Post Office: రోజుకు రూ. 100 పక్కనపెడితే రూ. 5 లక్షలు జమ చేయొచ్చు.. ఎన్నేళ్లు పడుతుందంటే.?
Post Office: షేర్ మార్కెట్‌లో ఉండే హెచ్చుతగ్గుల గురించి ఆందోళన లేకుండా, పూర్తిగా సురక్షితమైన పెట్టుబడితో గ్యారంటీ రాబడి పొందాలనుకునే వారికి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.
Post Office: రోజుకు రూ. 100 పక్కనపెడితే రూ. 5 లక్షలు జమ చేయొచ్చు.. ఎన్నేళ్లు పడుతుందంటే.?
Post Office: షేర్ మార్కెట్‌లో ఉండే హెచ్చుతగ్గుల గురించి ఆందోళన లేకుండా, పూర్తిగా సురక్షితమైన పెట్టుబడితో గ్యారంటీ రాబడి పొందాలనుకునే వారికి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ పథకంలో రోజుకు రూ. 100 పెట్టుబడి పెడితే రూ. 5 లక్షలు ఎలా జమ చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజుకు రూ.100తో రూ.5 లక్షల ఫండ్ ఎలా సిద్ధమవుతుంది?
ప్రస్తుతం పోస్టాఫీస్ RDపై వార్షికంగా 6.7 శాతం వడ్డీ అందుతోంది. మీరు రోజుకు రూ.100 చొప్పున పొదుపు చేస్తే నెలకు రూ.3,000 అవుతుంది. ఈ మొత్తాన్ని 10 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా జమ చేస్తే మొత్తం పెట్టుబడి రూ.3,60,000 అవుతుంది. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం దీనిపై సుమారు రూ.1,52,565 వడ్డీ లభిస్తుంది. దీంతో మెచ్యూరిటీ సమయానికి మీ చేతికి మొత్తం రూ.5,12,565 వరకు అందుతుంది. ఎలాంటి మార్కెట్ రిస్క్ లేకుండా, క్రమశిక్షణతో పొదుపు చేసే వారికి ఈ పథకం మంచి అవకాశాన్ని కల్పిస్తుంది.
RD ఖాతా తెరవడం చాలా సులభం
ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సులభంగా ఉపయోగించుకునేలా రూపొందించారు. ఏ భారతీయ పౌరుడైనా సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ తెరవవచ్చు. కనీసంగా రూ.100తో ఖాతా ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడిపై ఎలాంటి పరిమితి లేదు కాబట్టి, ఎవరి ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా వారు ఎంత మొత్తమైనా ప్రతి నెల జమ చేయవచ్చు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు వారి పేరుతో కూడా ఖాతా తెరవొచ్చు. పిల్లల వయస్సు 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే వారి పేరుతోనే ఖాతా ప్రారంభించే అవకాశం ఉంటుంది. వారు 18 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత కేవైసీ పూర్తి చేసి ఆ ఖాతాను సాధారణ అడల్ట్ అకౌంట్‌గా మార్చుకోవచ్చు.
మధ్యలో డబ్బు అవసరమైతే లోన్ కూడా పొందొచ్చు
ఈ పథకంలో మరో ముఖ్యమైన సౌకర్యం లోన్ పొందే అవకాశం. ఖాతా ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తయి, వరుసగా 12 నెలల వాయిదాలు చెల్లించిన తర్వాత మీరు జమ చేసిన మొత్తంలో 50 శాతం వరకు రుణంగా తీసుకోవచ్చు. ఈ రుణంపై RD వడ్డీ రేటుకంటే కేవలం 2 శాతం అదనపు వడ్డీ మాత్రమే చెల్లించాలి. రుణాన్ని ఒకేసారి లేదా నెలవారీ వాయిదాల రూపంలో తిరిగి చెల్లించే వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే, మెచ్యూరిటీ సమయంలో వచ్చే మొత్తంలో నుంచి బకాయిని పోస్టాఫీస్ మినహాయిస్తుంది.
మెచ్యూరిటీ, అకౌంట్ క్లోజ్ రూల్స్
పోస్టాఫీస్ RD పథకం ప్రారంభ కాలపరిమితి 5 సంవత్సరాలు. అయితే మెచ్యూరిటీ తర్వాత దరఖాస్తు చేసి మరో 5 సంవత్సరాల పాటు కొనసాగించే అవకాశం ఉంది. కొత్తగా డబ్బు జమ చేయకపోయినా ఖాతాను కొనసాగించవచ్చు. నెలవారీ వాయిదా చెల్లింపులకు కూడా స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. నెల 1 నుంచి 15వ తేదీ మధ్య ఖాతా తెరిస్తే ప్రతి నెల 15వ తేదీలోపు వాయిదా చెల్లించాలి. 16వ తేదీ నుంచి నెలాఖరు వరకు ఖాతా తెరిస్తే ప్రతి నెల చివరి పని దినంలోపు వాయిదా జమ చేయాలి. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ఖాతాను ముందుగానే మూసివేయాలనుకుంటే, 3 సంవత్సరాల తర్వాత ప్రీమెచ్యూర్ క్లోజర్‌కు అవకాశం ఉంటుంది. అయితే అలాంటి సందర్భంలో RD వడ్డీ కాకుండా పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్‌కు వర్తించే వడ్డీ మాత్రమే లభిస్తుంది.
ఈ పథకం ఎవరికి బెస్ట్.?
ప్రతి నెల చిన్న మొత్తంలో పొదుపు చేసి భవిష్యత్తులో పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవాలనుకునే వారికి పోస్టాఫీస్ RD మంచి పెట్టుబడి మార్గం. పిల్లల చదువు, పెళ్లి, ఇంటి అవసరాలు లేదా అత్యవసర నిధి కోసం క్రమంగా డబ్బు కూడబెట్టాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది. మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం లేకుండా గ్యారంటీ రాబడి, లోన్ సౌకర్యం, మెచ్యూరిటీ తర్వాత పొడిగింపు వంటి ప్రయోజనాల కారణంగా పోస్టాఫీస్ RD ఇప్పటికీ అత్యంత విశ్వసనీయమైన పొదుపు పథకాలలో ఒకటిగా కొనసాగుతోంది.




