Post Office: 5 ఏళ్లలో 2.2 లక్షల వడ్డీ.. ఎంత పెట్టుబడి పెట్టాలంటే?
Post Office: డబ్బును సురక్షితంగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పోస్టాఫీస్ సేవింగ్స్ పథకాలు ఇప్పటికీ నమ్మకమైన ఎంపికగా కొనసాగుతున్నాయి.
Post Office: 5 ఏళ్లలో 2.2 లక్షల వడ్డీ.. ఎంత పెట్టుబడి పెట్టాలంటే?
Post Office: డబ్బును సురక్షితంగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పోస్టాఫీస్ సేవింగ్స్ పథకాలు ఇప్పటికీ నమ్మకమైన ఎంపికగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మార్కెట్ రిస్క్ లేకుండా స్థిరమైన వడ్డీ రావాలని భావించే వారు ప్రభుత్వ హామీ ఉన్న స్కీమ్స్ వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. అలాంటి ఒక బెస్ట్ స్కీమ్ ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అంటే ఏంటి?
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (TD) అనేది ఒక రకమైన ఫిక్స్‌డ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్. ఇందులో ఒకేసారి నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేసి, నిర్ణయించిన కాలపరిమితి తర్వాత వడ్డీతో కలిసి తిరిగి పొందవచ్చు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుండటంతో పెట్టుబడికి పూర్తి భద్రత ఉంటుంది. ఈ స్కీమ్‌లో 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల కాలపరిమితులతో అకౌంట్లు ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. కనీసంగా రూ.1,000తో ప్రారంభించొచ్చు. గరిష్ట పరిమితి లేకపోవడం మరో ప్రత్యేకత.
ప్రస్తుతం అందుతున్న వడ్డీ రేట్లు ఇవే
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో టెన్యూర్ ఆధారంగా వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.
* 1 సంవత్సరం డిపాజిట్‌పై – 6.9%
* 2 సంవత్సరాల డిపాజిట్‌పై – 7.0%
* 3 సంవత్సరాల డిపాజిట్‌పై – 7.1%
* 5 సంవత్సరాల డిపాజిట్‌పై – 7.5% వడ్డీ పొందొచ్చు.
ఇందులో 5 సంవత్సరాల స్కీమ్‌కు అత్యధిక వడ్డీ లభిస్తోంది. అందుకే ఎక్కువ మంది దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటున్నారు.
రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే ఎంత వస్తుంది?
ఈ స్కీమ్‌లో 5 సంవత్సరాల కాలపరిమితికి రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే గణనీయమైన రాబడి పొందవచ్చు. ప్రస్తుతం 7.5 శాతం వడ్డీ రేటు, త్రైమాసిక కాంపౌండింగ్ విధానం అమల్లో ఉంది. ఈ లెక్కన పెట్టుబడి మొత్తం రూ.5,00,000ని 5 సంవత్సరాల కాలపరిమితో పెట్టుబడి పెడితే 7.5% వడ్డీకి.. మెచ్యూరిటీ పూర్తయ్యేసరికి మీకు సుమారు రూ.7,24,974 అందుతుంది. అంటే కేవలం వడ్డీ రూపంలోనే దాదాపు రూ.2,24,974 లాభం వస్తుంది. ముఖ్యంగా రిస్క్ లేకుండా ఇంత స్థిరమైన రాబడి రావడం వల్ల ఈ స్కీమ్‌ను చాలా మంది సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు.
కాంపౌండ్ వడ్డీ ఎలా పనిచేస్తుంది?
ఈ పథకంలో వడ్డీని త్రైమాసిక ప్రాతిపదికన లెక్కిస్తారు. అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ అసలుకు కలుస్తుంది. దీంతో తరువాతి వడ్డీ కూడా పెరిగిన మొత్తంపైనే లెక్కిస్తారు. దీన్ని కాంపౌండ్ ఇంటరెస్ట్ అంటారు. దీర్ఘకాలం పాటు డబ్బు కొనసాగిస్తే వడ్డీపై కూడా వడ్డీ రావడంతో రాబడి భారీగా పెరుగుతుంది. అందుకే 5 సంవత్సరాల టెన్యూర్‌లో లాభం ఎక్కువగా కనిపిస్తుంది.
ఈ స్కీమ్‌లో ఉన్న ముఖ్యమైన ప్రయోజనాలు
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల కొన్ని ప్రత్యేక లాభాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ హామీతో పూర్తి భద్రత లభిస్తుంది. మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం ఉండదు. స్థిరమైన వడ్డీ రాబడి వస్తుంది. 5 ఏళ్ల డిపాజిట్‌పై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంటుంది. దేశంలోని ఏ పోస్టాఫీస్‌లోనైనా అకౌంట్ ఓపెన్ చేసే సౌకర్యం ఉంటుంది.
అయితే ఈ స్కీమ్‌లో సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ ఉండదు. అన్ని వయసుల వారికి ఒకే వడ్డీ రేటు వర్తిస్తుంది. సురక్షితంగా డబ్బు పెంచుకోవాలనుకునే వారికి పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ ప్రస్తుతం మంచి ఆప్షన్‌గా కనిపిస్తోంది. ముఖ్యంగా దీర్ఘకాలం పెట్టుబడి పెట్టగలిగితే బ్యాంక్ FDల కంటే మెరుగైన రాబడి పొందే అవకాశం ఉంది.




