SBI: 13 మంది ఉద్యోగులను కోటీశ్వరులను చేసిన ఎస్బీఐ
SBI: ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ లిస్టింగ్ అంచనాలను అందుకోలేకపోయినా, కంపెనీ ఉద్యోగులకు మాత్రం కాసుల వర్షం కురిపించింది.
SBI: 13 మంది ఉద్యోగులను కోటీశ్వరులను చేసిన ఎస్బీఐ
SBI: ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ లిస్టింగ్ రోజే 13 మంది ఉద్యోగులను కోటీశ్వరులను చేసింది. కంపెనీ కేటాయించిన ఈఎస్ఓపీల మహిమతో సీనియర్ అధికారులు కోట్ల విలువైన సంపదను సొంతం చేసుకున్నారు. నయా దందాలో స్టాక్ మార్కెట్ సాధారణ ఇన్వెస్టర్లకు కొన్నిసార్లు ఆశించినంత లాభాలు అందించకపోవచ్చు.. కానీ, ఒక కంపెనీని నమ్ముకుని దాన్ని నిలబెట్టిన ఉద్యోగులకు మాత్రం జాక్‌పాట్ తగలవచ్చని ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ మరోసారి నిరూపించింది.
దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల్లో ఒకటైన ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ షేర్లు మంగళవారం స్టాక్ ఎక్స్చేంజీల్లోకి అడుగుపెట్టాయి. గ్రే మార్కెట్లో 18% వరకు ప్రీమియం దక్కుతుందని ఆశించిన ఇన్వెస్టర్లకు, కేవలం 7% ప్రీమియంతో రూ. 613.30 వద్ద లిస్ట్ అయి కాస్త నిరాశే మిగిల్చింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ. 601.50కి చేరి ఇన్వెస్టర్ల దాహాన్ని పూర్తిగా తీర్చలేకపోయినా.. కంపెనీ ఉద్యోగుల జీవితాలను మాత్రం ఒక్క రోజులోనే మార్చేసింది.
కంపెనీ ఘనవిజయంలో భాగస్వాములైన ఉద్యోగుల కోసం ఎస్బీఐ ఫండ్స్ 2018లోనే ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్ ప్రారంభించింది. అప్పట్లో ఉద్యోగులకు కేవలం రూ. 39 నుంచి రూ. 455 మధ్య ధరకే షేర్ ఆప్షన్లను కేటాయించింది. ఇప్పుడు ఐపీఓ ఇష్యూ ప్రైస్ రూ. 574గా తేలడంతో.. ఉద్యోగులు పొందిన ఈఎస్ఓపీల విలువ ఆకాశాన్నంటింది. దీంతో సంస్థలోని ఏకంగా 13 మంది ఉద్యోగులు కోటీశ్వరుల క్లబ్‌లో చేరిపోయారు.
కంపెనీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ దేవిందర్ పాల్ సింగ్ వద్ద 21.14 లక్షల వెస్టెడ్ షేర్లు ఉన్నాయి. ఇష్యూ ప్రైస్ రూ. 574 ప్రకారం వీటి విలువ అక్షరాలా రూ. 121 కోట్లు. ఇది కాకుండా భవిష్యత్తులో లభించే అన్‌వెస్టెడ్ షేర్ల విలువ మరో రూ. 30 కోట్లు ఉండే అవకాశం ఉంది. చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ శ్రీనివాసన్ వద్ద ఉన్న 18.25 లక్షల వెస్టెడ్ షేర్ల విలువ రూ. 105 కోట్లు. ఆయన అన్‌వెస్టెడ్ ఆప్షన్ల విలువ మరో రూ. 51 కోట్లుగా అంచనా.
వీరితో పాటు CFO ఇంద్రజీత్ ఘులియాని, CHRO రజత్ గ్రోవర్, CISO సంజయ్ పుగావోంకర్, ఫండ్ మేనేజర్లు మోహన్ లాల్, మహేశ్ ఛాబ్రియా వంటి పలువురు సీనియర్ అధికారులు కూడా రూ. 1 కోటికిపైగా విలువైన ఈఎస్ఓపీలను సొంతం చేసుకున్నారు. మార్కెట్ మూడ్ ఎలా ఉన్నా, ఒక సంస్థ సాధించిన విజయాల్లో ఉద్యోగులకు భాగస్వామ్యం కల్పిస్తే వారి జీవితాలు ఎలా మారిపోతాయో చెప్పడానికి ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఈఎస్ఓపీ స్కీమ్ ఒక ఉదాహరణగా నిలిచింది.




