Post Office: చేతిలో డ‌బ్బులున్నాయా.? బ్యాంక్ ఎఫ్డీల‌ను మించిన ప‌థ‌కం, పోస్టాఫీస్‌లో అకౌంట్ ఉంటే చాలు

Post Office: భద్రమైన పెట్టుబడి కోసం చూస్తున్న వారికి పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (TD) స్కీమ్ మంచి ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు.

Mokshith
Published on: 9 July 2026 3:02 PM IST
Post Office
X

Post Office: చేతిలో డ‌బ్బులున్నాయా.? బ్యాంక్ ఎఫ్డీల‌ను మించిన ప‌థ‌కం, పోస్టాఫీస్‌లో అకౌంట్ ఉంటే చాలు

Post Office: భద్రమైన పెట్టుబడి కోసం చూస్తున్న వారికి పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (TD) స్కీమ్ మంచి ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా నిర్ణీత వడ్డీ రేటుతో రాబడి పొందే అవకాశం ఉండటంతో చాలా మంది ఈ పథకాన్ని ఎంచుకుంటున్నారు. ఈ స్కీమ్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు.

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ అంటే ఏమిటి?

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అనేది ఫిక్స్‌డ్ డిపాజిట్ తరహా పొదుపు పథకం. ఇందులో పెట్టుబడిదారులు తమ అవసరాన్ని బట్టి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల కాలపరిమితిని ఎంచుకుని డబ్బు డిపాజిట్ చేయవచ్చు. నిర్ణయించిన కాలం పూర్తయ్యాక అసలుతో పాటు వడ్డీని ఒకేసారి అందుకుంటారు. ఈ పథకంలో పెట్టుబడిపై మార్కెట్ ప్రభావం ఉండదు. అందువల్ల షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్ల మాదిరిగా నష్టపోయే అవకాశం లేకుండా స్థిరమైన రాబడి లభిస్తుంది.

ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేట్లు ఇవే

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌కు ప్రభుత్వం కాలానుగుణంగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. ప్రస్తుతం 1 సంవత్సరం పెట్టుబ‌డిపెడితే 6.9 శాతం, 2 సంవత్సరాలకు గాను 7.0 శాతం, 3 సంవత్సరాలకు 7.1 శాతం, 5 సంవత్సరాలకు గాను 7.5 శాతం వ‌డ్డీ ల‌భిస్తోంది. ఈ లెక్కల ప్రకారం ఐదేళ్ల కాలపరిమితికి పెట్టుబడి పెడితే అత్యధిక వడ్డీ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.

రూ.4 లక్షలు పెట్టుబడి పెడితే ఎంత మొత్తం వస్తుంది?

ఒకవేళ మీరు రూ.4 లక్షలను 3 సంవత్సరాల పాటు పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే, ప్రస్తుతం అమల్లో ఉన్న 7.1 శాతం వార్షిక వడ్డీ ప్రకారం లెక్కిస్తే సుమారు రూ. 94030 వడ్డీ లభిస్తుంది. అంటే మూడు సంవత్సరాల తర్వాత మీ చేతికి మొత్తం రూ. 494030 వ‌స్తుంది.

ఈ స్కీమ్‌ను ఎందుకు మంచి ఆప్ష‌న్.?

పెట్టుబడి భద్రత కోరుకునే వారికి ఈ పథకం మంచి ఆప్ష‌న్‌గా చెబుతున్నారు. మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా నిర్ణీత రాబడి లభించడం ప్రధాన ఆకర్షణ. పదవీ విరమణ పొందిన వారు, స్థిరమైన ఆదాయం కోరుకునేవారు, రిస్క్ తీసుకోవాలనుకోని పెట్టుబడిదారులు ఎక్కువగా ఈ స్కీమ్‌ను ఎంచుకుంటున్నారు.

అదనంగా, పోస్టాఫీస్ సేవలు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా ఈ పథకం సులభంగా చేరువైంది.

సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక వడ్డీ ఉంటుందా?

చాలా బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అదనపు వడ్డీ రేటు ఇస్తారు. అయితే పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో అలాంటి ప్రత్యేక వెసులుబాటు లేదు. ఈ పథకంలో వయస్సుతో సంబంధం లేకుండా అందరికీ ఒకే వడ్డీ రేట్లు వర్తిస్తాయి. అంటే సాధారణ ఖాతాదారులు, సీనియర్ సిటిజన్లు ఇద్దరికీ ఒకే రాబడి లభిస్తుంది. అందువల్ల పెట్టుబడి పెట్టే ముందు ప్రస్తుత వడ్డీ రేట్లు, మీ ఆర్థిక లక్ష్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story