Smartphone: ఫోన్ EMI బ‌కాయి ప‌డ్డారా.? అయితే మీ ఫోన్ లాక్ అవుతుంది

Smartphone: దేశంలో మొబైల్‌ ఫోన్లు, టాబ్లెట్లు వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను EMIలపై కొనుగోలు చేసే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది.

Mokshith
Published on: 21 May 2026 11:43 AM IST
Smartphone
X

Smartphone: ఫోన్ EMI బ‌కాయి ప‌డ్డారా.? అయితే మీ ఫోన్ లాక్ అవుతుంది

Smartphone: దేశంలో మొబైల్‌ ఫోన్లు, టాబ్లెట్లు వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను EMIలపై కొనుగోలు చేసే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రుణాలు తీసుకుని చెల్లింపులు నిలిపివేస్తున్న కేసులు కూడా పెరుగుతున్నాయని భావించిన ఆర్బీఐ కీల‌క మార్గదర్శకాలను ప్రతిపాదించింది.

90 రోజుల బకాయి తర్వాతే చర్యలు

RBI విడుదల చేసిన డ్రాఫ్ట్ నిబంధనల ప్రకారం, EMI చెల్లింపులు ఆలస్యమైన వెంటనే ఫోన్‌ను లాక్‌ చేయడం లేదా ఫీచర్లను నిలిపివేయడం జరగదు. కనీసం 90 రోజుల పాటు రుణం బకాయిగా ఉన్నప్పుడే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి ముందు వినియోగదారునికి వరుసగా నోటీసులు ఇవ్వడం తప్పనిసరిగా పేర్కొంది.

మొదటి నోటీసు EMI గడువు ముగిసిన 60 రోజుల తర్వాత ఇవ్వాలి. ఆ నోటీసులో బకాయి మొత్తాన్ని చెల్లించేందుకు 21 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా చెల్లింపులు జరగకపోతే, మరో హెచ్చరిక నోటీసు ఇవ్వాలి. రెండో నోటీసు తర్వాత కనీసం ఏడు రోజుల వ్యవధి పూర్తైన తర్వాత మాత్రమే ఫోన్‌ ఫీచర్లపై పరిమితులు అమలు చేయవచ్చు.

వినియోగదారుల అనుమతి తప్పనిసరి

ఈ విధానం అమల్లోకి రావాలంటే రుణ ఒప్పందంలోనే స్పష్టమైన అంగీకారం ఉండాలని RBI పేర్కొంది. అంటే వినియోగదారు ముందుగానే ఈ షరతులకు సమ్మతి తెలిపి ఉండాలి. బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు తమ ఇష్టానుసారం ఫోన్‌లను బ్లాక్‌ చేయలేవు. అలాగే ఈ సాంకేతికతను కేవలం రుణ బకాయిల వసూలు కోసమే వినియోగించాలని RBI స్పష్టం చేసింది. ఇతర వాణిజ్య ప్రయోజనాలు లేదా వినియోగదారులపై అదనపు ఒత్తిడి తీసుకురావడానికి దీనిని ఉపయోగించరాదని హెచ్చరించింది.

లాక్‌ చేసినా కొన్ని సేవలు ఆపరాదు

ఫోన్‌పై ఆంక్షలు విధించినా, కొన్ని కీలక సేవలు మాత్రం కొనసాగాల్సిందేనని RBI స్పష్టం చేసింది. ముఖ్యంగా ఇన్‌కమింగ్ కాల్స్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, SOS, అత్యవసర సేవలు, ప్రభుత్వ హెచ్చరిక సందేశాలు వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయరాదని పేర్కొంది. అంటే ఫోన్ పూర్తిగా పనిచేయకుండా కాకుండా, కొన్ని ప్రత్యేక ఫీచర్లకే పరిమితులు ఉండే అవకాశముంది.

బకాయి చెల్లిస్తే వెంటనే అన్‌లాక్‌

రుణగ్రహీత బకాయి మొత్తాన్ని చెల్లించిన వెంటనే పరిమితులను తొలగించాల్సి ఉంటుందని RBI పేర్కొంది. చెల్లింపు పూర్తయిన గంటలోపే ఫోన్‌ ఫీచర్లను తిరిగి యాక్టివ్‌ చేయాలి. అలా చేయకపోతే గంటకు రూ.250 చొప్పున పరిహారం చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు, వినియోగదారుల వ్యక్తిగత డేటాపై కూడా RBI ప్రత్యేక రక్షణ నిబంధనలు ప్రతిపాదించింది. ఫోన్‌ లాక్‌ చేసిన సందర్భంలో బ్యాంకులు, NBFCలు లేదా రికవరీ ఏజెంట్లు ఫోటోలు, మెసేజ్‌లు, కాంటాక్టులు లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయరాదని స్పష్టం చేసింది.

రికవరీ ఏజెంట్లకు కఠిన నియంత్రణలు

EMI వసూలు సమయంలో రికవరీ ఏజెంట్ల ప్రవర్తనపై కూడా RBI కఠిన నియమాలు తీసుకొస్తోంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే రుణగ్రహీతలను సంప్రదించాలి. బెదిరింపులు, అవమానకర వ్యాఖ్యలు, దుర్భాషలు లేదా కుటుంబ సభ్యులను వేధించడం వంటి చర్యలకు పూర్తిగా నిషేధం విధించింది. ప్రస్తుతం దేశంలో వినియోగదారుల ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లలో పెద్ద భాగం చిన్న రుణాల ద్వారానే జరుగుతోంది. కోట్లాది మంది EMIలపై మొబైల్‌ ఫోన్లు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో RBI ప్రతిపాదించిన ఈ కొత్త నిబంధనలు భవిష్యత్తులో భారీ ప్రభావం చూపే అవకాశముంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story