Zepto: జెప్టో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. టార్గెట్ రూ. 8,400 కోట్లు
Zepto: 1 బిలియన్ డాలర్ల నిధుల సేకరణే లక్ష్యంగా స్టాక్ మార్కెట్లోకి అడుగుపెడుతున్న క్విక్ కామర్స్ దిగ్గజం.
Zepto: జెప్టో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. టార్గెట్ రూ. 8,400 కోట్లు
Zepto IPO: భారతీయ రిటైల్ రంగంలో క్విక్ కామర్స్ తుపాను సృష్టిస్తోంది. కిరాణా సామాను కావాలన్నా, స్మార్ట్ ఫోన్ కావాలన్నా.. నిమిషాల్లో ఇంటి ముందుకు తెచ్చిస్తున్న జెప్టో ఇప్పుడు మరో సంచలనానికి సిద్ధమైంది. అద్దె గదిలో ఇద్దరు కుర్రాళ్లు ప్రారంభించిన ఈ స్టార్టప్, ఇప్పుడు దేశీ స్టాక్ మార్కెట్ గడప తొక్కేందుకు సిద్ధమైంది.
1 బిలియన్ డాలర్ల గురి
జెప్టో ప్రతిపాదించిన రూ. 8,400 కోట్ల ఐపీఓకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పచ్చజెండా ఊపింది. గతేడాది డిసెంబర్‌లోనే దీని కోసం దరఖాస్తు చేసుకోగా, తాజాగా ఆమోదం లభించింది. దీనితో జూలై నాటికి దలాల్ స్ట్రీట్‌లో జెప్టో షేర్లు సందడి చేసే అవకాశం ఉంది.
పోటీ పెరిగినా.. పట్టు వదలని జెప్టో
ప్రస్తుతం క్విక్ కామర్స్ మార్కెట్‌లో బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి దిగ్గజాలతో జెప్టో హోరాహోరీగా పోరాడుతోంది. సుమారు 10-11 బిలియన్ డాలర్ల విలువైన ఈ మార్కెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జెప్టో, ఐపీఓ ద్వారా సేకరించిన నిధులతో తన నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయాలని భావిస్తోంది.
ఐపీఓ సమయంలో కంపెనీ విలువ సుమారు 7 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా.రాబోయే 6 నుంచి 7 వారాల్లో అప్‌డేట్ చేసిన పత్రాలను సమర్పించి, జూలై నాటికి మార్కెట్లోకి రావాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, ఇండియన్ కన్స్యూమర్ మార్కెట్‌పై నమ్మకంతో ఇన్వెస్టర్లు జెప్టో వైపు మొగ్గు చూపుతున్నారు.
పెట్టుబడిదారుల కన్ను..
టెక్ మరియు స్టార్టప్ ఐపీఓల విషయంలో ప్రస్తుతం ఇన్వెస్టర్లు కాస్త అప్రమత్తంగా ఉన్నప్పటికీ, జెప్టో వృద్ధి రేటు ఆశాజనకంగా ఉంది. ఈ ఐపీఓ విజయవంతమైతే, భారతీయ క్విక్ కామర్స్ రంగంలో ఇది ఒక మైలురాయిగా నిలవనుంది. కేవలం డెలివరీ సమయంతోనే కాకుండా, మార్కెట్ లిస్టింగ్‌లో కూడా జెప్టో అదే వేగాన్ని చూపిస్తుందో లేదో చూడాలి.




