Madanapalle: మదనపల్లె కలెక్టరేట్ వద్ద దళిత, గిరిజనుల భారీ ధర్నా!

Madanapalle: మదనపల్లె కలెక్టరేట్ వద్ద దళిత, గిరిజనుల హక్కుల కోసం భారీ ధర్నా. సబ్‌ప్లాన్ నిధులు, భూ పంపిణీ, స్మశాన స్థలాల కోసం ఏఐఏడబ్ల్యూయూ, కేవీపీఎస్ నిరసన.

Srinivasulu, Madanapalle
Published on: 2 Sept 2026 6:47 AM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె కలెక్టరేట్ వద్ద దళిత, గిరిజనుల భారీ ధర్నా!

Madanapalle: దళిత, గిరిజనుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం (AIAWU), కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

“కుల వివక్షకు చరమగీతం పాడాలి.. దళిత, గిరిజనులకు న్యాయం చేయాలి” అనే డిమాండ్‌తో మిషన్ కాంపౌండ్ నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన ధర్నాలో వృత్తి సంఘాల రాష్ట్ర కార్యదర్శి పి. వెంకటరావు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 80 ఏళ్లు గడిచినా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కులు, ఆశయాలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

జస్టిస్ పున్నయ్య కమిషన్ నివేదిక మేరకు దళిత, గిరిజనులకు కేటాయించిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను పక్కదారి పట్టించకుండా పూర్తిస్థాయిలో కేటాయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కోనేరు రంగారావు సిఫారసులను అమలు చేసి భూమిలేని ప్రతి దళిత వ్యవసాయ కుటుంబానికి రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించాలని కోరారు.

జిల్లాలోని అనేక గ్రామాల్లో స్మశాన వాటికలకు స్థలాలు లేవని సర్వేలో తేలిందని, జీవో 1235ను పక్కాగా అమలు చేసి ప్రతి గ్రామానికి స్మశాన స్థలాలను కేటాయించి అభివృద్ధి చేయాలని అన్నారు. దళిత, గిరిజనుల భూములు, స్మశాన వాటికల సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు.

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధీర్ కుమార్ మాట్లాడుతూ, దళిత కాలనీల్లో తాగునీరు, డ్రైనేజీ, వీధిలైట్ల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మృతులను ఖననం చేసేందుకు కూడా స్థలం లేని దుస్థితి నెలకొందన్నారు.

సామాజిక శంఖారావం కార్యక్రమం ద్వారా జిల్లాలో ఇప్పటికీ కొనసాగుతున్న కుల వివక్షను గుర్తించామని తెలిపారు. కొన్ని గ్రామాల్లో దళితులకు క్షౌరం, హెయిర్ కటింగ్ చేయని పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం నాయకులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు శ్రీనివాసులు, హరిశర్మ, రామాంజులు, నాగరాజు, రామచంద్ర, రమేష్ బాబు, రమణ, నందు, రమణమ్మ, ఓబులమ్మతో పాటు వివిధ దళిత కాలనీలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story