Swiggy : ఇకపై రూ.200 లకే ‘వాల్యూ మీల్’.. స్విగ్గీ, జొమాటో సరికొత్త ప్లాన్
Swiggy : కార్పొరేట్ ఉద్యోగుల లంచ్ బడ్జెట్‌ను టార్గెట్ చేస్తూ స్విగ్గీ, జొమాటో వంటి ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు రూ.200 బడ్జెట్ థాలీ ప్లాన్స్‌తో ముందుకు వస్తున్నాయి.
Swiggy
Swiggy : సాధారణంగా ఆఫీసుల్లో కూర్చుని లంచ్ ఆర్డర్ చేయాలని అనుకున్నప్పుడు రూ.400 నుంచి రూ.500 బిల్లు చూసి చాలామంది వెనకడుగు వేస్తుంటారు. ఇలాంటి వారి కోసమే స్విగ్గీ, జొమాటో వంటి దిగ్గజ ఫుడ్ డెలివరీ కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి. ఇకపై కేవలం వీకెండ్స్ లేదా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడం కాకుండా, ప్రతిరోజూ ఆఫీస్ లంచ్‌ను కూడా ఆన్‌లైన్ లోనే ఆర్డర్ చేసేలా సరికొత్త వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందుకోసం ఖరీదైన రెస్టారెంట్ వంటకాల కంటే కేవలం రూ.200 ధరలోనే లభించే వాల్యూ మీల్స్ పై ఈ కంపెనీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. కస్టమర్ల రోజువారీ అలవాట్లలో ఆన్‌లైన్ ఫుడ్‌ను ఒక భాగం చేయడమే వీటి ప్రధాన లక్ష్యం.
మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఫుడ్ డెలివరీ కంపెనీలు కేవలం ఒకరిద్దరు కస్టమర్ల నుంచి అప్పుడప్పుడు ఆర్డర్లు పొందడం కంటే, ఆఫీస్ ఉద్యోగులు తమ రోజువారీ మధ్యాహ్న భోజనం కోసం పూర్తిగా తమ యాప్స్ పైనే ఆధారపడేలా చేయాలని చూస్తున్నాయి. డెలివరీ ఛార్జీలు, పన్నులు అన్నీ కలిపి ఫైనల్ బిల్లు రూ.200 నుంచి రూ.250 లోపు ఉంటేనే సాధ్యమవుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఆన్‌లైన్ ఫుడ్ ధరలు స్థానిక హోటళ్లు లేదా డాబాల కంటే ఎక్కువగా ఉంటే ఉద్యోగులు ఆర్డర్ చేయడానికి ఆసక్తి చూపరు. ఈ డిమాండ్‌ను గమనించిన పలు ఫాస్ట్ ఫుడ్ కంపెనీలు కూడా తమ మెనూలో తక్కువ ధరల భోజనాలను చేర్చడం ప్రారంభించాయి.
ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ మార్కెట్లో పట్టు సాధించేందుకు స్విగ్గీ తన ప్రధాన యాప్‌లో వాల్యూ స్టోర్ అనే కొత్త విభాగాన్ని ప్రారంభించింది. దీనితో పాటు తక్కువ బడ్జెట్ కస్టమర్ల కోసం తోయింగ్ అనే సరికొత్త ప్రత్యేక యాప్‌ను కూడా టెస్ట్ చేస్తోంది. ఫుడ్ డెలివరీ రంగంలో తదుపరి వృద్ధి ఖరీదైన ఆర్డర్ల వల్ల కాకుండా, ఇలాంటి తక్కువ ధరల భోజనాల వల్లే వస్తుందని స్విగ్గీ సీఈఓ శ్రీహర్ష మెజెటి స్పష్టం చేశారు. మరోవైపు జొమాటో ప్రస్తుతానికి ఎలాంటి ప్రత్యేక బడ్జెట్ యాప్‌ను తీసుకురావడం లేదు. వేరే యాప్స్ తీసుకురావడం కంటే ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రత్యేక డిస్కౌంట్లు ఇవ్వడమే మంచిదని జొమాటో భావిస్తోంది. అలాగే వారి బిస్ట్రో మోడల్ కూడా ప్రస్తుతం ప్రారంభ దశలో ఉంది.
ఈ రేసులోకి సరికొత్త స్టార్టప్ కంపెనీలు కూడా వినూత్న పద్ధతులతో అడుగుపెడుతున్నాయి. ప్రసిద్ధ రవాణా సంస్థ ర్యాపిడో మద్దతు ఉన్న ఓన్లీ అనే కొత్త కంపెనీ రెస్టారెంట్ల నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోకుండా వ్యాపారం చేస్తోంది. దీనివల్ల రెస్టారెంట్లు తమ ఆహార పదార్థాల ధరలను తక్కువగా ఉంచగలుగుతున్నాయి. ఇందులో కస్టమర్లు ఫుడ్ బిల్లును విడిగా, డెలివరీ ఛార్జీలను విడిగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కేవలం తక్కువ ధరల భోజనాలే మార్కెట్లో ఎక్కువ కాలం మనుగడ సాగించలేవని క్లౌడ్ కిచెన్ దిగ్గజం రెబెల్ ఫుడ్స్ పేర్కొంది. కస్టమర్లు తమ మూడ్, సందర్భాన్ని బట్టి ప్రీమియం కాఫీలు, చౌకైన కేఫ్‌ల ఫుడ్స్ రెండింటినీ ఇష్టపడతారని, అందుకే తాము అన్ని బడ్జెట్లకు సరిపోయేలా ఈట్‌ఫిట్, షరీఫ్ భాయ్ బిర్యానీ, కేక్‌జోన్ వంటి భిన్నమైన బ్రాండ్లను నడుపుతున్నట్లు క్యూర్ ఫుడ్స్ తెలిపింది.
ఇన్వెస్ట్ టెక్ ఈక్విటీస్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ ఇప్పుడు తదుపరి విప్లవాత్మక దశకు చేరుకుంది. కొత్త కస్టమర్లు రావడం కంటే, ప్రస్తుతం ఉన్న కస్టమర్లే పదే పదే ఆర్డర్ చేయడం, చిన్న నగరాల్లో డిమాండ్ వేగంగా పెరగడం వల్ల ఈ రంగం విస్తరిస్తోంది. 2024లో 9.1 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ మార్కెట్, రాబోయే 2030 నాటికి ఏకంగా 27 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2.2 లక్షల కోట్లు) భారీ స్థాయికి చేరుకుంటుందని అంచనా. దేశంలో పెరుగుతున్న పట్టణీకరణ, మారుతున్న ఉద్యోగుల జీవనశైలి కారణంగా రాబోయే రోజుల్లో ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లు మరింత ఊపందుకోనున్నాయి.




