Thali Cost: ఇంట్లో వండుకునే భోజనం ఖర్చు పెరిగింది.. థాలీ ధర ఎంతంటే?

Thali Cost: ఆగస్టులో శాఖాహార థాలీ ధర రూ.29.5కు, మాంసాహార థాలీ ధర రూ.57.5కు చేరింది. ఉల్లి, నూనె, LPG ధరలు ప్రభావం చూపాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 Sept 2026 5:30 AM IST
Thali Cost
X

Thali Cost: ఇంట్లో వండుకునే భోజనం ఖర్చు పెరిగింది.. థాలీ ధర ఎంతంటే?

Thali Cost: ఇంట్లో వండుకునే భోజనం ఖర్చు ఆగస్టులో స్వల్పంగా పెరిగింది. దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ (Crisil) పరిశోధనా విభాగం విడుదల చేసిన నెలవారీ నివేదిక ప్రకారం.. శాఖాహార థాలీ ధర ఏడాది ప్రాతిపదికన, నెలవారీ ప్రాతిపదికన 1 శాతం పెరిగి రూ.29.5కు చేరుకుంది.

నాన్ వెజ్ థాలీపై మరింత భారం

మాంసాహార భోజనం ఖర్చు మాత్రం గతేడాదితో పోలిస్తే మరింత పెరిగింది. బ్రాయిలర్ కోడి మాంసం ధరలు 10 శాతం పెరగడంతో, నాన్ వెజ్ థాలీ ఖర్చు ఏడాది ప్రాతిపదికన 5 శాతం పెరిగి రూ.57.5కు చేరుకుంది.

అయితే జూలైలో నాన్ వెజ్ థాలీ ధర రూ.58.3గా ఉండగా.. ఆగస్టులో ఇది 1 శాతం తగ్గడం కొంత ఊరటనిచ్చింది. మొత్తంగా చూస్తే కూరగాయలు, ఇతర వంట సామగ్రి ధరల్లో వచ్చిన మార్పులు థాలీ ఖర్చుపై ప్రభావం చూపాయి.

ఉల్లి, నూనె, బియ్యం ధరలు పెరగడంతో..

‘రోటీ రైస్ రేట్’ నివేదిక ప్రకారం.. బంగాళాదుంపలు, టమోటాల ధరలు తగ్గినప్పటికీ ఉల్లిపాయలు, వంట నూనెలు, బియ్యం, ఎల్‌పీజీ ధరలు అధికంగా ఉండటంతో థాలీ ఖర్చు గతేడాదితో పోలిస్తే ఎక్కువగా నమోదైంది.

ముఖ్యంగా మహారాష్ట్రలో మార్చి–ఏప్రిల్ నెలల్లో కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వానల కారణంగా ఉల్లి సరఫరా తగ్గింది. దీంతో ఉల్లి ధరలు గతేడాది ఆగస్టులో కిలో రూ.28 ఉండగా.. ఈసారి 43 శాతం పెరిగి రూ.40కు చేరాయి.

అదే సమయంలో వంట నూనెల ధరలు 11 శాతం, ఎల్‌పీజీ ధరలు 10 శాతం పెరిగాయి. అయితే బంగాళాదుంపల ధరలు 12 శాతం, టమోటాల ధరలు ఏకంగా 28 శాతం తగ్గడం వల్ల థాలీ ఖర్చు మరింతగా పెరగకుండా కొంత నియంత్రితమైందని క్రిసిల్ నివేదిక పేర్కొంది.

ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం?

రాబోయే 2–3 నెలల్లో ఉల్లి ధరలు అధిక స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉందని క్రిసిల్ డైరెక్టర్ పూషన్ శర్మ తెలిపారు. రబీ సరఫరా తక్కువగా ఉండటంతో పాటు ఖరీఫ్ పంట మార్కెట్‌కు రావడంలో ఆలస్యం కావడం ఇందుకు కారణమని పేర్కొన్నారు.

నెలవారీగా చూస్తే ఆగస్టులో ఉల్లి ధరలు 17 శాతం పెరిగాయి. అయితే ఇదే సమయంలో టమోటాల ధరలు 7 శాతం తగ్గడంతో.. ఉల్లి ధరల పెరుగుదల ప్రభావం థాలీ మొత్తం ఖర్చుపై కొంతమేరకు పరిమితమైందని నివేదిక తెలిపింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story