PPF: నెలకు రూ. 10 వేలు పక్కన పెడితే.. కోట్ల రూపాయలు జమ చేయొచ్చు
PPF: భవిష్యత్తులో ఆర్థిక భద్రత కోసం చాలా మంది సురక్షిత పెట్టుబడులపై దృష్టి పెడుతున్నారు. అలాంటి వాటిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) స్కీమ్ ఒకటి.
PPF: నెలకు రూ. 10 వేలు పక్కన పెడితే.. కోట్ల రూపాయలు జమ చేయొచ్చు
PPF: భవిష్యత్తులో ఆర్థిక భద్రత కోసం చాలా మంది సురక్షిత పెట్టుబడులపై దృష్టి పెడుతున్నారు. అలాంటి వాటిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) స్కీమ్ ఒకటి. గ్యారెంటీ రాబడి, తక్కువ రిస్క్, పన్ను మినహాయింపులు వంటి ప్రయోజనాలు ఉండటంతో మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఈ పథకాన్ని ఎంచుకుంటున్నాయి.
PPF అంటే ఏమిటి? ఎందుకు ప్రత్యేకం?
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది కేంద్ర ప్రభుత్వం మద్దతుతో నడిచే దీర్ఘకాలిక సేవింగ్స్ స్కీమ్. బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో ఈ ఖాతాను సులభంగా ప్రారంభించవచ్చు. ఆధార్, పాన్, ఫోటో వంటి KYC పత్రాలు సమర్పిస్తే అకౌంట్ ఓపెన్ అవుతుంది. ప్రస్తుతం PPFపై 7.1 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీ రేటును ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది. పెట్టుబడిదారులకు స్థిరమైన రాబడి రావడం, మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం లేకపోవడం వల్ల చాలా మంది దీనిని భవిష్యత్ భద్రత కోసం ఉపయోగిస్తున్నారు.
చిన్న వయస్సులో ప్రారంభిస్తే భారీ సంపద
PPFలో నెలకు రూ. 10 వేల చొప్పున పెట్టుబడి పెడితే, దీర్ఘకాలంలో భారీ మొత్తాన్ని కూడబెట్టుకోవచ్చు. ఉదాహరణకు 20 ఏళ్ల వయస్సులో పెట్టుబడి ప్రారంభించి 40 సంవత్సరాల పాటు కొనసాగిస్తే మొత్తం పెట్టుబడి రూ. 48 లక్షలు మాత్రమే అవుతుంది. కానీ కాంపౌండింగ్ ప్రభావంతో వడ్డీ రూపంలోనే రూ. 2.15 కోట్లకు పైగా వస్తుంది. దీంతో రిటైర్మెంట్ సమయానికి మొత్తం రూ. 2.63 కోట్లకు పైగా లభించే అవకాశం ఉంటుంది.
అదే 25 ఏళ్ల వయస్సులో ప్రారంభిస్తే 35 సంవత్సరాల పెట్టుబడిపై మొత్తం రాబడి రూ. 1.81 కోట్లకు పైగా ఉంటుంది. 30 ఏళ్ల వయస్సులో ప్రారంభించినా రూ. 1.23 కోట్లకు పైగా సంపద సమకూరుతుంది. వయస్సు పెరిగే కొద్దీ పెట్టుబడి కాలం తగ్గిపోవడం వల్ల మొత్తం రాబడి కూడా తగ్గుతుంది. అయినప్పటికీ 35 లేదా 40 ఏళ్ల వయస్సులో ప్రారంభించినా మంచి మొత్తాన్ని భవిష్యత్తు కోసం కూడబెట్టుకోవచ్చు.
పిల్లల పేరుతో PPF ఖాతా తెరిస్తే మరింత లాభం
తల్లిదండ్రులు తమ పిల్లల పేరుతో కూడా PPF ఖాతా ప్రారంభించవచ్చు. పిల్లలు 18 ఏళ్లు పూర్తి చేసిన తర్వాత ఆ ఖాతాను వారి పేరుకు మార్చుకునే అవకాశం ఉంటుంది. చిన్న వయస్సులోనే పెట్టుబడి ప్రారంభిస్తే కాంపౌండింగ్ శక్తి వల్ల భారీ రాబడులు వస్తాయి. ఉదాహరణకు 10 ఏళ్ల పిల్లవాడి పేరుతో నెలకు రూ. 10 వేల చొప్పున పెట్టుబడి పెడితే, 50 సంవత్సరాల తర్వాత మొత్తం పెట్టుబడి రూ. 60 లక్షలు మాత్రమే అయినా వడ్డీ రూపంలో రూ. 4.80 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో రిటైర్మెంట్ సమయానికి మొత్తం రూ. 5.40 కోట్లకు పైగా సంపద లభించవచ్చు. అదే 15 ఏళ్ల వయస్సులో ప్రారంభించినా రూ. 3 కోట్లకు పైగా రాబడి వచ్చే అవకాశం ఉంది.
పన్ను మినహాయింపులతో డబుల్ బెనిఫిట్
PPFకు మరో ప్రధాన ఆకర్షణ పన్ను మినహాయింపులు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడిపై పన్ను మినహాయింపు పొందవచ్చు. అంతేకాదు, ఖాతాలో వచ్చే వడ్డీపై కూడా పన్ను ఉండదు. మెచ్యూరిటీ సమయంలో వచ్చే మొత్తంపై కూడా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ కారణంగా PPFను EEE కేటగిరీ పెట్టుబడిగా పరిగణిస్తారు.
ఈ స్కీమ్‌లో 15 సంవత్సరాల లాక్-ఇన్ ఉంటుంది. అయితే ఆ తర్వాత ఐదు సంవత్సరాల చొప్పున ఖాతాను పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. అవసరమైతే కొంత మొత్తాన్ని మధ్యలో విత్‌డ్రా చేసుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది.
ఎక్కువ రాబడి రావాలంటే ఈ విషయం గుర్తుంచుకోండి
PPFలో వడ్డీ లెక్కించే విధానం చాలా ముఖ్యమైనది. ప్రతి నెల 5వ తేదీ నుంచి నెలాఖరు వరకు ఖాతాలో ఉన్న కనిష్ట బ్యాలెన్స్‌పై వడ్డీ లెక్కిస్తారు. అందుకే ప్రతి నెల 5వ తేదీకి ముందే డబ్బు జమ చేయడం మంచిది. ఒకవేళ 5వ తేదీ తర్వాత డిపాజిట్ చేస్తే ఆ నెల వడ్డీ లాభం కోల్పోయే అవకాశం ఉంటుంది.
ఉదాహరణకు సంవత్సరానికి రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెట్టే వారు ఏప్రిల్ 5లోపు మొత్తం జమ చేస్తే పూర్తి వడ్డీ లభిస్తుంది. ఆలస్యమైతే ఒక నెల వడ్డీ తగ్గిపోతుంది. దీర్ఘకాలంలో ఈ చిన్న తేడానే వేల రూపాయల నష్టానికి కారణమవుతుంది. కాబట్టి సమయానికి డిపాజిట్ చేస్తేనే PPF ద్వారా గరిష్ట లాభం పొందవచ్చు.




