Reliance: మ‌రో రంగంలోకి అడుగుపెడుతోన్న రిల‌య‌న్స్‌.. ఈసారి టార్గెట్ ఏంటంటే?

Reliance: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వినియోగదారుల వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే పలు FMCG ఉత్పత్తులతో మార్కెట్లో ఉన్న రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) తాజాగా ఐస్‌క్రీమ్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది.

Mokshith
Published on: 2 Sept 2026 10:58 AM IST
Reliance
X

Reliance: మ‌రో రంగంలోకి అడుగుపెడుతోన్న రిల‌య‌న్స్‌.. ఈసారి టార్గెట్ ఏంటంటే? 

Reliance: నిజమైన డెయిరీ క్రీమ్‌తో తయారీ

రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) ‘బాంబే క్రీమరీ’ (Bombay Creamery) పేరుతో కొత్త ఐస్‌క్రీమ్ బ్రాండ్‌ను సెప్టెంబర్ 1, 2026న ప్రారంభించింది. బాంబే క్రీమరీ ఐస్‌క్రీమ్‌ల తయారీలో నిజమైన డెయిరీ క్రీమ్‌ను ఉపయోగిస్తున్నట్లు రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వెల్లడించింది. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా వినియోగదారులకు మంచి రుచి అందించడమే తమ లక్ష్యమని తెలిపింది. 'అందుబాటు ధరలో అంతర్జాతీయ స్థాయి నాణ్యత' అనే విధానంతో ఈ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తోంది. భారతీయ కుటుంబాలకు నాణ్యమైన డెయిరీ ఉత్పత్తులు సరసమైన ధరల్లో అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ బ్రాండ్‌ను రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.

రూ.10 నుంచే ప్రారంభం.. ఎన్నో రకాల ఐస్‌క్రీమ్‌లు

బాంబే క్రీమరీ ఐస్‌క్రీమ్‌లు పలు రకాల ఫార్మాట్లలో అందుబాటులోకి రానున్నాయి. ఇందులో కోన్స్, కప్స్, టబ్స్, బార్స్, స్టిక్స్ వంటి ఉత్పత్తులు ఉంటాయి. ఈ ఐస్‌క్రీమ్‌ల ధరలు కేవలం రూ.10 నుంచి ప్రారంభం కానున్నాయి. తక్కువ ధరలో ప్రీమియం అనుభూతిని అందించాలనే లక్ష్యంతో రిలయన్స్ ఈ బ్రాండ్‌ను రూపొందిస్తోంది. దీంతో ఇప్పటికే దేశీయ ఐస్‌క్రీమ్ మార్కెట్లో ఉన్న ప్రముఖ కంపెనీలకు బాంబే క్రీమరీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

తొలుత పశ్చిమ భారతదేశంలో.. తర్వాత దేశవ్యాప్తంగా విస్తరణ

బాంబే క్రీమరీ ఉత్పత్తులను తొలుత పశ్చిమ భారతదేశంలోని మార్కెట్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత దశలవారీగా దేశవ్యాప్తంగా విస్తరించాలని RCPL ప్రణాళికలు రూపొందిస్తోంది. రిలయన్స్‌కు ఇప్పటికే దేశవ్యాప్తంగా బలమైన పంపిణీ వ్యవస్థ, విస్తృతమైన రిటైల్ నెట్‌వర్క్ ఉంది. దీంతో కొత్త ఐస్‌క్రీమ్ బ్రాండ్‌ను వేగంగా దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది. ఐస్‌క్రీమ్ రంగంలోకి కేవలం తాత్కాలికంగా ప్రవేశించడం కాదని, దీర్ఘకాలికంగా ఈ విభాగంలో కొనసాగాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అంబానీ కుటుంబం నుంచి రెండు ఐస్‌క్రీమ్ బ్రాండ్లు

ఇటీవల అంబానీ కుటుంబానికి చెందిన వంతారా క్రీమరీ కూడా ప్రీమియం ఐస్‌క్రీమ్ మార్కెట్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అనంత్ అంబానీ నేతృత్వంలోని వన్యప్రాణుల సంరక్షణ సంస్థ వంతారా పేరుతో ఈ బ్రాండ్‌ను తీసుకొచ్చారు. వంతారా క్రీమరీలో భారతీయ సంప్రదాయ రుచులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మలై కుల్ఫీ, గువా చిల్లీ, ఫిల్టర్ కాఫీ, లెమన్ సోర్బెట్, కేసర్ పెడా వంటి ప్రత్యేక రుచులతో ఐస్‌క్రీమ్‌లను అందిస్తున్నారు.

ఇప్పుడు రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కూడా బాంబే క్రీమరీతో రంగంలోకి దిగడంతో కొద్ది నెలల వ్యవధిలోనే అంబానీ కుటుంబానికి చెందిన రెండు ఐస్‌క్రీమ్ బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చినట్లయింది. భారీ పంపిణీ వ్యవస్థ, అందుబాటు ధరలతో బాంబే క్రీమరీ భారత ఐస్‌క్రీమ్ మార్కెట్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో చూడాలి.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story