Upcoming IPOs: వచ్చే వారం ఐపీఓల పండగ..లలితా జువెల్లరీ సహా 5 కొత్త IPOలు..!

Upcoming IPOs: ఆగస్ట్ 17 నుంచి 21 మధ్య రూ. 5,499 కోట్ల సమీకరణ లక్ష్యంతో రాబోతున్న 5 కొత్త ఐపీఓలు, లిస్టింగ్ కానున్న షిప్‌రాకెట్ సహా 5 కంపెనీల పూర్తి వివరాలు.

Naresh.k
Published on: 16 Aug 2026 10:26 AM IST
Upcoming IPOs
X

Upcoming IPOs: వచ్చే వారం ఐపీఓల పండగ..లలితా జువెల్లరీ సహా 5 కొత్త IPOలు..!

Lalitha Jewellery: భారత స్టాక్ మార్కెట్లో ప్రైమరీ విభాగానికి మంచి రోజులొచ్చాయి. ఐపీఓల పండగ వాతావరణం దలాల్ స్ట్రీట్‌లో గట్టిగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది మెయిన్‌బోర్డ్ పరిధిలోని 42 కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా ఏకంగా రూ. 54,378 కోట్లను సమీకరించి సరికొత్త రికార్డు సృష్టించాయి. ఇదే జోరును కొనసాగిస్తూ రాబోయే వారం కూడా ఇన్వెస్టర్లకు బోలెడన్ని అవకాశాలను పలకరించబోతోంది.

ఆగస్ట్ 17 నుంచి 21 మధ్య మార్కెట్లో ఒకవైపు కొత్త ఇష్యూలు నిధుల సమీకరణకు క్యూ కడుతుండగా, మరోవైపు గత వారం డబ్బులు సమీకరించిన కంపెనీలు స్టాక్ ఎక్స్చేంజీల్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. వచ్చే వారంలో రాబోతున్న 5 కంపెనీలు కలిపి మొత్తం రూ. 5,499.32 కోట్లను మార్కెట్ నుంచి సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందులో అత్యధిక నిధులను సమీకరిస్తున్న పెద్ద ఐపీఓగా హారిజన్ ఇండస్ట్రియల్ పార్క్స్ నిలిచింది. మొత్తం సమీకరించే నిధుల్లో దాదాపు 47 శాతం వాటా ఒక్క ఈ కంపెనీదే కావడం విశేషం. ఆ తర్వాతి స్థానంలో ప్రముఖ పసిడి సంస్థ లలితా జువెల్లరీ మార్ట్ ఉంది.

హారిజన్ ఇండస్ట్రియల్ పార్క్స్:

ఆగస్ట్ 17న ప్రారంభమై ఆగస్ట్ 19న ముగియనుంది. ఈ ఐపీఓ షేర్ ప్రైస్ బ్యాండ్ రూ. 57 నుంచి రూ. 60 కాగా, దాదాపు రూ. 2,600 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది.

లలితా జువెల్లరీ మార్ట్:

ఇది కూడా ఆగస్ట్ 17 నుంచి 19 వరకు అందుబాటులో ఉంటుంది. ఇష్యూ ప్రైస్ బ్యాండ్ రూ. 190 నుంచి రూ. 201గా ఉంది. రూ. 1,700 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యం.

శంకేష్ జువెల్లర్స్:

ఆగస్ట్ 18న ప్రారంభమై 20న ముగుస్తుంది. షేర్ ప్రైస్ బ్యాండ్ రూ. 88 నుంచి రూ. 93 కాగా, కంపెనీ రూ. 367.18 కోట్లు సమీకరించనుంది.

సన్‌షైన్ పిక్చర్స్:

ఆగస్ట్ 18న అందుబాటులోకి వచ్చి 20న ముగుస్తుంది. దీని ప్రైస్ బ్యాండ్ రూ. 342 నుంచి రూ. 360గా నిర్ణయించారు. దీని ద్వారా రూ. 282.14 కోట్లు సేకరిస్తున్నారు. శంకేష్ జువెల్లర్స్, సన్‌షైన్ పిక్చర్స్ రెండూ బిఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్ కానున్నాయి.

గాజా ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్:

ఆగస్ట్ 19న ప్రారంభమై ఆగస్ట్ 21న ముగుస్తుంది. ఇష్యూ ప్రైస్ బ్యాండ్ రూ. 152 నుంచి రూ. 160 కాగా, రూ. 550 కోట్లు సమీకరించడమే కంపెనీ లక్ష్యం.

కొత్త ఐపీఓల బిడ్డింగ్ మాత్రమే కాకుండా, గత వారం ఇన్వెస్టర్ల నుంచి నిధులు స్వీకరించిన 5 ప్రముఖ కంపెనీలు వచ్చే వారం ఎక్స్చేంజీల్లో లిస్ట్ కాబోతున్నాయి. ఈ కంపెనీలు ఐపీఓల ద్వారా సుమారు రూ. 7,478.69 కోట్ల నిధులను రాబట్టాయి. ఆగస్ట్ 17 సోమవారం దూత్ ట్రాన్స్‌మిషన్ ,మోల్బియో డయాగ్నోస్టిక్స్ షేర్లు ఎక్స్చేంజీల్లో అడుగుపెట్టనున్నాయి. ఆగస్ట్ 18 మంగళవారం మిల్కీ మిస్ట్ డెయిరీ ఫుడ్ షేర్ల లిస్టింగ్ జరగనుంది.ఆగస్ట్ 19 బుధవారం లాజిస్టిక్స్ దిగ్గజం షిప్‌రాకెట్ తో పాటు బెహరీ లాల్ ఇంజినీరింగ్ షేర్లు లిస్ట్ కాబోతున్నాయి.

ప్రైమరీ మార్కెట్‌లో ఈ కొత్త ఐపీఓలతో పాటు సెకండరీ మార్కెట్‌లోనూ కొత్త లిస్టింగ్‌లు ఉండటంతో రాబోయే వారం ఇన్వెస్టర్లు, ట్రేడర్లకు కనువిందు చేయనుంది. ఐపీఓల్లో పెట్టుబడులు పెట్టే ముందు సదరు కంపెనీల ఆర్థిక స్థితిగతులు, వ్యాపార నమూనా, వాల్యుయేషన్స్ , రిస్క్ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే SEBI గుర్తింపు పొందిన ఆర్థిక నిపుణుల ఉచిత లేదా పెయిడ్ సలహాలను తీసుకోండి.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story