UPI: ఇక‌పై క్యూఆర్ స్కాన్ అవ‌స‌రం లేదు.. ఫోన్ ట్యాప్ చేస్తే చాలు పేమెంట్ అవుతుంది

UPI: UPI చెల్లింపులు చేసే వారికి మరింత సౌకర్యం కల్పించేలా కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

Mokshith
Published on: 11 Sept 2026 7:21 PM IST
UPI
X

UPI: ఇక‌పై క్యూఆర్ స్కాన్ అవ‌స‌రం లేదు.. ఫోన్ ట్యాప్ చేస్తే చాలు పేమెంట్ అవుతుంది

UPI Payments: UPI చెల్లింపులు చేసే వారికి మరింత సౌకర్యం కల్పించేలా కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు దుకాణాల్లో పేమెంట్ చేయాలంటే UPI యాప్ ఓపెన్ చేసి QR కోడ్ స్కాన్ చేయాల్సి వచ్చేది. కొన్ని సందర్భాల్లో ఇంటర్నెట్ నెమ్మదిగా ఉండటంతో యాప్ ఓపెన్ కావడానికి కూడా సమయం పట్టేది. ఈ ఇబ్బందులకు పరిష్కారంగా ‘యూపీఐ ట్యాప్ అండ్ పే’ ఫీచర్‌ను తీసుకొచ్చారు.

UPI Tap & Pay ఎలా పనిచేస్తుంది?

UPI Tap & Pay కోసం NFC సదుపాయం ఉన్న స్మార్ట్‌ఫోన్ అవసరం. పేమెంట్ చేయాలనుకున్నప్పుడు ఫోన్‌ను అన్‌లాక్ చేసి, దుకాణంలోని NFCకి సపోర్ట్ చేసే PoS మెషీన్ లేదా స్మార్ట్ ట్యాగ్‌కు దగ్గరగా తీసుకెళ్లాలి. ఫోన్‌ను ట్యాప్ చేసిన తర్వాత మర్చంట్ మెషీన్‌ ద్వారా చెల్లింపు ప్రక్రియ కొనసాగుతుంది. సాధారణంగా QR కోడ్ స్కాన్ చేయడానికి UPI యాప్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ కొత్త విధానంలో ఆ ప్రక్రియ ఉండదు. పేమెంట్ కోసం మర్చంట్ మెషీన్‌లో ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫోన్‌లో మొబైల్ నెట్‌వర్క్ బలహీనంగా ఉన్న ప్రదేశాల్లో ఇది ఉపయోగపడుతుంది. బేస్‌మెంట్లు, మెట్రో స్టేషన్లు, కొండ ప్రాంతాలు వంటి చోట్ల మొబైల్ సిగ్నల్ సమస్య ఉన్నా ఈ విధానం సౌకర్యంగా ఉండొచ్చు.

రూ.5,000 వరకు పిన్ అవసరం లేదా?

చిన్న మొత్తాల చెల్లింపులను మరింత వేగంగా పూర్తి చేసేందుకు రూ.5,000 వరకు UPI పిన్ లేకుండా పేమెంట్ చేసే సదుపాయం కూడా ఇందులో ఉంది. అంటే అర్హత ఉన్న లావాదేవీల్లో రూ.5,000 వరకు చెల్లించేటప్పుడు ప్రతిసారీ UPI పిన్ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. అయితే రూ.5,000 కంటే ఎక్కువ మొత్తానికి సాధారణంగా UPI పిన్ అవసరం ఉంటుంది. దీనివల్ల చిన్న మొత్తాల చెల్లింపులు మరింత త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సదుపాయాన్ని ఉపయోగించాలంటే ఫోన్‌లో NFC సపోర్ట్ ఉండటంతో పాటు మర్చంట్ వైపు కూడా Tap & Payకి అనుకూలమైన PoS మెషీన్ లేదా స్మార్ట్ ట్యాగ్ అందుబాటులో ఉండాలి.

MyUPI అంటే ఏంటి?

UPI Tap & Payతో పాటు ‘MyUPI’ అనే కొత్త సదుపాయాన్ని కూడా తీసుకొచ్చారు. ఇది AI ఆధారంగా పనిచేసే కస్టమర్ సపోర్ట్, కంట్రోల్ ప్లాట్‌ఫామ్‌గా రూపొందించారు. NPCIకి చెందిన ‘FiMI’ అనే స్మాల్ లాంగ్వేజ్ మోడల్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉండొచ్చు. అలాగే గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎమ్ వంటి వేర్వేరు UPI యాప్‌లను కూడా ఉపయోగిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో వివిధ ఖాతాలు, యాప్‌లలో జరిగిన UPI లావాదేవీలు, ఆటో-పే మాండేట్ల వివరాలను ఒకే చోట తెలుసుకునేలా MyUPI ఉపయోగపడుతుంది. దీంతో ప్రతి యాప్ లేదా బ్యాంకు ఖాతాను విడివిడిగా పరిశీలించాల్సిన అవసరం తగ్గుతుంది.

మోసాలు జరిగితే ‘సేఫ్టీ స్విచ్‌’తో రక్షణ

MyUPIలో మరో ముఖ్యమైన సదుపాయం ‘Safety Switch’. ఖాతాలో అనుమానాస్పద లావాదేవీ జరుగుతోందని అనిపించినప్పుడు లేదా UPI మోసం జరిగిందనే అనుమానం వచ్చినప్పుడు ఈ సదుపాయం ఉపయోగపడుతుంది. ఒకే క్లిక్‌తో Safety Switchను యాక్టివేట్ చేసి ఖాతా నుంచి జరిగే UPI డెబిట్‌లను వెంటనే బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో మోసం మరింత పెరగకుండా వెంటనే చర్య తీసుకునే వీలు కలుగుతుంది. మొత్తంగా చూస్తే యూపీఐ ట్యాప్ అండ్ పే, మైయూపీఐ సదుపాయాలతో డిజిటల్ చెల్లింపులను మరింత సులభంగా, వేగంగా, సురక్షితంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా QR స్కాన్ చేయడం లేదా యాప్ ఓపెన్ చేయడంలో ఇబ్బంది పడే వారికి Tap & Pay ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.