Sri Sathya Sai District: ఉపాధి కూలీల సమస్యలపై సంఘం ఆందోళన
Sri Sathya Sai District: శ్రీ సత్యసాయి జిల్లాలో ఉపాధి కూలీల సమస్యలపై వ్యవసాయ కార్మిక సంఘం స్పందించి వేతనాలు, సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేసింది.
Sri Sathya Sai District
Sri Sathya Sai District: శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం బిల్లురూవాండ్లపల్లి అటవీ ప్రాంతంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలను వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బి కదిరప్ప కూలీలతో మాట్లాడారు.
ఎండాకాలంలో మండే ఎండల్లో పనిచేస్తున్న కూలీలు వడదెబ్బకు గురవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలిపారు. అనేక పనిస్థలాల్లో త్రాగునీరు, నీడ, మెడికల్ కిట్లు వంటి కనీస సదుపాయాలు లేకపోవడం వల్ల కూలీల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పలు సమస్యలను ప్రస్తావిస్తూ, పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని, పనిస్థలాల్లో త్రాగునీరు, నీడ టెంట్లు, మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వడదెబ్బ నివారణ కోసం మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. NMMS ఫోటో టైమింగ్‌ను ఉదయం 8:30 వరకు పెంచాలని కోరారు.
గ్రామీణ ఉపాధి చట్టం ప్రకారం కూలీలకు కల్పించాల్సిన హక్కులను పూర్తిగా అమలు చేయాలని, కూలీల ప్రాణ భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ సమస్యలను ఇప్పటికే సంబంధిత మండల అధికారులకు తెలియజేసినట్లు, జిల్లా కలెక్టర్, పీడీ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా మండలాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వేసవికాలంలో ఉపాధి కూలీల పనిస్థలాలను పర్యవేక్షిస్తూ వారి భద్రత కోసం చర్యలు తీసుకుంటామని వ్యవసాయ కార్మిక సంఘం వెల్లడించింది.
ఈ కార్యక్రమంలో నరసింహులు, శేఖర్ రెడ్డి, సత్యనారాయణ నాయక్, గంగాద్రి, బాబ్జాన్, బీమ్ల నాయక్ తదితర ఉపాధి కూలీలు పాల్గొన్నారు.




