ఉన్న‌ట్లుండి చ‌క్కెర ధ‌ర‌లు ఎందుకు పెరిగాయి.? దీనికి అస‌లు కార‌ణం ఇదే..

Sugar Price Hike: దేశంలో చక్కెర ధరలు ఒక్కసారిగా పెరగడం వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తోంది.

Mokshith
Published on: 8 Aug 2026 12:35 PM IST
Sugar Price Hike
X

ఉన్న‌ట్లుండి చ‌క్కెర ధ‌ర‌లు ఎందుకు పెరిగాయి.? దీనికి అస‌లు కార‌ణం ఇదే.. 

Sugar Price Hike: దేశంలో చక్కెర ధరలు ఒక్కసారిగా పెరగడం వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తోంది. గత నెల రోజుల వ్యవధిలో కొన్ని ప్రాంతాల్లో చక్కెర ధరలు 15 శాతం వరకు పెరిగాయి. ఇంత‌కీ ఉన్న‌ట్లుండి చ‌క్కెర ధ‌ర‌లు పెర‌గ‌డానికి కార‌ణం ఏంటో తెలుసా.?

పండుగల ముందు పెరిగిన చక్కెర ధరలు

పండుగల సమయంలో చక్కెర వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలోనే ధరలు పెరగడం వల్ల స్వీట్లు, ఇతర తీపి పదార్థాల తయారీ ఖర్చు కూడా పెరగనుంది. గత నెలలో హోల్‌సేల్ మార్కెట్‌లో క్వింటాల్‌కు సుమారు రూ.400 వరకు చక్కెర ధర పెరిగింది. పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది చక్కెర కర్మాగారాలు గడువు కంటే 10 నుంచి 15 రోజుల ముందుగానే చెరకు క్రషింగ్ ప్రారంభించాలని నిర్ణయించాయి. దీంతో కొత్త చక్కెర త్వరగా మార్కెట్‌లోకి వస్తుందని భావిస్తున్నారు.

ధరలు పెరగడానికి ప్రధాన కారణాలివే

ఈ ఏడాది దేశంలో 293 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. అయితే వాస్తవానికి ఉత్పత్తి 280 లక్షల టన్నులకే పరిమితమైంది. అంటే అంచనాల కంటే దాదాపు 5 శాతం తక్కువ ఉత్పత్తి జరిగింది. అయితే గత ఏడాది మిగిలిన సుమారు 50 లక్షల టన్నుల నిల్వలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ దేశంలో ఏడాదికి సుమారు 280 లక్షల టన్నుల చక్కెర వినియోగం ఉండటంతో నిల్వలు పెద్దగా ఉపశమనం ఇవ్వలేకపోతున్నాయి. ఇదే సమయంలో ఇప్పటికే 8 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేశారు. మరోవైపు ఎల్‌నీనో ప్రభావం వల్ల వచ్చే ఏడాది కూడా ఉత్పత్తి తగ్గొచ్చనే అంచనాలు మార్కెట్‌లో ధరలను మరింత పెంచుతున్నాయి.

చక్కెర కంపెనీలకు లాభం.. ఇథనాల్ ఉత్పత్తికి సవాలు

చక్కెర ధరలు పెరగడం వల్ల వినియోగదారులపై భారం పడుతున్నా, చక్కెర తయారీ కంపెనీలకు మాత్రం ఇది లాభదాయకంగా మారుతోంది. అధిక ధరల కారణంగా కంపెనీల లాభాల మార్జిన్లు పెరిగే అవకాశం ఉంది. అయితే ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇథనాల్ మిశ్రమ ఇంధన కార్యక్రమానికి ప్రతికూలంగా మారొచ్చు. చక్కెర ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు చెరకు రసంతో ఇథనాల్ తయారు చేయడం కంటే చక్కెర తయారు చేసి అమ్మడం కర్మాగారాలకు ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. దీంతో ఇథనాల్ ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది.

ప్రభుత్వ చర్యలు ఎంతవరకు ఫలిస్తాయి?

చక్కెర ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం స్టాక్ పరిమితులు విధించడం, చక్కెర కర్మాగారాల నిల్వలను తనిఖీ చేయడం వంటి చర్యలు చేపట్టింది. అలాగే కొత్త సీజన్‌లో చెరకు క్రషింగ్ ముందుగానే ప్రారంభం కావడం వల్ల మార్కెట్‌లో సరఫరా పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో ధరలు మాత్రం తగ్గే సూచనలు కనిపించడం లేదు. రానున్న పండుగల సీజన్‌లో చక్కెర ధరలు ఎలా మారతాయన్నది ఉత్పత్తి, సరఫరా పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story