TCS: గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్‌!

TCS: ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో మందగమనం ఉన్నప్పటికీ టీసీఎస్ అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది.

Naresh.k
Published on: 10 July 2026 8:59 AM IST
TCS
X

TCS: గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్‌!

IT Jobs: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, ఐటీ రంగంలో ఆందోళనలు వెంటాడుతున్నప్పటికీ, దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మాత్రం అదరగొట్టింది. ప్రతికూల పరిస్థితులను సైతం తట్టుకుని, అద్భుతమైన వృద్ధిని నమోదు చేయడమే కాకుండా.. భవిష్యత్తుపై తనకున్న నమ్మకాన్ని చేతల్లో చూపించింది. తాజాగా విడుదల చేసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలు అటు ఇన్వెస్టర్లలో, ఇటు ఉద్యోగార్థుల్లో కొత్త జోష్ నింపాయి.

గత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చిన టీసీఎస్, ఇప్పుడు రూట్ మార్చింది. భవిష్యత్తులో రాబోయే భారీ ప్రాజెక్టులు, డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ ఒక్క త్రైమాసికంలోనే ఏకంగా 9,279 మంది కొత్త ఉద్యోగులను కంపెనీ రిక్రూట్ చేసుకుంది. గడిచిన ఏడాది కాలంలో ఇదే అత్యధిక త్రైమాసిక నియామకం కావడం విశేషం.

దీంతో టీసీఎస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,93,798కు చేరింది. కంపెనీని వీడి వెళ్లే ఉద్యోగుల సంఖ్య 13.7 శాతం నుంచి 13.6 శాతానికి తగ్గింది. ఇది కంపెనీపై ఉద్యోగులకు ఉన్న నమ్మకాన్ని సూచిస్తుంది. సాంకేతిక ప్రపంచాన్ని శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో టీసీఎస్ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.

ప్రస్తుతం సంస్థలో 3.12 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఏఐ, మెషిన్ లెర్నింగ్‌లో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉన్నారు. ఏఐ ఆధారిత సేవల ద్వారా కంపెనీకి వచ్చే వార్షిక ఆదాయం ఇప్పటికే 2.6 బిలియన్ డాలర్లకు చేరింది.

బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగాల నుంచి టెక్నాలజీ సేవలకు డిమాండ్ ఒక్కసారిగా పుంజుకోవడంతో టీసీఎస్ ఖజానా కళకళలాడుతుంది. ప్రపంచ ఐటీ మార్కెట్ అతలాకుతలమవుతున్న తరుణంలో టీసీఎస్ సాధించిన ఈ విజయం, భారత ఐటీ రంగానికి ఒక దిక్సూచి లాంటిది. నియామకాలను మళ్లీ ముమ్మరం చేయడం ద్వారా రాబోయే రోజుల్లో ఐటీ రంగం మరింత పుంజుకోబోతుందనే బలమైన సంకేతాన్ని టాటా సంస్థ ఇచ్చింది. నిరుద్యోగ ఐటీ అభ్యర్థులకు ఇది ఖచ్చితంగా పెద్ద ఊరట కలిగించే విషయమే.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story