ఏమన్నా ఉందా భయ్యా.. మస్కులర్ లుక్, హైటెక్ ఫీచర్లు.. సరికొత్త అవతారంలో టయోటా హైలెక్స్..!

Toyota Hilux 9th Generation: భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తూ టయోటా తన 9వ తరం 'హైలక్స్' పికప్ ట్రక్‌ను లాంచ్ చేసింది.

Venkat
Updated on: 29 July 2026 12:53 PM IST
Toyota Hilux 9th Generation
X

ఏమన్నా ఉందా భయ్యా.. మస్కులర్ లుక్, హైటెక్ ఫీచర్లు.. సరికొత్త అవతారంలో టయోటా హైలెక్స్..!

Toyota Hilux 9th Generation: గత మోడళ్లతో పోలిస్తే 9వ తరం హైలక్స్ చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా, గంభీరంగా కనిపిస్తోంది. ముందు భాగంలో అప్-రైట్ ఫాసియా, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ దీనికి సరికొత్త మాస్ అప్పీల్‌ను తీసుకొచ్చాయి. బానెట్ కింద నలుపు రంగు ప్యానెల్‌పై 'టయోటా' (TOYOTA) అని స్పష్టంగా కనిపించే అక్షరాలు వాహనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ముందు బంపర్ డిజైన్ పూర్తిగా మారిపోయింది. స్కిడ్ ప్లేట్, విశాలమైన ఎయిర్ వెంట్స్, ఫాగ్ ల్యాంప్స్ సెటప్ దీని దృఢత్వాన్ని మరింత పెంచాయి. సైడ్ ప్రొఫైల్ చూస్తే స్క్వేర్డ్-అవుట్ వీల్ ఆర్చెస్, ఫెండర్ ఫ్లేర్స్ ఇట్టే ఆకట్టుకుంటాయి. వెనుక భాగంలో సీ-షేప్ ఎల్ఈడీ టైల్ ల్యాంప్స్ ఈ పికప్ ట్రక్ అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. మన దేశంలో ఇది కేవలం డబుల్ క్యాబ్ బాడీ స్టైల్‌లో మాత్రమే లభించనుంది.

హైటెక్ ఫీచర్లతో ఇంటీరియర్ జిగేల్..

క్యాబిన్ లోపలికి అడుగుపెట్టగానే ఒక ప్రీమియం ఎస్‌యూవీలో కూర్చున్న ఫీలింగ్ కలగడం ఖాయం. డ్యాష్‌బోర్డ్‌ను పూర్తిగా మార్చేసి ఆధునిక హంగులు అద్దారు. మధ్యలో 12.3-అంగుళాల భారీ ఫ్రీస్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. స్టీరింగ్ వెనకాల ఇచ్చిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డ్రైవర్‌కు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. సెంటర్ కన్సోల్‌లో ఏసీ కంట్రోల్స్, 4x4 సెట్టింగ్స్, టెర్రైన్ మోడ్స్ కోసం ప్రత్యేక బటన్స్ ఏర్పాటు చేశారు. సేఫ్టీపరంగా కూడా టయోటా ఏమాత్రం రాజీ పడలేదు. ఏడు ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, 360-డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ లాంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో స్టాండర్డ్‌గా అందించారు.

నమ్మకమైన ఇంజిన్.. అదరగొట్టే పవర్..

మెకానికల్ గా చూస్తే పాత మోడల్‌లో ఉన్న నమ్మకమైన 2.8-లీటర్ డీజిల్ ఇంజిన్‌నే ఇందులో కొనసాగించారు. ఇది 201 బీహెచ్‌పీ పవర్ తో పాటు గరిష్టంగా 500 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అయితే మాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్లలో మాత్రం టార్క్ 420 ఎన్ఎమ్ మాత్రమే ఉంటుంది. ఈసారి బేస్ వేరియంట్‌లో తొలిసారిగా టూ-వీల్ డ్రైవ్ (4x2) ఆప్షన్‌ను కూడా తీసుకురావడం విశేషం. టాప్ వేరియంట్ మాత్రం కేవలం 4x4 డ్రైవ్‌ట్రెయిన్‌తోనే వస్తుంది. గుంతలు, రాళ్ల గుట్టల మీద ప్రయాణించేటప్పుడు ఇబ్బంది కలగకుండా మల్టీ-టెర్రైన్ మోడ్స్ అద్భుతంగా పనిచేస్తాయి.

వేరియంట్లు.. ధరల వివరాలు..

కొత్త టయోటా హైలక్స్‌ను జీఎక్స్, వీఎక్స్ అనే రెండు ప్రధాన వేరియంట్లలో మార్కెట్లోకి తీసుకొచ్చారు. బేస్ మోడల్ అయిన 2.8 డీజిల్ జీఎక్స్ 4x2 ఆటోమెటిక్ ప్రారంభ ధర రూ. 31.99 లక్షలు. అదే జీఎక్స్ 4x4 ఆటోమెటిక్ కావాలంటే రూ. 33.69 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక పూర్తిగా ఫీచర్లతో నిండిన టాప్-ఎండ్ వీఎక్స్ 4x4 ఆటోమెటిక్ ధర రూ. 36.69 లక్షలుగా ఎక్స్-షోరూమ్ వద్ద నిర్ణయించారు.

అధునాతన డిజైన్, హై-టెక్ క్యాబిన్, నమ్మకమైన పవర్‌ఫుల్ ఇంజిన్ కలయికతో 9వ తరం హైలక్స్ భారత మార్కెట్లో సరికొత్త ట్రెండ్ సృష్టించేందుకు సిద్ధమైంది. సాహస యాత్రలు ఇష్టపడేవారికి, లైఫ్‌స్టైల్ పికప్ ట్రక్ కావాలనుకునే వారికి ఇది కచ్చితంగా బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story