Volkswagen Sheep Solar Farm: ఫోక్స్‌వ్యాగన్ కంపెనీలో 100 గొర్రెలకు ఉద్యోగం.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వినూత్న నిర్ణయం..!

Volkswagen Sheep Solar Farm: పరిశ్రమలు అంటే పొగ, కాలుష్యం, శబ్దాలు మాత్రమే కాదు.. ప్రకృతితో మమేకమై కూడా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని నిరూపించింది ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్.

Venkat
Published on: 21 July 2026 10:53 AM IST
Volkswagen Sheep Solar Farm
X

Volkswagen Sheep Solar Farm: ఫోక్స్‌వ్యాగన్ కంపెనీలో 100 గొర్రెలకు ఉద్యోగం.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వినూత్న నిర్ణయం..!

Volkswagen Sheep Solar Farm: పరిశ్రమలు అంటే పొగ, కాలుష్యం, శబ్దాలు మాత్రమే కాదు.. ప్రకృతితో మమేకమై కూడా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని నిరూపించింది ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్. గడ్డి కోసే యంత్రాలకు గుడ్‌బై చెప్పి, 100 గొర్రెలను రంగంలోకి దించిన ఆసక్తికర కథనం మీకోసం.

సాంకేతికత విపరీతంగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో పెద్ద పెద్ద కంపెనీలు అత్యాధునిక యంత్రాలపై ఆధారపడుతుంటాయి. కానీ ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ మాత్రం పూర్తి భిన్నంగా ఆలోచించింది. పోలాండ్‌లోని తన సోలార్ విద్యుత్ కేంద్రంలో గడ్డిని సరిసమానంగా ఉంచడానికి ఇంధనంతో నడిచే యంత్రాలను కాకుండా, ఏకంగా 100 గొర్రెల మందను మేత కోసం మోహరించింది. వినడానికి వింతగా ఉన్నప్పటికీ, పర్యావరణ పరిరక్షణ, రసాయన రహిత ఇంధన వినియోగంలో ఇదొక విప్లవాత్మకమైన అడుగుగా అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటోంది.

యంత్రాల స్థానంలో గొర్రెలు ఎందుకు?

పోలాండ్‌లోని పోజ్నాన్ ప్రాంతంలో ఉన్న ఫోక్స్‌వ్యాగన్ వాహన తయారీ కర్మాగారానికి విద్యుత్‌ను అందించడానికి దాదాపు 31 వేలకు పైగా సోలార్ ప్యానెళ్లతో భారీ సోలార్ ఫామ్‌ను ఏర్పాటు చేశారు. వీటి కింద నిరంతరం పెరిగే గడ్డి వల్ల సోలార్ ప్యానెళ్లపై నీడ పడి విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతుంది. సాధారణంగా దీని కోసం పెట్రోల్, డీజిల్‌తో నడిచే యంత్రాలను ఉపయోగిస్తారు. కానీ వాటి నుంచి వచ్చే పొగ, శబ్దం, కార్బన్ ఉద్గారాలను అరికట్టడానికి ఫోక్స్‌వ్యాగన్ ఈ 'గొర్రెల మేత' పద్ధతిని ఎంచుకుంది.

ప్రకృతి సిద్ధమైన నిర్వహణ..!

ఈ గొర్రెలు సోలార్ ప్యానెళ్ల కింద మేత మేయడం వల్ల యంత్రాల అవసరం లేకుండానే గడ్డి క్రమబద్ధంగా ఉంటుంది. యంత్రాలు వాడేటప్పుడు ఎగిరిపడే రాళ్ల వల్ల సోలార్ ప్యానెళ్లు దెబ్బతినే ప్రమాదం ఉండేది, ఇప్పుడు ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికింది. అంతేకాకుండా, గొర్రెల సంచారం వల్ల నేలలో సహజమైన ఎరువులు చేరి జీవవైవిధ్యం పెరుగుతోందని, అనేక కీటకాలు, చిన్నజీవులకు ఇది సురక్షితమైన నివాసంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు.

శాస్త్రవేత్తల పరిశోధనలకు కేరాఫ్ అడ్రస్..

ఈ వినూత్న ప్రయోగానికి విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కూడా జతకలిశారు. పోజ్నాన్ లైఫ్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ ప్రాజెక్ట్‌పై అధ్యయనం చేస్తున్నారు. సోలార్ ప్యానెళ్ల కింద ఏర్పడే నీడ గొర్రెలకు ఎండ వేడి నుంచి రక్షణ ఇస్తోందా? నేల సారం ఏ విధంగా మారుతోంది? అనే అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు. గొర్రెల యజమానులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ గొర్రెలు ఎంతో ప్రశాంతంగా, సురక్షితంగా ఇక్కడ మేత మేస్తున్నట్లు గుర్తించారు.

25 శాతం విద్యుత్ ఇక్కడే ఉత్పత్తులు..

ఈ 18.3 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ద్వారా ఫోక్స్‌వ్యాగన్ ఫ్యాక్టరీకి అవసరమైన మొత్తం విద్యుత్‌లో దాదాపు 25 శాతాన్ని శుద్ధ విద్యుత్ రూపంలో పొందుతున్నారు. మంచి ఎండ ఉన్న రోజుల్లో అయితే ఫ్యాక్టరీకి కావాల్సిన పూర్తి విద్యుత్‌ను ఈ సోలార్ ప్యానెళ్లే అందిస్తాయి. ఇక్కడ ఈ-క్రాఫ్టర్ వంటి ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేస్తున్నారు.

ఆధునిక పారిశ్రామిక రంగానికి, ప్రకృతికి మధ్య సమతుల్యతను కాపాడవచ్చని ఫోక్స్‌వ్యాగన్ రుజువు చేసింది. 'అగ్రివోల్టాయిక్స్' అని పిలిచే ఈ విధానం ద్వారా ఇటు పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తూనే, అటు వ్యవసాయానికి, జీవవైవిధ్యానికి ఊతమివ్వడం నిజంగా అభినందనీయం. భవిష్యత్తులో ఇతర పెద్ద పరిశ్రమలు కూడా ఈ మార్గాన్ని అనుసరిస్తే పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది!

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story