Credit Card: విద్యార్థులకు కూడా క్రెడిట్ కార్డులు ఇస్తారని తెలుసా.? ఎలా అప్లై చేసుకోవాలంటే.?
Credit Card: ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరికీ క్రెడిట్ తప్పనిసరిగా మారింది. అయితే క్రెడిట్ కార్డు పొందాలంటే కచ్చితంగా ఏదైనా ఆదయం ఉన్నట్లు చూపించాలి.
Credit Card: విద్యార్థులకు కూడా క్రెడిట్ కార్డులు ఇస్తారని తెలుసా.? ఎలా అప్లై చేసుకోవాలంటే.?
Credit Card: ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరికీ క్రెడిట్ తప్పనిసరిగా మారింది. అయితే క్రెడిట్ కార్డు పొందాలంటే కచ్చితంగా ఏదైనా ఆదయం ఉన్నట్లు చూపించాలి. కానీ విద్యార్థుల కోసం కూడా ప్రత్యేక క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయని మీకు తెలుసా.?
విద్యార్థులు క్రెడిట్ కార్డు పొందాలంటే ఏ అర్హతలు ఉండాలి?
స్టూడెంట్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసే వ్యక్తి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే గుర్తింపు పొందిన కాలేజీ, విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థలో చదువుతూ ఉండాలి. సాధారణంగా విద్యార్థులకు రెగ్యులర్ ఆదాయం ఉండదు కాబట్టి జీతం లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు.
అయితే ప్రతి బ్యాంకు తన నిబంధనలకు అనుగుణంగా అదనపు అర్హతలను నిర్ణయిస్తుంది. అందువల్ల దరఖాస్తు చేసుకునే ముందు సంబంధిత బ్యాంకు షరతులను పరిశీలించడం మంచిది.
విద్యార్థులకు అందుబాటులో ఉన్న క్రెడిట్ కార్డుల రకాలు
యాడ్-ఆన్ క్రెడిట్ కార్డు:
ఇంట్లో ఇప్పటికే తల్లిదండ్రులు లేదా ఇతర కుటుంబ సభ్యుల పేరిట క్రెడిట్ కార్డు ఉంటే, దానికి అనుబంధంగా విద్యార్థులు యాడ్-ఆన్ కార్డు పొందవచ్చు. దీనివల్ల ప్రధాన కార్డు ఖాతాతో అనుసంధానమైన ప్రత్యేక కార్డు విద్యార్థి పేరుతో జారీ అవుతుంది.
సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు:
బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఉన్నవారికి ఈ కార్డు అందుబాటులో ఉంటుంది. ఎఫ్‌డీ మొత్తాన్ని భద్రతగా తీసుకుని బ్యాంకు క్రెడిట్ కార్డును జారీ చేస్తుంది. విద్యార్థులు సులభంగా పొందగలిగే క్రెడిట్ కార్డుల్లో ఇది ఒకటి.
విద్యా రుణం ఆధారంగా కార్డు:
ఇప్పటికే విద్యా రుణం తీసుకున్న విద్యార్థులకు కొన్ని బ్యాంకులు ప్రత్యేక క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. విద్యా లోన్ హిస్టరీ ఆధారంగా ఈ కార్డులను సులభంగా మంజూరు చేసే అవకాశం ఉంటుంది.
స్టూడెంట్ క్రెడిట్ కార్డుల ప్రత్యేకతలు ఏంటి?
సాధారణ క్రెడిట్ కార్డులతో పోలిస్తే విద్యార్థుల కార్డులకు క్రెడిట్ లిమిట్ తక్కువగా ఉంటుంది. సాధారణంగా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పరిమితి ఉండవచ్చు. దీని వల్ల అధిక ఖర్చులను నియంత్రించవచ్చు. అలాగే..
వార్షిక రుసుము చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని కార్డులకు జాయినింగ్ ఫీజు ఉండదు. ఆన్‌లైన్ కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్‌లు, రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. కార్డు పోయినా తక్కువ ఖర్చుతో డూప్లికేట్ కార్డు పొందవచ్చు. చదువు పూర్తయ్యాక సాధారణ క్రెడిట్ కార్డుగా అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. బాధ్యతాయుతంగా వినియోగిస్తే భవిష్యత్తులో మంచి క్రెడిట్ స్కోర్ నిర్మించుకోవచ్చు.
దరఖాస్తుకు అవసరమైన పత్రాలు
స్టూడెంట్ క్రెడిట్ కార్డు కోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రం, పుట్టిన తేదీ నిర్ధారణ పత్రం, కాలేజీ లేదా యూనివర్సిటీ ఐడీ కార్డు, అడ్మిషన్ లేదా ఎన్‌రోల్‌మెంట్ ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో పాటు కొన్ని బ్యాంకులు అదనపు పత్రాలను కూడా కోరే అవకాశం ఉంటుంది.
స్టూడెంట్ క్రెడిట్ కార్డు కోసం ఎలా అప్లై చేయాలి?
ముందుగా మీ అవసరానికి సరిపోయే క్రెడిట్ కార్డు రకాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత సంబంధిత బ్యాంకు శాఖను సందర్శించడం లేదా బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. అవసరమైన పత్రాలను సమర్పించిన తర్వాత బ్యాంకు పరిశీలన చేపడుతుంది. అర్హతలు పూర్తిగా సరిపోతే క్రెడిట్ కార్డు జారీ చేస్తుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయం
స్టూడెంట్ క్రెడిట్ కార్డు కేవలం ఖర్చుల కోసం మాత్రమే కాకుండా భవిష్యత్తులో మంచి క్రెడిట్ హిస్టరీ ఏర్పరచుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది. అయితే పరిమితికి మించి ఖర్చు చేయకుండా, బిల్లులను సమయానికి చెల్లిస్తూ బాధ్యతాయుతంగా వినియోగించడం చాలా ముఖ్యం.




