Samsung India Layoffs: శాంసంగ్ ఇండియాలో ఉద్యోగాల కోత.. కారణం ఇదే!
Samsung India Layoffs: శాంసంగ్ ఇండియా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఉద్యోగాల కోత ప్రారంభించింది. సేల్స్, మేనేజ్‌మెంట్ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం.
Samsung India Layoffs: శాంసంగ్ ఇండియాలో ఉద్యోగాల కోత.. కారణం ఇదే!
Samsung India Layoffs: ప్రముఖ మల్టీనేషనల్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం 'శాంసంగ్ ఇండియా' తమ ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. తగ్గిన వినియోగదారుల డిమాండ్, పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, మేనేజ్‌మెంట్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో వ్యయ హేతుబద్ధీకరణ చర్యల్లో భాగంగా కంపెనీ ఉద్యోగాల కోతను ప్రారంభించింది. ఈ రౌండ్ తొలగింపులు ప్రధానంగా టెలివిజన్, డిజిటల్ గృహోపకరణాల వ్యాపార విభాగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ లేఆఫ్స్ దశలవారీగా జరుగుతుండగా, డైరెక్టర్లు, టీమ్ లీడర్లు, హెచ్‌క్యూ ఎగ్జిక్యూటివ్‌లు, బ్రాంచ్ మరియు ఏరియా మేనేజర్లతో సహా వివిధ స్థాయిల్లోని మధ్య, ఉన్నత స్థాయి ఉద్యోగులకు కంపెనీ టెర్మినేషన్ నోటీసులు జారీ చేస్తోంది. ఇప్పటికే కొందరికి తొలగింపు లేఖలు అందగా, ప్రభావితమైన కొంతమంది ఉద్యోగులను నోటీసు పీరియడ్ పూర్తి చేయాల్సిన అవసరం లేకుండా తక్షణమే విధుల నుంచి తప్పుకోవాలని సూచించినట్లు సమాచారం. అయితే ఈ సమాచారంపై అధికారికంగా స్పందించడానికి శాంసంగ్ ప్రతినిధులు నిరాకరించారు.
తొలగింపునకు గురైన ఉద్యోగులకు మూడు నెలల బేసిక్ జీతంతో పాటు, కంపెనీలో పూర్తి చేసిన ప్రతి ఏడేళ్ల సేవకు అదనంగా ఒక నెల జీతం ఇచ్చేలా సెవరెన్స్ ప్యాకేజీని సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది. మెమరీ చిప్‌ల ధరలు భారీగా పెరగడం, ముడి పదార్థాల ఖర్చులు, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం మరియు ఆటోమేషన్ వల్ల ఖర్చులు పెరిగాయని విశ్లేషకులు తెలిపారు. మరోవైపు, టెలివిజన్ మరియు హోమ్ అప్లయెన్సెస్ విక్రయ బృందాలను విలీనం చేసే ప్రక్రియను డిసెంబర్ త్రైమాసికం వరకు వాయిదా వేసినట్లు సమాచారం.




