UPI: యూపీఐ లావాదేవీల్లో భారత్ సరికొత్త రికార్డు..!
UPI: దేశంలో యూపీఐ చెల్లింపులు ఆగస్టు నెలలో 2,451 కోట్ల లావాదేవీలతో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాయి.
UPI: యూపీఐ లావాదేవీల్లో భారత్ సరికొత్త రికార్డు..!
UPI: టీ కొట్టు దగ్గర రూ. 10 టీ నుంచి మొదలుకొని, సూపర్ మార్కెట్‌లో రూ. 10 వేల బిల్లు వరకు... స్కాన్ అండ్ పే అనడం భారతీయులకు ఒక అలవాటుగా కాదు, దైనందిన జీవితంలో భాగమైపోయింది..! దేశంలో డిజిటల్ విప్లవ వేగం ఏ స్థాయిలో ఉందో తెలియజెప్పేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఆగస్టు నెల గణాంకాలే ప్రత్యక్ష నిదర్శనం. ఆగస్టు నెలలో భారతీయులు ఏకంగా 2,451 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిపి సరికొత్త ఆల్‌టైమ్ రికార్డు సృష్టించారు.
ఎన్‌పీసీఐ విడుదల చేసిన వివరాల ప్రకారం డిజిటల్ చెల్లింపులు కొత్త శిఖరాలను తాకాయి. జూలై నెలతో పోలిస్తే ఆగస్టులో యూపీఐ లావాదేవీల సంఖ్య 3.6 శాతం పెరిగి 2,451 కోట్లకు చేరింది. వరుసగా రెండో నెల కూడా యూపీఐ సరికొత్త రికార్డును నమోదు చేయడం విశేషం. ఆగస్టు నెలలో జరిగిన ఈ లావాదేవీల మొత్తం విలువ అక్షరాలా రూ. 29.82 లక్షల కోట్లు. దేశవ్యాప్తంగా రోజుకు సగటున 79.1 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రతీ సెకనుకూ వేల సంఖ్యలో డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయనే దానికి ఇది సాక్ష్యం.
చెల్లింపుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, మొత్తం విలువలో 0.2 శాతం స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. అంటే ప్రజలు కిరాణా షాపులు, ఆటో చార్జీలు, కూరగాయల కొనుగోలు వంటి అత్యంత చిన్న చిన్న అవసరాలకు కూడా క్యాష్ వాడటం మానేసి యూపీఐ వైపే మొగ్గు చూపుతున్నారని స్పష్టమవుతోంది. కేవలం యూపీఐ మాత్రమే కాకుండా ఇతర డిజిటల్ పేమెంట్ విధానాలు కూడా భారీగా పుంజుకున్నాయి. టోల్ ప్లాజాల వద్ద ప్రయాణాలు మరింత సులభతరం అవుతుండటంతో ఆగస్టులో ఫాస్టాగ్ చెల్లింపుల సంఖ్య 35.1 కోట్లకు చేరింది. బ్యాంకింగ్ ద్వారా తక్షణ నిధుల బదిలీ లావాదేవీలు 36 కోట్లుగా నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ ద్వారా 10.4 కోట్ల లావాదేవీలు జరిగాయి.
సాధారణ పౌరుడి నుంచి బహుళజాతి సంస్థల వరకు ప్రతీ ఒక్కరూ డిజిటల్ రూపంలోనే లావాదేవీలు నిర్వహించడానికి ఆసక్తి చూపుతున్నారు. నగదు రహిత లావాదేవీలు భారత్‌లో ఎంత వేగంగా విస్తరించాయో చెప్పడానికి ఈ తాజా రికార్డులే నిదర్శనమని ఫిన్‌టెక్ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత్ సాధిస్తున్న ఈ సాంకేతిక ప్రగతి ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుస్తోంది.




