Post Office: రూ. 2 ల‌క్ష‌లు పెట్టుబ‌డి పెడితే రూ. 90 వేల లాభం.. ఈ స్కీమ్ గురించి క‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే

Post Office: షేర్ మార్కెట్‌లో ఒడిదుడుకులు, ఇతర పెట్టుబడుల్లో రిస్క్ ఎక్కువగా ఉండటంతో చాలా మంది తమ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉండే పెట్టుబడి మార్గాల కోసం చూస్తున్నారు.

Mokshith
Updated on: 19 July 2026 1:31 PM IST
Post Office
X

Post Office: రూ. 2 ల‌క్ష‌లు పెట్టుబ‌డి పెడితే రూ. 90 వేల లాభం.. ఈ స్కీమ్ గురించి క‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే

Post Office: షేర్ మార్కెట్‌లో ఒడిదుడుకులు, ఇతర పెట్టుబడుల్లో రిస్క్ ఎక్కువగా ఉండటంతో చాలా మంది తమ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉండే పెట్టుబడి మార్గాల కోసం చూస్తున్నారు. అలాంటి వారికి పోస్టాఫీస్ అందించే టైమ్ డిపాజిట్ స్కీమ్ బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు.

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ అంటే ఏంటి?

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ అనేది బ్యాంకుల్లో ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) తరహా పొదుపు పథకం. ఇందులో మీరు ఒకేసారి నిర్ణీత మొత్తాన్ని జమ చేస్తే, నిర్ణయించిన కాలపరిమితి పూర్తయ్యే వరకు దానిపై వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు లేదా ఐదేళ్ల కాలపరిమితిని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఈ పథకం కేంద్ర ప్రభుత్వ హామీతో కొనసాగుతుండటంతో పెట్టుబడికి భద్రత ఎక్కువగా ఉంటుంది.

ప్రస్తుతం ఎంత వడ్డీ లభిస్తోంది?

ప్రస్తుతం పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో ఒక సంవత్సరం డిపాజిట్‌పై 6.9 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. రెండు లేదా మూడు సంవత్సరాల కాలానికి పెట్టుబడి పెడితే 7 శాతం వడ్డీ అందుతుంది. అయితే ఐదేళ్ల కాలానికి పెట్టుబడి పెట్టే వారికి అత్యధికంగా 7.5 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. దీర్ఘకాలం పెట్టుబడి కొనసాగించే వారికి ఎక్కువ లాభం రావడం ఈ పథకం ప్రత్యేకతగా చెప్పవచ్చు.

రూ.2 లక్షల పెట్టుబడిపై ఎంత లాభం వస్తుంది?

మీరు పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో ఐదేళ్ల పాటు రూ.2 లక్షలు ఒకేసారి పెట్టుబడి పెడితే, ప్రస్తుతం అమల్లో ఉన్న 7.5 శాతం వార్షిక వడ్డీ ప్రకారం మెచ్యూరిటీ సమయానికి మొత్తం సుమారు రూ.2,89,990 అందే అవకాశం ఉంది. ఇందులో మీరు పెట్టిన అసలు మొత్తం రూ.2 లక్షలు కాగా, వడ్డీ రూపంలో సుమారు రూ.89,990 లభిస్తుంది. అంటే ఎలాంటి మార్కెట్ రిస్క్ లేకుండా కేవలం ప్రభుత్వ హామీతోనే దాదాపు రూ.90 వేల వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

ఎక్కువ పెట్టుబడి పెడితే మరింత లాభం

ఈ పథకంలో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. అందువల్ల ఎక్కువ మొత్తం పెట్టుబడి పెట్టగలిగిన వారికి మరింత అధిక లాభం లభిస్తుంది. ఉదాహరణకు రూ.5 లక్షలను ఐదేళ్ల పాటు ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయానికి సుమారు రూ.7,24,974 అందే అవకాశం ఉంది. ఇందులో దాదాపు రూ.2,24,974 వడ్డీ రూపంలో లభిస్తుంది. అందుకే దీర్ఘకాల పెట్టుబడిదారులకు ఈ పథకం మంచి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు.

ఈ స్కీమ్‌లో ఉన్న ఇతర ప్రయోజనాలు ఏంటి?

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ మాత్రమే కాదు, పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెడితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంది. ఈ పథకంలో కేవలం రూ.1,000తోనే ఖాతా ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడిపై ఎలాంటి పరిమితి లేదు. వ్యక్తిగతంగా లేదా జాయింట్ అకౌంట్ రూపంలో కూడా ఖాతా తెరవవచ్చు. ప్రతి సంవత్సరం వడ్డీ మీ డిపాజిట్‌కు జత అవుతూ ఉండటంతో, కాలపరిమితి పూర్తయ్యే సమయానికి మంచి మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story