Stock: స్టాక్ అంటే ఇది..లక్ష పెడితే..రూ. 2.42 కోట్లు తెచ్చిపెట్టింది!
Stock: స్పెక్ట్రమ్ ఎలక్ట్రికల్ షేరు రూ. 8 నుండి రూ. 1,970 కి చేరి 24,149% లాభాలను ఇచ్చింది.
Stock: స్టాక్ అంటే ఇది..లక్ష పెడితే..రూ. 2.42 కోట్లు తెచ్చిపెట్టింది!
Spectrum Electrical Share: షేర్ మార్కెట్ అంటేనే ఒక మాయా ప్రపంచం. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలని వచ్చే వాళ్లకు ఇక్కడ నష్టాలు తప్పవు కానీ... సరైన కంపెనీని ఎంచుకుని, కాస్త ఓపికగా వేచి చూసే ఇన్వెస్టర్లకు మాత్రం ఇది అక్షయపాత్రలా మారుతుంది. దీనికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ రంగంలోని ఒక చిన్న పెన్నీ స్టాక్.
ఒకప్పుడు సింగిల్ డిజిట్ రూ. 8 ధరకే లభించిన ఈ షేరు, ఇప్పుడు ఏకంగా రూ. 1,970 దాటి దూసుకెళ్తోంది. కేవలం నాలుగేళ్లలోనే 24,149 శాతం కళ్లు చెదిరే లాభాలను అందించి, ఇన్వెస్టర్ల పాలిట కామధేనువుగా మారిన ఆ మల్టీబ్యాగర్ స్టాక్ విశేషాలు ఇప్పుడు చూద్దాం.
గణాంకాల రూపంలో చూస్తే ఈ స్టాక్ సృష్టించిన సంచలనం సామాన్యమైనది కాదు.2022 డిసెంబర్ 16 నాటి ధర కేవలం రూ. 8.15 ఎవరైనా ఆ రోజున రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, వారికి 12,270 షేర్లు వచ్చి ఉండేవి. ఇప్పటి ధర రూ. 1,976.30. ఆ రోజు పెట్టిన రూ. 1 లక్ష.. నేడు అక్షరాలా రూ. 2.42 కోట్లు అయింది.
మార్కెట్ చరిత్రలోనే అత్యుత్తమ రిటర్న్స్ అందించిన టాప్ స్టాక్స్ జాబితాలో ఇది స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 3.11 వేల కోట్లుగా ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 2,206.05 కాగా, కనిష్ఠ ధర రూ. 1,050 గా ఉంది.
ఈ అద్భుత ప్రగతికి కారణం స్పెక్ట్రమ్ ఎలక్ట్రికల్ కంపెనీ. ఇది ఆటోమొబైల్, పవర్, ఇండస్ట్రియల్ రంగాలకు అవసరమైన ఎలక్ట్రికల్ వైరింగ్ హార్నెస్, ఆటోమోటివ్ కేబుల్స్, బ్యాటరీ కేబుల్స్, స్విచ్ గేర్లతో పాటు భవిష్యత్తుకు అత్యంత కీలకమైన ఈవీ ఫాస్ట్ ఛార్జర్లను తయారు చేస్తుంది. ఈ కంపెనీ క్లయింట్ లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా పేరున్న దిగ్గజ సంస్థలైన ష్నైడర్ , పానాసోనిక్ , లెగ్రాండ్ , హేగర్ , ఏబీబీ వంటి కంపెనీలు వీరికి ప్రధాన కస్టమర్లుగా ఉన్నాయి.
ఒకప్పుడు కొద్ది మంది కస్టమర్లపైనే ఆధారపడిన స్పెక్ట్రమ్ ఎలక్ట్రికల్, ఇప్పుడు తన రూట్ మార్చింది. మార్కెట్ డిమాండ్‌కు తగ్గట్టుగా భారీ ప్లాన్లతో ముందుకు వెళ్తోంది.రాబోయే ఆర్థిక సంవత్సరాల కోసం కంపెనీ దాదాపు రూ. 140-150 కోట్ల భారీ పెట్టుబడి పెడుతోంది.
కొత్త ప్లాంట్ల ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే అదనపు ఆదాయం రావడం ప్రారంభమవుతుందని మేనేజ్‌మెంట్ ధీమాగా ఉంది. గతంలో ఒక త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 169 కోట్లుగా ఉంటే, ఇటీవల క్యూ4 నాటికి అది ఏకంగా రూ. 283 కోట్లకు పెరిగింది. అలాగే నికర లాభం కూడా రూ. 14 కోట్ల నుండి రూ. 26 కోట్లకు దూసుకెళ్లింది.
స్పెక్ట్రమ్ ఎలక్ట్రికల్ సాధించిన ఈ విజయం స్టాక్ మార్కెట్ ప్రియులకు ఒక గొప్ప పాఠం. షేర్ ధర తక్కువగా ఉందని కాకుండా, కంపెనీ చేసే వ్యాపారం ఏంటి, దానికి భవిష్యత్తు ఉందా లేదా అని చూసి పెట్టుబడి పెట్టి, ఓపికగా వేచి చూస్తే... పెన్నీ స్టాక్స్ కూడా ఇలా జాక్‌పాట్ లాటరీలుగా మారతాయని ఈ స్టాక్ నిరూపించింది.




