RBI: ఆర్బీఐ 4 కొత్త రూల్స్.. నెట్ బ్యాంకింగ్‌తో డబ్బు ట్రాన్స్ఫర్ చేసే వారికి అలర్ట్..!
RBI: డిజిటల్ మోసాలకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ 4 కీలక నిబంధనలను తెస్తోంది.
RBI: ఆర్బీఐ 4 కొత్త రూల్స్.. నెట్ బ్యాంకింగ్‌తో డబ్బు ట్రాన్స్ఫర్ చేసే వారికి అలర్ట్..!
UPI: డిజిటల్ చెల్లింపుల విప్లవంలో మన ప్రయాణం ఎంత వేగంగా సాగుతుందో, అదే స్థాయిలో మన వెంటే పొంచి ఉన్న సైబర్ దొంగల ముప్పు కూడా అంతే వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, సామాన్యుడి కష్టార్జితాన్ని కాపాడేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అద్భుతమైన రక్షణ కవచాలను సిద్ధం చేస్తోంది. మీ ఫోన్‌పే, గూగుల్ పే వాడుతున్నారా? అయితే రాబోయే ఈ మార్పులు మీ కోసమే. ఆసక్తికరమైన ఆ 4 కొత్త రూల్స్ ఏంటో చూద్దాం.
మోసగాళ్లకు బ్రేక్
మనం సాధారణంగా డబ్బులు పంపగానే సెకన్లలో అవతలి వారికి చేరిపోతాయి. కానీ, ఇకపై రూ. 10,000 కంటే ఎక్కువ నగదు బదిలీ చేసినప్పుడు ఒక గంట నిరీక్షణ సమయం ఉండబోతోంది. సైబర్ నేరగాళ్లు మనల్ని మాటల్లో దించి క్షణాల్లో డబ్బులు కాజేస్తుంటారు. ఈ ఒక గంట గ్యాప్ వల్ల, మనం మోసపోయామని గ్రహిస్తే వెంటనే ఆ లావాదేవీని రద్దు చేసే అవకాశం ఉంటుంది. దేశంలో జరిగే 98.5% డిజిటల్ మోసాలు ఈ రూ. 10 వేల పైన జరిగే లావాదేవీల్లోనే ఉంటున్నాయి. అందుకే ఈ నిబంధన ఒక బలమైన అడ్డంకిగా మారనుంది.
మీ ఖాతాకు సెల్ఫ్-లాక్
మీ ఫోన్ పోయిందా? లేదా ఎవరైనా మీ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేశారా? కంగారు పడక్కర్లేదు. ఆర్బీఐ ప్రతిపాదిస్తున్న కిల్ స్విచ్ ఫీచర్ ద్వారా ఒక్క క్లిక్‌తో మీ డిజిటల్ లావాదేవీలన్నింటినీ ఆపేయవచ్చు. ఇది మొబైల్ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో అందుబాటులో ఉంటుంది. మీరు మళ్ళీ బ్యాంకుకు వెళ్లి స్వయంగా ధృవీకరించుకునే వరకు ఆ ఖాతా నుంచి ఒక్క రూపాయి కూడా బయటకు వెళ్ళదు. ఇది ఇన్వెస్టర్లకు, సామాన్యులకు బ్రహ్మాస్త్రం లాంటిది.
సీనియర్ సిటిజన్లకు భద్రత
వృద్ధులు, దివ్యాంగులు ఫోన్ కాల్ మోసాలకు సులభంగా చిక్కుతుంటారు. దీనిని అరికట్టేందుకు రూ. 50,000 దాటిన లావాదేవీలకు అదనపు ధృవీకరణ అవసరమని ఆర్బీఐ అంటోంది. వృద్ధులు పెద్ద మొత్తంలో డబ్బు పంపేటప్పుడు, వారు ముందుగా ఎంపిక చేసుకున్న ఒక నమ్మకస్థుడైన వ్యక్తి ఫోన్‌కు అలర్ట్ వెళ్తుంది. వారి అనుమతి లేదా ధృవీకరణ ఉంటేనే ఆ నగదు బదిలీ అవుతుంది. ఇది కుటుంబ పెద్దల సొమ్ముకు కొండంత అండ.
ఉక్కుపాదం
నేరగాళ్లు దొంగిలించిన డబ్బును దారి మళ్లించడానికి అనామక వ్యక్తుల పేర్ల మీద ఉండే 'మ్యూల్ అకౌంట్ల'ను వాడుతుంటారు. ఇకపై తగిన గుర్తింపు పత్రాలు సరిగా లేని ఖాతాల్లో ఏడాదికి రూ. 25 లక్షల కంటే ఎక్కువ జమ అయితే బ్యాంకులు అలర్ట్ అవుతాయి. అదనపు ఆదాయ వనరుల ఆధారాలు చూపిస్తే తప్ప ఆ లావాదేవీలు సాగవు. దీనివల్ల మనీ లాండరింగ్ గొలుసు తెగిపోతుంది. గత నాలుగేళ్లలో డిజిటల్ మోసాల సంఖ్య 2.6 లక్షల నుండి ఏకంగా 28 లక్షలకు పెరగడం గమనార్హం. పోగొట్టుకున్న సొమ్ము విలువ రూ. 22,931 కోట్లకు చేరింది. ఇంతటి భారీ దోపిడీని అడ్డుకోవాలంటే ఇటువంటి మార్పులు అనివార్యమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.




