Rupee Value: పధ్నాలుగేళ్లలో ఇదే మొదటిసారి.. రూపాయి భారీ పతనం

Rupee Value: పడిపోతున్న రూపాయి విలువ. పధానాలుగేళ్లలో తొలిసారిగా ఒకే సంవత్సరంలో 10% పడిపోయింది.

KVD Varma
Published on: 27 March 2026 5:29 PM IST
Rupee Value: పడిపోతున్న రూపాయి విలువ.
X

Rupee Value

Rupee Value: పశ్చిమ ఆసియా ఘర్షణలు తీవ్రతరం కావడంతో భారత ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలవుతోంది. రూపాయి మరో రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. రూపాయి ప్రస్తుతం 28 పైసలు క్షీణించి 94.24 వద్ద ఉంది. బుధవారం తర్వాత ఇదే అతిపెద్ద పతనం. భారత మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడిదారులు వైదొలగడం, ఇరాన్‌లో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ప్రస్తుత క్షీణత ఏర్పడింది. బుధవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే 93.94 వద్ద ప్రారంభమైన రూపాయి, 93.86 నుంచి 94.08 మధ్య కదలాడింది. చివరకు 94.24 వద్దకు వచ్చింది.

ప్రపంచ ముడి చమురు ధరల తగ్గుదల, అమెరికా డాలర్ బలహీనపడటం, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో బలం వంటి అనేక అంశాలు రూపాయి విలువ క్షీణతకు దోహదపడుతున్నాయని నిపుణులు అంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బిఐ రూపాయి విలువను 94 స్థాయిలోనే కొనసాగిస్తుందని, లేదా 03.30 నుండి 92.80కి తగ్గిస్తుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఇరాన్‌తో చర్చలు సజావుగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించిన తర్వాత ప్రపంచ చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ చర్చల్లో భాగంగా అమెరికా టెహ్రాన్‌లో తన సైనిక చర్యను తాత్కాలికంగా నిలిపివేసింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రస్తుతం 2.08 శాతం తగ్గి, 105.75 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

గత నెలలోనే రూపాయి దాదాపు 4% పడిపోగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇది 10% పైగా క్షీణించింది. గత 14 ఏళ్లలో ఇదే అతిపెద్ద క్షీణత. బెర్న్‌స్టీన్ అనే విదేశీ బ్రోకరేజ్ సంస్థ నివేదిక ప్రకారం, ఇరాన్ యుద్ధం కొనసాగితే, రూపాయి త్వరలోనే 98కి చేరవచ్చు.

భారతదేశ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి మార్చి వరకు ఉంటుంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం, గత 14 ఏళ్లలో ఒకే సంవత్సరంలో రూపాయి ఇంతగా పడిపోవడం ఇదే మొదటిసారి. గతంలో, 2011-12లో యూరోజోన్ సంక్షోభం సమయంలో, రూపాయి సుమారుగా 14% పడిపోయింది. ఇదిలా ఉండగా, మార్చి 31, 2025 నుండి రూపాయి తన విలువలో 10% కోల్పోయింది.

రూపాయి పతనం అవుతుండడంతో భారత ఆర్థికస్థితి పై భారం ఇలా . .

చమురు ధరలు: పెరుగుతున్న ముడి చమురు ధరల వల్ల భారతదేశ దిగుమతుల బిల్లు పెరిగింది.

నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి: ఎల్‌పిజి నుండి ప్లాస్టిక్, ఇతర పెట్రోకెమికల్ ఉత్పత్తుల వరకు అన్నింటి సరఫరాకు అంతరాయం కలిగింది. ద్రవ్యోల్బణ భయం: డాలర్ విలువ పెరగడం వల్ల భారతదేశంలో పెట్రోల్-డీజిల్, దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలు పెరుగుతాయి, దీనివల్ల చిల్లర ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది.

విదేశాలలో చదువుకోవడం -ప్రయాణించడం ఖరీదైనది: మీరు విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నా లేదా మీకు తెలిసిన వారు విదేశాలలో చదువుకుంటున్నా, డాలర్లు కొనడానికి మీరు ఎక్కువ రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఎలక్ట్రానిక్స్,ముడి పదార్థాల ధరలు: విదేశాల నుండి దిగుమతి చేసుకునే మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర విడిభాగాలు ఖరీదైనవిగా ఉండవచ్చు, ఎందుకంటే కంపెనీలు వాటికి డాలర్లలో చెల్లిస్తాయి.

KVD Varma

KVD Varma

జర్నలిజం రంగంలో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. 2008లో సాక్షి పత్రికలో రిపోర్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించాను. డిజిటల్ విప్లవంతో ఇటువైపు ప్రయాణంలో భాగంగా HMTVతో ప్రారంభించి TV9, RTV, Mahaa News వంటి అగ్రగామి సంస్థల్లో డిజిటల్ జర్నలిస్టుగా పనిచేశాను. ప్రస్తుతం HMTV వెబ్‌సైట్ వేదికగా పాఠకులకు తాజా వార్తలను అందిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ.. హిందీ, ఇంగ్లీష్ వార్తలను తెలుగు పాఠకుల అభిరుచికి అనుగుణంగా అనువదించి, విశ్లేషణాత్మక కథనాలను అందించడం నా ప్రత్యేకత.

Next Story