Swiggy: స్విగ్గీలో భారీ మార్పులు.. కో-ఫౌండర్ నందన్ రెడ్డి గుడ్‌బై
Swiggy: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ సహ-వ్యవస్థాపకుడు నందన్ రెడ్డి రాజీనామా చేశారు.
Swiggy: స్విగ్గీలో భారీ మార్పులు.. కో-ఫౌండర్ నందన్ రెడ్డి గుడ్‌బై
Nandan Reddy: భారతీయ స్టార్టప్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ సంస్థ సహ-వ్యవస్థాపకుడు నందన్ రెడ్డి తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన సొంత ప్రాజెక్టులపై దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
ముగిసిన ఒక అధ్యాయం..
నందన్ రెడ్డి కేవలం వ్యవస్థాపకుడే కాకుండా, సంస్థలో హెడ్ ఆఫ్ ఇన్నోవేషన్‌గా, హోల్-టైమ్ డైరెక్టర్‌గా కీలక పాత్ర పోషించారు. స్విగ్గీని సామాన్యుడి ముంగిట నిలబెట్టడంలో ఆయన కృషి ఎంతో ఉంది. తాజాగా ఆయన రాజీనామాతో స్విగ్గీ బోర్డులో కీలక మార్పులకు తెరలేచింది.
కొత్త బాధ్యతలు.. కొత్త వ్యూహాలు!
నందన్ రెడ్డి నిష్క్రమణ వేళ, బోర్డు పునర్వ్యవస్థీకరణను స్విగ్గీ వేగవంతం చేసింది. మరో కో-ఫౌండర్ ఫణి కిషన్, గ్రూప్ సీఎఫ్ఓ రాహుల్ బోత్రాలను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. వీరిద్దరూ జూన్ 1 నుంచి తమ కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు.
టార్గెట్ లాభాలు
కేవలం వ్యక్తుల మార్పు మాత్రమే కాదు.. పని తీరులోనూ స్విగ్గీ విప్లవాత్మక మార్పులకు సిద్ధమవుతోంది. భవిష్యత్తులో కంపెనీని లాభాల బాటలోకి తీసుకురావడమే లక్ష్యంగా కృత్రిమ మేధ టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగించాలని బోర్డు నిర్ణయించింది. డెలివరీ నెట్‌వర్క్ నుంచి కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ వరకు ప్రతి చోటా ఏఐ టెక్నాలజీని వాడటం ద్వారా కార్యకలాపాలను మరింత వేగవంతం చేయాలని స్విగ్గీ ప్లాన్ చేస్తోంది. ఒకవైపు వ్యవస్థాపకుల నిష్క్రమణ, మరోవైపు అత్యాధునిక టెక్నాలజీతో కొత్త ప్రయాణం.. స్విగ్గీని భవిష్యత్తులో ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి.




