Wipro: ఉద్యోగులను నమ్మించి మోసం చేసిన విప్రో
Wipro: విప్రో ఆన్‌బోర్డింగ్ ఆలస్యంపై కేంద్ర కార్మిక శాఖకు NITES ఫిర్యాదు. ఆఫర్ లెటర్స్ వచ్చినా ఉద్యోగాల్లోకి తీసుకోకపోవడంపై యంగ్ ఇంజనీర్ల తీవ్ర ఆందోళన.
Wipro: ఉద్యోగులను నమ్మించి మోసం చేసిన విప్రో
Wipro Elite Hiring: ఒకప్పుడు బాబు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని చెబితే చాలు.. పెళ్లిళ్ల బ్రోకర్ల దగ్గర నుంచి బంధువుల వరకు అందరి చూపు ఆ కుర్రాడి వైపే ఉండేది. లైఫ్ పూర్తిగా సెటిల్ అయిపోయినట్లేనన్న ధీమా కొట్టొచ్చినట్లు కనిపించేది. కానీ కాలం మారింది... సీన్ రివర్స్ అయింది. నేడు అదే ఐటీ రంగం నిరుద్యోగిత, లేఆఫ్స్, అపారమైన మానసిక ఒత్తిళ్లతో కొట్టుమిట్టాడుతోంది.
ఆర్థిక మందగమనం, ప్రాజెక్టుల కోతలు, దానికి తోడు ఊహించని వేగంతో దూసుకొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తుఫాను.. సంప్రదాయ ఐటీ సేవలను కోలుకోలేని దెబ్బతీశాయి. ఒకప్పుడు బలిష్టమైన కోటలా కనిపించిన దిగ్గజ ఐటీ కంపెనీలు ఇప్పుడు ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి.
గత 2-3 ఏళ్లుగా ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్లను గణనీయంగా తగ్గించేశాయి. ఇది చాలదన్నట్లు, ఎంపిక చేసిన విద్యార్థులకు ఆఫర్ లెటర్లు చేతికి ఇచ్చి... ఆ తర్వాత నెలల తరబడి, ఏళ్ల తరబడి ఆన్‌బోర్డింగ్ చేయకుండా 'వెయిటింగ్ లిస్ట్'లో పెట్టడం కొత్త పరిపాటిగా మారింది.
గతంలో ఇన్ఫోసిస్ విషయంలోనూ ఇలాంటి వివాదమే తలెత్తగా, తీవ్ర విమర్శల తర్వాత ఎట్టకేలకు అభ్యర్థులను విధుల్లోకి తీసుకుంది. ఇప్పుడు సరిగ్గా అలాంటి చిక్కుల్లోనే మరొక భారతీయ టాప్ ఐటీ దిగ్గజం విప్రో చిక్కుకుంది.
విప్రో నిర్వహించిన ఎలైట్ హైరింగ్ 2025 డ్రైవ్‌లో దాదాపు 200 మందికి పైగా యంగ్ ఇంజనీర్లు టెక్నికల్, వాయిస్ అసెస్మెంట్ టెస్టులతో పాటు కఠినమైన ఇంటర్వ్యూలను విజయవంతంగా పూర్తి చేశారు. ఆఫర్ లెటర్లు చేతికొచ్చి నెలలు గడుస్తున్నా ఆన్‌బోర్డింగ్ దిక్కులేదు. సంస్థ నుంచి ఎలాంటి స్పష్టమైన సమాధానం లేకపోవడంతో, ఆఫర్ లెటర్ నమ్ముకుని ఇతర ఉద్యోగ అవకాశాలను వదులుకున్న ఈ యువ ఇంజనీర్లు ఇప్పుడు తీవ్ర ఆర్థిక, మానసిక వేదనను అనుభవిస్తున్నారు.
ఈ ఆందోళనకర పరిస్థితిపై ఐటీ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడే నాసెంట్ ఇన్ఫర్మైన టెక్నాలజీ ఎంప్లాయీస్ సేనెట్ రంగంలోకి దిగింది. అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఈ వైఖరిపై కేంద్ర కార్మిక శాఖకు ఫిర్యాదు చేసింది.
NITES ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలుజా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాస్తూ.. విప్రో అనుసరిస్తున్న సుదీర్ఘ నిరీక్షణ విధానంలో వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. సరైన వివరణ లేకుండా ఆన్‌బోర్డింగ్‌ను ఆలస్యం చేయడం వల్ల యువత మానసికంగా, వృత్తిపరంగా తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం జోక్యంతోనైనా విప్రో నుంచి స్పష్టమైన ప్రకటన వస్తుందా? 200 మందికి పైగా ఎదురుచూస్తున్న ఆ యంగ్ ఇంజనీర్ల నిరీక్షణకు తెరపడుతుందో లేదో వేచి చూడాలి.




