RBI on Rupee Value: రూపాయి పతనం.. బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశం
RBI on Rupee Value: వేగంగా పతనం అవుతున్న రూపాయి విలువను నివారించేందుకు ఆర్బీఐ బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
RBI on Rupee Value
RBI on Rupee Value ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో మన రూపాయి విలువ డాలర్ తో పోల్చుకుంటే వేగంగా తగ్గిపోతోంది. ఇప్పటికే ఆల్ టైం కనిష్ట స్థాయికి రూపాయి విలువ పడిపోయింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ కీలక చర్యలకు తీసుకోవడానికి సిద్ధం అయింది. బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీని ప్రకారం బ్యాంకులు తమ వద్ద కేవలం 100 మిలియన్ డాలర్లు (సుమారు 950 కోట్ల రూపాయలు) మాత్రమే ఉంచుకోవచ్చు. అంతకంటే అదనంగా ఉంచుకోవడానికి వీలుకాదు. గతంలో బ్యాంకులు రోజుకు 300 నుంచి 500 డాలర్లు అంటే సుమారు 2,845 కోట్ల నుంచి 4,743 కోట్ల రూపాయల వరకూ నిలువ ఉంచుకునే అవకాశం ఉండేది.
దీనివలన లాభం ఏమిటి?
ఈ నిర్ణయం వలన బ్యాంకులు తమ వద్ద ఉన్న డాలర్లను అమ్మకానికి పెడతాయి. దీంతో రూపాయి బలపడుతుందని ఫారెక్స్ నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వలన విదేశీ వస్తువులు, విదేశాల్లో చదువుకు అయ్యే ఖర్చు, విదేశీ ప్రయాణాల ఖర్చు తగ్గుతుంది. అంతే కాకుండా దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు అంటే మొబైల్ ఫోన్స్, లేపి టాప్ వంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులు ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.
ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి.
ఆర్బిఐ ఈ ఆదేశాన్ని జారీ చేయడానికి కేవలం ఒక రోజు ముందు, రూపాయి డాలర్‌తో పోలిస్తే ₹94.59 వద్ద సర్వకాలీన కనిష్ట స్థాయికి చేరుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం, మార్కెట్ అస్థిరత దృష్ట్యా ఆర్బిఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆదేశాన్ని జారీ చేస్తూ, ప్రతి ట్రేడింగ్ రోజు ముగిసే సమయానికి ఆన్‌షోర్ డెలివరబుల్ మార్కెట్లో భారత కరెన్సీలో తమ నెట్ ఓపెన్ పొజిషన్ (NOP-INR)ను 100 మిలియన్ డాలర్ల కంటే తక్కువకు పరిమితం చేయాలని ఆర్బిఐ అన్ని బ్యాంకులను ఆదేశించింది. అంటే, ప్రతి ట్రేడింగ్ రోజు ముగిసే సమయానికి బ్యాంకులు తమ విదేశీ కరెన్సీ ఎక్స్పోజర్ను ఈ పరిధిలోనే నిర్వహించాలి.
నెట్ ఓపెన్ పొజిషన్ అంటే..
నెట్ ఓపెన్ పొజిషన్లు అంటే బ్యాంకులు కొనుగోళ్లు, విక్రయాలు వంటి లావాదేవీలు జరిపినప్పటికీ, తమ వద్ద హెడ్జ్ చేయని విదేశీ కరెన్సీ మొత్తం అని అర్ధం. సాధారణంగా బ్యాంకులు తమ మొత్తం క్యాపిటల్ లో 25% వరకూ విదేశీ కరెన్సీ కోసం సొంత పరిధిని ఉంచుకోవచ్చు. అయితే, ఆ పరిమితిని పరిమితిని ఇప్పుడు ఆర్బీఐ కేవలం 100 మిలియన్ డాలర్లకు పరిమితం చేసింది. ఉదాహరణకు ఒక బ్యాంకు మొత్తం క్యాపిటల్ 1000 మిలియన్ డాలర్లు అనుకుందాం. ఇప్పుడు ఉన్న పధ్ధతి ప్రకారం ఆ బ్యాంకు 25% అంటే 250 డాలర్ల వరకూ నిలువ ఉంచుకోవచ్చు. కానీ, ఇప్పుడు ఆర్బీఐ నిబంధనతో ఆ బ్యాంకు క్యాపిటల్ ఎంతైనా కానీ.. 100 మిలియన్ డాలర్లు మాత్రమే నిలువ ఉంచుకోగలుగుతాయి.
నిపుణులు చెబుతున్న దాని ప్రకారం బ్యాంకులు ఎక్కువ మొత్తం ఫారెక్స్ నిలువలు ఉంచుకుంటాయి. వాటిలో కొన్నిటిని తమ లాభార్జన కోసం ఉపయోగిస్తూ ఉంటాయి. ఇలా బ్యాంకులు కనుక పెద్ద మొత్తంలో డాలర్లను హెడ్జ్ చేయని పొజిషన్ లో ఉంచుకున్నపుడు అది ఇంట్రా డే ట్రేడింగ్ సమయంలో రూపాయి విలువలో తీవ్ర హెచ్చు తగ్గులకు కారణం అవుతుంది. ఈ పరిస్థితి రాకుండా గతంలోనే ఆర్బీఐ బ్యాంకులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు ఆ హెచ్చరికల స్థానంలో కచ్చితమైన ఆదేశాలు ఇచ్చింది.
ఏప్రిల్ 10 వరకు..
ఈ కొత్త నిబంధనను పాటించడానికి ఆర్బిఐ అన్ని అధీకృత ఫారిన్ ఎక్స్ఛేంజ్ డీలర్లకు ఏప్రిల్ 10 వరకు గడువు ఇచ్చింది. నిపుణులు చెబుతున్నదాని ప్రకారం ఈ చర్య స్టాక్ మార్కెట్లో బ్యాంకుల లాంగ్ డాలర్ పొజిషన్లను తగ్గిస్తుంది. మార్కెట్ తెరిచినప్పుడు రూపాయిలో ఆకస్మిక , గణనీయమైన పతనాన్ని నివారించడానికి ఇది సహాయపడుతుంది.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి..
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం, బ్రెంట్ ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా రూపాయి విలువ ప్రధానంగా పడిపోయింది. ఫిబ్రవరి చివరిలో అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి భారత కరెన్సీ ఇప్పటికే సుమారు 4% క్షీణించింది.
2011-12 తర్వాత రూపాయిలో అతిపెద్ద పతనం
భారతదేశ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి మార్చి వరకు ఉంటుంది. గణాంకాల ప్రకారం, గత 14 ఏళ్లలో ఒకే సంవత్సరంలో రూపాయి ఇంతగా పడిపోవడం ఇదే మొదటిసారి. గతంలో, 2011-12లో యూరోజోన్ సంక్షోభం సమయంలో, రూపాయి సుమారుగా 14% పడిపోయింది. ఇదిలా ఉండగా, ఏప్రిల్ 1, 2025 నుండి, అంటే 2026 ఆర్థిక సంవత్సరంలో, రూపాయి 10% పడిపోయింది.




