SBI ఖాతాదారుల‌కు షాకింగ్ న్యూస్‌.. జూలై 1 నుంచి కీల‌క మార్పులు

SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల‌కు అల‌ర్ట్‌.

Mokshith
Published on: 5 Jun 2026 11:38 AM IST
SBI
X

SBI ఖాతాదారుల‌కు షాకింగ్ న్యూస్‌.. జూలై 1 నుంచి కీల‌క మార్పులు

SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల‌కు అల‌ర్ట్‌. కొన్ని ర‌కాల క్రెడిట్ కార్డులు ఉప‌యోగిస్తున్న వారికి జూలై 1, 2026 నుంచి రివార్డ్ పాయింట్ల విషయంలో పెద్ద మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు కొన్ని లావాదేవీల ద్వారా రివార్డ్ పాయింట్లు పొందుతున్న వినియోగదారులకు ఇకపై ఆ ప్రయోజనం తగ్గనుంది.

పర్పుల్ కార్డ్ వినియోగదారులకు తగ్గనున్న ప్రయోజనాలు

PhonePe SBI క్రెడిట్ కార్డ్ పర్పుల్ కార్డ్ హోల్డర్లకు ఇప్పటివరకు PhonePe ద్వారా చేసిన ఖర్చులపై నెలకు గరిష్టంగా 1,000 రివార్డ్ పాయింట్లు లభించేవి. కొత్త నిబంధనల ప్రకారం ఈ పరిమితిని త‌గ్గించారు. ఇన్సూరెన్స్ చెల్లింపులపై గరిష్టంగా 250 పాయింట్లు మాత్రమే ఇవ్వ‌నున్నారు. అలాగే ఇతర PhonePe ఖర్చులపై గరిష్టంగా 750 పాయింట్లు మాత్రమే ఉండ‌నున్నాయి. ఇక ఆన్‌లైన్ లావాదేవీలపై రివార్డ్ పాయింట్ల పరిమితిని 1,000 నుంచి 750కు తగ్గించారు. దీంతో పర్పుల్ కార్డ్ వినియోగదారులు గతంతో పోలిస్తే తక్కువ రివార్డ్ పాయింట్లు పొందే అవకాశం ఉంది.

సెలెక్ట్ బ్లాక్ కార్డ్ హోల్డర్లకు కూడా దెబ్బ

PhonePe SBI Select Black క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు కూడా రివార్డ్ పాయింట్ల పరిమితిని తగ్గించారు.

ఇప్పటివరకు PhonePe ఖర్చులపై నెలకు 2,000 పాయింట్లు లభించేవి కొత్తగా ఇన్సూరెన్స్ చెల్లింపులపై గరిష్టంగా 500 పాయింట్లు, ఇతర PhonePe లావాదేవీలపై గరిష్టంగా 1,500 పాయింట్లు, ఆన్‌లైన్ ఖర్చులపై రివార్డ్ పాయింట్ల పరిమితిని 2,000 నుంచి 1,000కు త‌గ్గించ‌నున్నారు. ఈ మార్పుల వల్ల ఎక్కువ మొత్తంలో ఆన్‌లైన్ ఖర్చులు చేసే వినియోగదారులపై ప్రభావం పడనుంది.

ఈ లావాదేవీలపై ఇక రివార్డ్ పాయింట్లు ఉండవు

కొన్ని కేటగిరీలకు సంబంధించిన లావాదేవీలపై ఇకపై ఎలాంటి రివార్డ్ పాయింట్లు ఇవ్వబోమని SBI కార్డ్ ప్రకటించింది. టోల్, బ్రిడ్జి ఫీజుల చెల్లింపులు, గిఫ్ట్‌ల కొనుగోళ్లు, బంగారం, ఆభరణాల కొనుగోళ్లు, విద్యాసంస్థలకు చెల్లించే ఫీజులు, ఫోన్‌పే యాప్ కాకుండా ఇతర మార్గాల్లో చెల్లించిన యుటిలిటీ బిల్లులు, ఫోన్‌పేలో కాకుండా చెల్లించే ఇన్సూరెన్స్ ప్రీమియంలు వంటి కేటగిరీలలో ఖర్చు చేసే వినియోగదారులు ఇకపై రివార్డ్ పాయింట్ల ప్రయోజనం పొందలేరు.

ఇతర ప్రయోజనాల్లో మార్పులు లేవు

రివార్డ్ పాయింట్ల నిబంధనల్లో మాత్రమే మార్పులు చేస్తున్నామని SBI కార్డ్ స్పష్టం చేసింది. కార్డుకు సంబంధించిన ఇతర ప్రయోజనాలు, ఆఫర్లు, సేవలు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది. కాబట్టి రివార్డ్ పాయింట్ల విషయంలో మాత్రమే వినియోగదారులు కొత్త నిబంధనలను గుర్తుంచుకోవాలి.

కార్డ్ వినియోగదారులు ఇప్పుడు ఏం చేయాలి?

జూలై 1, 2026 నుంచి అమల్లోకి వచ్చే ఈ కొత్త నిబంధనలను దృష్టిలో పెట్టుకుని ఖర్చులను ప్లాన్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఇన్సూరెన్స్ ప్రీమియంలు, బిల్లుల చెల్లింపులు, విద్యా ఫీజులు, ఆభరణాల కొనుగోళ్లు చేసే వారు రివార్డ్ పాయింట్లలో తగ్గుదల ఉంటుందని గుర్తించాలి. రివార్డ్ పాయింట్లను ఎక్కువగా పొందాలనుకునే వినియోగదారులు కొత్త పరిమితులను అర్థం చేసుకుని, వాటికి అనుగుణంగా కార్డ్ వినియోగాన్ని మార్చుకోవడం ద్వారా అందుబాటులో ఉన్న ప్రయోజనాలను గరిష్టంగా ఉపయోగించుకోవచ్చు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story