Shiv Ratan Agarwal Success Story: సక్సెస్ అంటే ఇదే.. 8వ తరగతి చదివి 13 వేల కోట్లు సంపాదించాడు
Shiv Ratan Agarwal Success Story: కేవలం ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదువుకుని, అకుంఠిత దీక్షతో రూ. 13,430 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన పారిశ్రామికవేత్త.
Shiv Ratan Agarwal Success Story: సక్సెస్ అంటే ఇదే.. 8వ తరగతి చదివి 13 వేల కోట్లు సంపాదించాడు
Shiv Ratan Agarwal Success Story: కేవలం ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదువుకుని, అకుంఠిత దీక్షతో రూ. 13,430 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన పారిశ్రామికవేత్త, బికాజీ ఫుడ్స్ అధినేత శివ్ రతన్ అగర్వాల్ ప్రస్థానం ప్రతి ఒక్కరికీ ఒక పాఠం. వ్యాపార రంగంలో ఆయన సృష్టించిన విప్లవం, భారతీయ రుచులను ప్రపంచ స్థాయికి చేర్చిన తీరు అద్వితీయమనే చెప్పాలి. చాలా మంది చదువు రావడం లేదని, చదువు లేకుంటే దేనికి పనికిరానివాడిగా మారిపోతారని, డిగ్రీలు చేతిలో ఉంటే విజయం దక్కుతుందని నమ్మేవారికి శివ్ రతన్ అగర్వాల్ జీవితం ఓ కనువిప్పు. రాజస్థాన్‌లోని బికానేర్లో పుట్టి సాధారణ వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించిన రతన్ నేడు ప్రపంచ గర్వించే స్థాయికి ఎదిగాడు అంటే దానికి కారణం అతని విజన్ అనే చెప్పాలి.
వారసత్వం నుంచి వైవిధ్యం వైపు
శివ్ రతన్ అగర్వాల్ కుటుంబం ముందు నుంచీ తినుబండారాల వ్యాపారంలోనే ఉంది. ప్రసిద్ధ 'హల్దీరామ్' వ్యవస్థాపకుడు గంగాబిషన్ అగర్వాల్ మనవడే ఈ శివ్ రతన్. అయితే, వారసత్వంగా వచ్చిన ఆస్తిపై ఆధారపడకుండా, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఆయన ఆశించారు. చదువు మధ్యలోనే ఆగిపోయినా, వ్యాపార మెళుకువలను మాత్రం ఔపోసన పట్టారు. వారసత్వంగా వచ్చిన వ్యాపారం మెళుకువలతో వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఆ వ్యాపారం నేడు ప్రపంచ దేశాల్లో విస్తరించింది.
బికాజీ బ్రాండ్ వెనుక కథ
1986లో ఆయన శివ్‌దీప్ ప్రొడక్ట్స్ పేరుతో తన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించారు. సక్సెస్ బాట పడుతున్న సమయంలో 1993లో ఆయన ఈ శివ్‌దీప్ ప్రొడక్ట్స్ పేరును బికాజీ బ్రాండ్‌గా మార్చేశారు. బికానేర్ నగర వ్యవస్థాపకుడు రావు బికా పేరు మీదుగా ఈ సంస్థకు నామకరణం చేశారు. ఇక ఈ బ్రాండ్‌లో ఎక్కువ ప్రసిద్ది పొందినవి భుజియా, నమ్కీన్. మొదట్లో వీటిని చేతులతోనే తయారు చేసేవారు. ఆ తరువాత వీటని పారిశ్రామికంగా ఉత్పత్తి చేసేందుకు విదేశాల నుంచి ఉత్పత్తి యంత్రాలను తీసుకొచ్చి, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ భారీ స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించారు. భారత్‌లో బికాజీ బ్రాండ్ బాగా ప్రాచూర్యం పొందింది. ఉత్పత్తులకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అనంతరం ఈ ఉత్పత్తులను భారత్‌తో ఆపకుండా విదేశాలకు ఎగుమతి చేయడం ఆరంభించారు.
ప్రస్తుతం ఈ బికాజీ బ్రాండ్ విలువ మార్కెట్ లెక్కల ప్రకారం రూ. 13,340 కోట్లు. 2022 నవంబర్‌లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడమే కాకుండా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని కూడా గెలుచుకున్నది. అంతేకాదు, 2024లో ప్రపంచ బిలీనియర్ల జాబితాలో చోటు సంపాదించారు శివ్ రతన్. ఇంతటి మహా సామ్రాజ్యాన్ని స్థాపించిన శివ్ రతన్ ఏప్రిల్ 23, 2026న మరణించారు. నీ వద్ద ఉన్న సర్టిఫికెట్లు నీ తెలివితేటలను నిర్ణయించవు.. నీ ఆలోచనా విధానమే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది అనే మాటను ఆయన తన జీవితంలో నిత్యం అమలు చేస్తూనే ఉండటం విశేషం. ఆశయం, ఆలోచనలు ఉంటే మధ్యతరగతి వ్యక్తికూడా ఉన్నత స్థాయికి ఎదగగలడు అని చెప్పడానికి శివ్రతన్ జీవితం ఓ సజీవ సాక్ష్యం.




