SIP: నెలకు రూ. 5 వేలు పక్కన పెడుతూ.. కోటి రూపాయలు సంపాదించడం ఎలా.?
SIP: జీవితంలో కోటి రూపాయలు సంపాదించడం అనేది చాలా మంది లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇందుకోసం ఎన్నో మార్గాలను ఎంచుకుంటారు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్‌లో SIP ద్వారా ప్రతి నెలా కొంత మొత్తం పెట్టడం వల్ల క్రమంగా మంచి సంపదను నిర్మించుకోవచ్చు.
SIP: నెలకు రూ. 5 వేలు పక్కన పెడుతూ.. కోటి రూపాయలు సంపాదించడం ఎలా.?
SIP: జీవితంలో కోటి రూపాయలు సంపాదించడం అనేది చాలా మంది లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇందుకోసం ఎన్నో మార్గాలను ఎంచుకుంటారు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్‌లో SIP ద్వారా ప్రతి నెలా కొంత మొత్తం పెట్టడం వల్ల క్రమంగా మంచి సంపదను నిర్మించుకోవచ్చు. కోటి రూపాయలు కూడబెట్టేందుకు ఎంత సమయం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
SIP అంటే ఏమిటి?
SIP అనేది మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ఒక సులభమైన పద్ధతి. ఇందులో ఒకేసారి పెద్ద మొత్తాన్ని పెట్టాల్సిన అవసరం ఉండదు. ప్రతి నెలా ఒక స్థిరమైన మొత్తాన్ని పెట్టుబడి రూపంలో పెట్టడం ద్వారా ఫండ్ యూనిట్లు కొనుగోలు అవుతాయి. మార్కెట్ పెరిగినా తగ్గినా పెట్టుబడి కొనసాగుతుండటంతో దీర్ఘకాలంలో మంచి రాబడులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇటీవల కాలంలో చాలా మంది యువత కూడా SIP పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు.
మ్యూచువల్ ఫండ్స్‌లో సాధారణంగా వచ్చే రాబడులు
మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడులు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. అయితే దీర్ఘకాలికంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా సంవత్సరానికి సుమారు 12 శాతం వరకు రాబడి ఇవ్వగలవని నిపుణులు చెబుతున్నారు. కొన్ని మంచి పనితీరు కనబరిచే ఫండ్స్‌లో అయితే 15 శాతం వరకు రాబడి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఇవి హామీ ఇచ్చే రాబడులు కావని, మార్కెట్ మార్పులపై ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకోవాలి.
నెలకు రూ.5,000 పెట్టుబడి పెడితే..
ఒక వ్యక్తి ప్రతి నెలా రూ.5,000 SIP ద్వారా పెట్టుబడి పెడుతున్నాడని అనుకుందాం. సంవత్సరానికి సగటుగా 12% రాబడి వస్తే, సుమారు 26 సంవత్సరాల తర్వాత మొత్తం నిధి రూ.1 కోటి వరకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీరు పెట్టే మొత్తం పెట్టుబడి సుమారు రూ.15 లక్షల వరకు మాత్రమే ఉంటుంది. అదే పెట్టుబడిపై సంవత్సరానికి సుమారు 15% రాబడి వస్తే, సుమారు 21 సంవత్సరాల్లోనే కోటి రూపాయల లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రధాన పాత్ర పోషించేది కాంపౌండింగ్ ప్రభావం. అంటే పెట్టుబడిపై వచ్చే లాభం కూడా తిరిగి పెట్టుబడిగా మారి మరింత లాభాన్ని తీసుకువస్తుంది.
స్టెప్ అప్ ఎస్ఐపీ ద్వారా లక్ష్యాన్ని త్వరగా చేరుకోవచ్చు
ఒకవేళ మీరు త్వరగా రూ.1 కోటి లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటే Step-up SIP అనే పద్ధతిని ఉపయోగించవచ్చు. అంటే ప్రతి సంవత్సరం మీ SIP మొత్తాన్ని కొంచెం పెంచడం. ఉదాహరణకు మీరు మొదట నెలకు రూ.5,000తో ప్రారంభించి ప్రతి సంవత్సరం ఆ మొత్తాన్ని 10% పెంచుకుంటూ వెళ్తే, అదే పెట్టుబడి సుమారు 18 నుంచి 19 సంవత్సరాల్లోనే కోటి రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
SIP పెట్టుబడిలో విజయానికి గుర్తుంచుకోవాల్సిన విషయాలు
SIP ద్వారా సంపద సృష్టించాలంటే కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి.
* చిన్న వయసులోనే పెట్టుబడి మొదలుపెడితే కాంపౌండింగ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
* మార్కెట్ పడిపోయినా SIP ఆపకుండా కొనసాగించాలి.
* కనీసం 10 నుండి 15 సంవత్సరాల పాటు పెట్టుబడిని కొనసాగిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.
నెలకు రూ.5,000 అనేది చిన్న మొత్తంగా అనిపించినా, సరైన ప్రణాళికతో దీర్ఘకాలిక పెట్టుబడి చేస్తే అది భారీ నిధిగా మారుతుంది. కాబట్టి మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా సరైన మ్యూచువల్ ఫండ్స్ ఎంపిక చేసుకుని క్రమంగా పెట్టుబడి ప్రారంభించడం మంచిది.
గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే చూడాలి. స్టాక్‌మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సూచనలు పాటించడం ఉత్తమం.




