Rules Change: అమ్మో.! ఒకటో తారీఖు.. మారనున్న రూల్స్.. సామాన్యులు ఇది తెలుసుకోవాల్సిందే!
Rules Change: సెప్టెంబర్ 1 నుంచి పలు కీలక నిబంధనలు మారనున్నాయి. ఎల్పీజీ ఈకేవైసీ, ఐటీ రిటర్న్స్ గడువు ముగియనుంది.
Rules Change: అమ్మో.! ఒకటో తారీఖు.. మారనున్న రూల్స్.. సామాన్యులు ఇది తెలుసుకోవాల్సిందే!
Rules Change: ఆగస్టు నెల ముగింపు దశకు చేరుకుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా పలు కీలకమైన నిబంధనల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మార్పులు సామాన్య ప్రజల జీవితంపై, ఆర్థిక విషయాలపై నేరుగా ప్రభావాన్ని చూపనున్నాయి.
ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు, విమాన ప్రయాణాలకు సంబంధించిన నిబంధనలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ నిబంధనల గురించి తెలుసుకుని నిర్దేశిత గడువు లోపు పనులు పూర్తి చేసుకోవడం ఎంతో అవసరం. లేకపోతే ఆర్థికంగా నష్టపోవడంతో పాటు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు ఈ-బోర్డింగ్ పాస్:
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన ప్రయాణికుల కోసం సరికొత్త విధానం అమలులోకి రానుంది. గతంలో ఎవరైనా విదేశాలకు వెళ్లాలంటే ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్ద తమ ఫిజికల్ బోర్డింగ్ పాస్‌పై అధికారులతో తప్పనిసరిగా స్టాంప్ వేయించుకోవాల్సి వచ్చేది.
ఈ ప్రక్రియ కోసం ప్రయాణికులు చాలా సమయం క్యూలైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ప్రయాణాలను మరింత సులభతరం చేసే ఉద్దేశంతో అధికారులు ఇకపై ఫిజికల్ పాస్‌ల అవసరాన్ని పూర్తిగా తొలగించారు. ప్రయాణికులు కేవలం తమ మొబైల్ ఫోన్‌లో ఉన్న ఈ-బోర్డింగ్ పాస్ డిజిటల్ కాపీ చూపిస్తే సరిపోతుంది.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా తనిఖీలను వేగంగా పూర్తి చేసి లోపలికి అనుమతిస్తారు. కాగితం వాడకాన్ని తగ్గించి డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించడంలో భాగంగా బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ఈ కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. దీనివల్ల విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ కూడా గణనీయంగా తగ్గుతుంది.
ఐటీ రిటర్న్స్ దాఖలుకు ఆగస్టు 31 తుది గడువు:
వ్యాపారాలు నిర్వహించే వారు, ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లించే వారికి ఆదాయపు పన్ను శాఖ కీలక సూచన చేసింది. అకౌంట్స్ ఆడిటింగ్ అవసరం లేని కేటగిరీకి చెందిన ట్యాక్స్ పేయర్లు తమ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఈ నెల 31వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది.
ఈ లోపు ఆన్‌లైన్ విధానంలో తమ రిటర్న్స్‌ను కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆగస్టు 31 లోగా దాఖలు చేయడంలో విఫలమైతే సెప్టెంబర్ 1 నుంచి కఠినమైన జరిమానాలు విధిస్తారు. వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్నవారు రూ.1000 వరకు లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వారి ఆదాయం రూ.5 లక్షలు దాటితే ఆ లేట్ ఫీజు ఏకంగా రూ.5000 వరకు ఉంటుంది. అనవసరంగా జరిమానాలు కట్టకుండా ముందే పన్ను చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేసుకోవడం ఉత్తమం.
ఎల్పీజీ సిలిండర్ల ఈకేవైసీ గడువు ముగింపు:
దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్లు వినియోగిస్తున్న వారు తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఆగస్టు 31వ తేదీతో గడువు ముగియనుంది. వాస్తవానికి ఈ గడువును అధికారుల ఇప్పటికే పలుమార్లు పొడిగించారు.
వినియోగదారులు సెప్టెంబర్ 1లోగా తమ సమీప గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి బయోమెట్రిక్ తనిఖీ పూర్తి చేసుకోవాలి. ఒకవేళ ఈ నెలాఖరు లోపు ఈకేవైసీ చేయించుకోకపోతే సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వం నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే గ్యాస్ సబ్సిడీ నిలిచిపోయే ప్రమాదం ఉంది.
ఒకే వ్యక్తి పేరు మీద ఉన్న బహుళ కనెక్షన్లు, నకిలీ కనెక్షన్లను ఏరి వేసి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీని చేరవేయాలనే ప్రధాన లక్ష్యంతో ఈ వెరిఫికేషన్ చేస్తున్నారు. కాబట్టి గ్యాస్ కస్టమర్లు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈ పనిని పూర్తి చేసి సబ్సిడీ ప్రయోజనాన్ని పొందాలి.




