ్యక్తిగత విభాగాల్లో ఆమె తిరుగులేని ఆధిపత్యం చాటింది. హ్యాండ్ రెజ్లింగ్ (ఆర్మ్ రెజ్లింగ్) లో బలమైన ప్రత్యర్థులను సునాయాసంగా ఓడించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అదే జోష్ తో బాక్సింగ్ రింగ్ లోకి దిగి పంచ్ ల మీద పంచ్ లు కురిపిస్తూ రెండో గోల్డ్ మెడల్ ను తన ఖాతాలో వేసుకుంది. మహిళా రెజ్లింగ్ విభాగంలోనూ అద్భుతంగా పోరాడి కాంస్య పతకం (3వ స్థానం) సాధించింది.
జట్టు క్రీడల్లోనూ సత్తాచాటారు:
జట్టు క్రీడల్లో కూడా తన జట్టుకు వెన్నుదన్నుగా నిలిచింది. కర్నూలు రేంజ్ మహిళా బాస్కెట్ బాల్ జట్టు రాష్ట్రస్థాయిలో రన్నరప్ గా నిలవడంలో కీలక పాత్ర పోషించింది. అలాగే మహిళా హ్యాండ్ బాల్ జట్టు 3వ స్థానం సాధించడంలో తనవంతు కృషి చేసింది.
దీంతో ఒకే మీట్ లో 2 గోల్డ్, 1 సిల్వర్ టీమ్ మెడల్, 2 బ్రాంజ్ మెడల్స్ తో మొత్తం 5 పతకాలు సాధించిన ఘనత ఆమె సొంతమైంది. మహిళా భద్రత కోసం పనిచేసే శక్తి టీమ్ లో విధులు నిర్వహిస్తూనే, క్రీడల్లోనూ మహిళా పోలీసుల శక్తి ఏంటో శశికళ నిరూపించిందని జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు. ఆమె విజయం జిల్లాలోని ఇతర మహిళా పోలీసులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.




