UPI: యూపీఐ చెల్లింపుల్లో మరో సంచలనం..ఇక నెట్‌వర్క్ లేకపోయినా నో ప్రాబ్లమ్!
UPI: ఇంటర్నెట్, మొబైల్ సిగ్నల్ లేకపోయినా క్షణాల్లో యూపీఐ చెల్లింపులు పూర్తి చేసే సరికొత్త NFC ట్యాప్-టు-పే విధానాన్ని ఎన్‌పీసీఐ తీసొస్తోంది.
UPI: యూపీఐ చెల్లింపుల్లో మరో సంచలనం..ఇక నెట్‌వర్క్ లేకపోయినా నో ప్రాబ్లమ్!
UPI Payments: డిజిటల్ చెల్లింపుల విప్లవంలో భారతదేశం ఇప్పటికే ప్రపంచానికే రోల్ మోడల్‌గా నిలిచింది. కానీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో, భూగర్భ టన్నెళ్లలో లేదా విమాన ప్రయాణాల్లో ఉన్నప్పుడు నెట్‌వర్క్ సిగ్నల్ సరిగా లేక పేమెంట్ ఫెయిల్డ్ అనే మెసేజ్ చూసి విసిగిపోతున్నారా? ఇకపై ఆ తిప్పలు అస్సలు ఉండవు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్స్ రంగంలో మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టబోతోంది. ఇకపై మీ ఫోన్‌కి ఇంటర్నెట్ లేకపోయినా, అసలు మొబైల్ సిగ్నలే లేకపోయినా క్షణాల్లో యూపీఐ చెల్లింపులు పూర్తి చేయవచ్చు.
ఈ సరికొత్త విధానం నియర్-ఫీల్డ్ కమ్యూనికేషన్ సాంకేతికత ఆధారంగా ట్యాప్-టు-పే పద్ధతిలో పనిచేస్తుంది. వ్యాపారి వద్ద ఉన్న పాయింట్ ఆఫ్ సేల్ మిషన్, మీ స్మార్ట్‌ఫోన్... ఈ రెండింటికీ ఇంటర్నెట్ లేదా నెట్‌వర్క్ సిగ్నల్ లేకపోయినా సరే చెల్లింపులు జరిగిపోతాయి. మీ స్మార్ట్‌ఫోన్‌ను వ్యాపారి వద్ద ఉండే PoS టెర్మినల్‌కు దగ్గరగా టచ్ చేస్తే చాలు.
బ్లూటూత్ కంటే అత్యంత వేగంగా, సురక్షితంగా లావాదేవీ పూర్తవుతుంది. పిన్ నంబర్ నమోదు చేయాల్సిన అవసరం లేకుండానే చెల్లింపు ప్రక్రియ జరుగుతుంది. ఈ సేవలను వినియోగించుకోవడానికి వినియోగదారులు ముందుగా ఇంటర్నెట్ ఉన్న సమయంలో యూపీఐ లైట్ వ్యాలెట్‌లో డబ్బులను లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆఫ్‌లైన్ NFC నెట్‌వర్క్-రహిత లావాదేవీకి గరిష్టంగా రూ. 2,000 వరకు చెల్లించవచ్చు. మొబైల్ సిగ్నల్స్ అస్సలు లేని భూగర్భ టన్నెళ్లు, రిమోట్ ప్రాంతాలు, ఫ్లైట్ ప్రయాణాలు లేదా విపరీతమైన రద్దీ వల్ల నెట్‌వర్క్ జామ్ అయిన ప్రదేశాల్లో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. ఇప్పటికే మనకు ఇంటర్నెట్ లేనప్పుడు పనిచేసే *99# సేవలు అందుబాటులో ఉన్నాయి.
అయితే డేటా అక్కర్లేకపోయినా, కనీసం మాట్లాడటానికి లేదా మెసేజ్ పంపడానికి సాధారణ GSM మొబైల్ సిగ్నల్ తప్పనిసరి. దీనికి ఎలాంటి మొబైల్ సిగ్నల్ లేదా నెట్‌వర్క్‌తో సంబంధం లేదు. అసలు ఫోన్ వ్యాలీలో నో సర్వీస్ అని ఉన్నా సరే, మీ పేమెంట్ క్షణాల్లో పూర్తవుతుంది. డిజిటల్ భారత్ ప్రయాణంలో ఇది మరో మైలురాయి కాబోతోంది. క్యాష్ లెస్ ఎకానమీ దిశగా భారత్ వేస్తున్న ఈ అడుగుతో ఇకపై నెట్‌వర్క్ లేదనే సాకుకు శాశ్వతంగా చెక్ పడినట్లే.




