UPI Services Down: డిజిటల్ పేమెంట్స్ చేసే వారికి అలర్ట్.. నిలిచిపోనున్న యూపీఐ సేవలు

UPI Services Down: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది.

CR Reddy
Published on: 3 Sept 2026 10:30 AM IST
UPI Services Down
X

UPI Services Down

UPI Services Down: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. సాంకేతిక నిర్వహణ పనుల కారణంగా సెప్టెంబర్ 4వ తేదీ అర్థరాత్రి యూపీఐ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. ఈ సేవలకు అంతరాయం కలగనుండటంతో ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. రాబోయే టెక్నికల్ అప్ డేట్స్ కారణంగా సెప్టెంబర్ 4వ తేదీ అర్థరాత్రి 12:15 గంటల నుంచి 1 గంట వరకు, అంటే సరిగ్గా 45 నిమిషాల పాటు ఎస్బీఐ ఖాతా ఆధారిత యూపీఐ సేవలు లభించవు. ఈ సమయంలో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి ప్రముఖ యాప్‌ల ద్వారా ఎస్బీఐ అకౌంట్ నుంచి చేసే లావాదేవీలు ఆగిపోనున్నాయి. షెడ్యూల్ చేసిన సాంకేతిక పనులు వేగంగా పూర్తి చేయడం కోసమే ఈ చిన్న విరామం తీసుకుంటున్నట్లు ఎస్బీఐ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది.

ప్రత్యామ్నాయంగా ఈ సేవల వినియోగం సులభం

యూపీఐ సేవలు నిలిచిపోయినప్పటికీ కస్టమర్లు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని బ్యాంక్ యాజమాన్యం స్పష్టం చేసింది. అత్యవసరంగా డబ్బులు బదిలీ చేయాలనుకునే వినియోగదారులు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ వంటి ఇతర డిజిటల్ మార్గాలను యథావిధిగా ఉపయోగించుకోవచ్చు. ఇవి ఎలాంటి అభ్యంతరం లేకుండా సాధారణంగానే పనిచేస్తాయి. అర్థరాత్రి వేళ వినియోగదారుల సంచారం, లావాదేవీల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అత్యంత తక్కువ ప్రభావం పడే ఈ సమయాన్ని బ్యాంక్ ఎంచుకుంది.

యూపీఐ లైట్ వినియోగానికి గ్రీన్ సిగ్నల్

సాధారణ యూపీఐ పనిచేయకపోయినా, ఎస్బీఐ యూపీఐ లైట్ సేవలు మాత్రం ఎలాంటి అంతరాయం లేకుండా అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. చిన్న చిన్న లావాదేవీల కోసం యూజర్లకు ఇది ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. టెక్నికల్ వర్క్స్ నిర్ణీత గడువు కంటే ముందే పూర్తయితే సేవలను తక్షణమే పునరుద్ధరిస్తామని ఎస్బీఐ ప్రకటించింది.

యూపీఐ లైట్ నిబంధనలు, పరిమితులు

యూపీఐ లైట్ ఫీచర్ ద్వారా వినియోగదారులు యూపీఐ పిన్ నంబర్ నమోదు చేయకుండానే ఒక్కో దఫాలో రూ.1,000 వరకు క్షణాల్లో పంపుకోవచ్చు. దీని ద్వారా గరిష్టంగా ఒక రోజులో రూ.5,000 వరకు లావాదేవీలు జరుపుకునే వీలుంది. రోజువారీగా చూస్తే సాధారణ యూపీఐ ద్వారా రూ.1 లక్ష వరకు బదిలీ చేయవచ్చు. విద్య, వైద్యం, ఇన్సూరెన్స్ వంటి కీలక రంగాలకు రూ.5 లక్షల వరకు పరిమితిని ఆర్బీఐ విధించింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story