White Collar Jobs: హైదరాబాద్‌లో హైరింగ్ జోరు.. 23% వృద్ధి!

White Collar Jobs: ఆగస్టులో భారత వైట్ కాలర్ నియామకాలు 14 శాతం పెరిగాయి. మెట్రో నగరాల్లో హైదరాబాద్ 23 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 Sept 2026 4:00 AM IST
White Collar Jobs
X

White Collar Jobs: హైదరాబాద్‌లో హైరింగ్ జోరు.. 23% వృద్ధి!

White Collar Jobs: దేశంలో వైట్-కాలర్ (ఉద్యోగ) నియామకాలు మళ్లీ పుంజుకున్నాయి. ఆటో, హెల్త్‌కేర్, రిటైల్ వంటి కీలక రంగాల్లో చోటుచేసుకున్న సానుకూల పరిణామాల కారణంగా ఆగస్టు నెలలో వైట్-కాలర్ నియామకాలు గతేడాదితో పోలిస్తే ఏకంగా 14 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఈ క్రమంలో రిక్రూట్‌మెంట్ యాక్టివిటీని గణించే 'నౌక్రీ జాబ్‌స్పీక్ ఇండెక్స్' (Naukri JobSpeak Index) గత ఏడాది ఆగస్టులో ఉన్న 2,664 పాయింట్ల నుంచి ఈసారి 3,028కి ఎగబాకింది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలన్నింటిలోనూ అత్యధికంగా 23 శాతం నియామకాల వృద్ధితో తెలంగాణ రాజధాని హైదరాబాద్ మొదటి స్థానంలో నిలవడం విశేషం.

ఐటీ మరియు నాన్-ఐటీ విభాగాలు రెండింటితో పాటు అన్ని అనుభవ స్థాయిల్లోనూ ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యాయని నివేదిక స్పష్టం చేసింది. సీనియర్ అనుభవజ్ఞులతో (13-16 ఏళ్లు) పాటు ఫ్రెషర్ల నియామకాల్లోనూ 15 శాతం వృద్ధి నమోదైంది. రంగాల వారీగా పరిశీలిస్తే ఆటోమొబైల్ రంగం అత్యధికంగా 19 శాతం వృద్ధి సాధించగా, హెల్త్‌కేర్ 16 శాతం, రిటైల్ 15 శాతం, బీమా 12 శాతం మరియు ఐటీ రంగం 11 శాతం వృద్ధిని కనబరిచాయి. అయితే, హాస్పిటాలిటీ, ట్రావెల్ (4%), ఎడ్యుకేషన్ (8%) రంగాల్లో నియామకాలు కొంత తగ్గుముఖం పట్టాయి.

మెట్రో నగరాల్లో హైదరాబాద్ (23%) తర్వాతి స్థానాల్లో కోల్‌కతా (22%), చెన్నై (20%) నిలిచాయి. నియామకాల్లో నమోదు అవుతున్న ఈ సానుకూల ధోరణిపై ఇన్ఫో ఎడ్జ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ హితేష్ ఒబెరాయ్ స్పందిస్తూ.. ఈ గణాంకాలను పండుగల క్యాలెండర్ మారుతున్న నేపథ్యంలో గమనించాల్సి ఉంటుందన్నారు. గతేడాది పండుగల సీజన్ ఆగస్టులోనే ఉండగా, ఈసారి సెప్టెంబర్‌కు మారడం వల్ల పండుగ త్రైమాసికం పూర్తయితేనే అసలు ట్రెండ్‌పై మరింత స్పష్టత వస్తుందని ఆయన విశ్లేషించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story