Share Market Today : కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. 8 నిమిషాల్లో రూ.8 లక్షల కోట్లు మాయం
Share Market Today : అంతర్జాతీయంగా ముంచుకొస్తున్న యుద్ధ భయాలు భారత స్టాక్ మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు విఫలం కావడం, ముడిచమురు ధరలు ఒక్కసారిగా 100 డాలర్ల మార్కును దాటడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోతున్నారు.
Share Market Today
Share Market Today : అంతర్జాతీయంగా ముంచుకొస్తున్న యుద్ధ భయాలు భారత స్టాక్ మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు విఫలం కావడం, ముడిచమురు ధరలు ఒక్కసారిగా 100 డాలర్ల మార్కును దాటడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. వారీ మొదటి రోజే (ఏప్రిల్ 13, సోమవారం) దలాల్ స్ట్రీట్ భారీ పతనంతో ప్రారంభమైంది. సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ పాతాళానికి పడిపోవడంతో ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోతోంది. ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా ముగియడం ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది. దీనికి తోడు ఇరాన్ ఓడరేవులను దిగ్బంధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో యుద్ధం అనివార్యమనే సంకేతాలు వెలువడ్డాయి. ఈ పరిణామాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర ఒక్కసారిగా 100 డాలర్ల మార్కును దాటిపోయింది. భారత్ తన చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుంది కాబట్టి, చమురు ధరల పెరుగుదల మన ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగా మారింది.
కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ
సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే బీఎస్‌ఈ సెన్సెక్స్ ఏకంగా 1613 పాయింట్లు క్షీణించి 75,937 స్థాయి వద్ద ట్రేడవుతోంది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 461 పాయింట్లు నష్టపోయి 23,589 వద్ద కీలక మద్దతు స్థాయిని కోల్పోయింది. ముడిచమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి, ద్రవ్యోల్బణం భారంగా మారుతుందన్న భయంతో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో, ఐటీ రంగాల షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితి
భారత మార్కెట్లే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల సూచీలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. జపాన్ కు చెందిన నికాయ్ 0.84 శాతం పడిపోగా, దక్షిణ కొరియా కోస్పి 1.83 శాతం మేర నష్టపోయింది. హాంగ్ కాంగ్ కి చెందిన హాంగ్ సెంగ్ కూడా 1.16 శాతం బలహీనపడింది. ఇక వాల్ స్ట్రీట్ పరిస్థితి చూస్తే.. అమెరికా ఫ్యూచర్స్ భారీ అమ్మకాలను ఎదుర్కొంటున్నాయి. డౌ జోన్స్ ఫ్యూచర్స్ 550 పాయింట్లు, నాస్‌డాక్ ఫ్యూచర్స్ 320 పాయింట్లకు పైగా క్షీణించి ట్రేడవుతున్నాయి.
ముడిచమురు మంటలు
యుద్ధ విరమణ చర్చలు విఫలం కావడంతో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ఏకంగా 7.05 శాతం పెరిగి 101.91 డాలర్లకు చేరుకుంది. అలాగే అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ 7.86 శాతం పెరిగి 104.16 డాలర్ల వద్ద ఉంది. చమురు సరఫరాకు ప్రధాన మార్గమైన హోర్ముజ్ జలసంధిపై ఆంక్షలు విధిస్తే గనక, ముడిచమురు ధరలు 120 డాలర్ల వరకు వెళ్లవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే సామాన్యుడిపై పెట్రోల్, డీజిల్ భారం పడటమే కాకుండా నిత్యావసర ధరలు కూడా ఆకాశాన్ని తాకడం ఖాయం.




