Stock Market Holiday: ఆర్ధిక సంవత్సరం చివరిరోజు.. స్టాక్ మార్కెట్ సెలవు..
Stock Market Holiday: మహావీర్ జయంతి సందర్భంగా స్టాక్ మార్కెట్ కు సెలవు. అందువలన ఈరోజు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ లలో ట్రేడింగ్ జరగదు.
Stock Market Holiday
Stock Market Holiday: ఈరోజు అంటే మార్చి 31 మన దేశపు ఆర్ధిక సంవత్సరం చివరి రోజు. సరిగ్గా ఈరోజునే స్టాక్ మార్కెట్ కు ఈసారి సెలవు వచ్చింది. శ్రీ మహావీర్ జయంతి సందర్భంగా ఈరోజు బీఎస్ఈ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ల్లో ట్రేడింగ్ ఉండదు. కానీ భారత్ కమోడిటీ ఎక్స్చేంజ్ మాత్రం సాయంత్రం సెషన్ లో పనిచేస్తుంది. మహావీర్ జయంతి సందర్భంగా మన దేశపు అతిపెద్ద కమోడిటీ ఎక్స్చేంజ్ మల్టీ-కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా మొదటి సెషన్ అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ట్రేడింగ్ జరగదు. అయితే, రెండో సెషన్ అంటే సాయంత్రం 5 గంటల నుంచి 11 గంటల వరకూ ట్రేడింగ్ నిర్వహిస్తారు.
ఈ ఫైనాన్షియల్ ఇయర్ తో పాటే స్టాక్ మార్కెట్ సెలవులు కూడా పూర్తి అయిపోయినట్టే. కొత్త ఫైనాన్షియల్ ఇయర్ రేపటి నుంచి అనే ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం అవుతుంది. రేపు బుధవారం స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ యధావిధిగా జరుగుతుంది. ఏప్రిల్ 2 గురువారం కూడా స్టాక్ మార్కెట్ పనిచేస్తుంది. కానీ, మళ్ళీ ఏప్రిల్ 3 శుక్రవారం మన స్టాక్ మార్కెట్ తో పాటు యూఎస్ స్టాక్ మార్కెట్ అలాగే ప్రపంచ మర్కెట్స్ లో ట్రేడింగ్ ఉండదు. ఎందుకంటే, ఆరోజు గుడ్ ఫ్రైడే. అంటే ఏప్రిల్ 3 శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులు మన స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ జరగదు. మొత్తంగా చూసుకుంటే ఈవారంలో ఇక రెండు రోజులు మాత్రమే స్టాక్ మార్కెట్ పనిచేస్తుంది.
నిన్న భారీ పతనం..
ఇక స్టాక్ మార్కెట్ నిన్న(సోమవారం, 30 మార్చి) భారీ పతనాన్ని చూసింది. ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్ వరుసగా పడిపోతూ వస్తోంది. అదేవిధంగా నిన్న కూడా సెన్సెక్స్ 1635 పాయింట్లు పతనమై 71,947 వద్ద ముగియగా, నిఫ్టీ 488 పాయింట్లు తగ్గి 22,331 వద్ద ముగిసింది. గత సెషన్లోని రూ. 422 లక్షల కోట్ల మార్కుతో పోలిస్తే, బీఎస్ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ క్యాప్ దాదాపు రూ. 10 లక్షల కోట్లు పడిపోయి రూ. 412.43 లక్షల కోట్లకు చేరింది.
ఈ ఆర్ధిక సంవత్సరం నష్టాలే..
ఈ ఆర్ధిక సంవత్సరం మొత్తం చూసుకుంటే మార్కెట్ బేరిష్ గానే ముగిసిందని చెప్పవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో సెన్సెక్స్ 5.36% - నిఫ్టీ 3.60% నష్టపోయాయి. 2026లో ఇప్పటివరకూ, నిఫ్టీ 14.54% - సెన్సెక్స్ 15.54% పతనమయ్యాయి.
ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉండాల్సిందే..
ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితుల ప్రభావం మన స్టాక్ మార్కెట్ పై ఎక్కువగానే ఉంటావస్తోంది. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ కోలుకోవడం కష్టమనే నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. మధ్య ప్రాచ్యంలో యుద్ధ వాతావరణంతో స్టాక్ మార్కెట్ ఇప్పటికే కింది చూపులు చూస్తోంది. భవిష్యత్తులో పెద్దగా కోలుకునే అవకాశం దగ్గరలో కనిపించడం లేదనేది నిపుణుల మాట. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా వ్యవహరించాలని వారు సూచిస్తున్నారు. రాబోయే రెండు మూడు రోజులు కూడా అమ్మకాల ఒత్తిడి అధికంగానే ఉండే అవకాశం ఉందని.. ఆ ప్రభావంతో ఇండెక్స్ లు బలహీనంగానే ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గమనిక: ఇక్కడ స్టాక్ మార్కెట్ వార్తలను కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఇవ్వడం జరిగిది. దీనిని పెట్టుబడి సలహాగా భావించ కూడదు. కేవలం కనీస అవగాహన కోసం నిపుణుల అంచనాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. పాఠకులు ఏవైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారుని సంప్రదించాలని సూచించడమైనది.




