PM-SYM: రిటైర్మెంట్ తర్వాత బిందాస్‌గా ఉండాలా.? రూ. 55 చెల్లిస్తే ప్రతీ నెల రూ. 3000 పెన్షన్
PM-SYM: దేశంలో కోట్లాది మంది అసంఘటిత రంగంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.
PM-SYM: రిటైర్మెంట్ తర్వాత బిందాస్‌గా ఉండాలా.? రూ. 55 చెల్లిస్తే ప్రతీ నెల రూ. 3000 పెన్షన్
PM-SYM: దేశంలో కోట్లాది మంది అసంఘటిత రంగంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయం ఉండదు. అలాంటి కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ (PM-SYM) పథకాన్ని అమలు చేస్తోంది.
PM-SYM పథకం అంటే ఏంటి?
ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ (PM-SYM) అనేది అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక పెన్షన్ పథకం. ఇందులో చేరిన వారు నిర్ణీత కాలం వరకు నెలవారీ చందా చెల్లిస్తే, 60 ఏళ్లు పూర్తైన తర్వాత జీవితాంతం ప్రతి నెలా రూ.3,000 పెన్షన్ అందుకుంటారు. ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. అంతేకాదు, పథకంలో ఉన్న వ్యక్తి మరణిస్తే అతని లేదా ఆమె జీవిత భాగస్వామికి పెన్షన్‌లో 50 శాతం కుటుంబ పెన్షన్ రూపంలో అందుతుంది.
ఎంత కట్టాలి.?
ఈ పథకంలో 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు చేరవచ్చు. వయసును బట్టి నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు చందా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని 60 ఏళ్ల వయసు వచ్చే వరకు క్రమం తప్పకుండా చెల్లించాలి. ఆ తర్వాత ప్రతి నెలా రూ.3,000 పెన్షన్ అందుతుంది.
ఎవరు అర్హులు? ఎవరు అర్హులు కారు?
ఈ పథకం అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం రూపొందించారు. ఇందులో వీధి వ్యాపారులు, వ్యవసాయ కూలీలు, నిర్మాణ కార్మికులు, గృహ కార్మికులు, రిక్షా డ్రైవర్లు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, చెప్పుల తయారీ కార్మికులు, ఇటుక బట్టీల్లో పనిచేసేవారు, చెత్త సేకరించే కార్మికులు, వ్యవసాయ కూలీలు, స్వయం ఉపాధి పొందుతున్న చిన్న కార్మికులు తదితరులు చేరవచ్చు. అయితే ఇప్పటికే EPFO, ESIC, NPS వంటి సామాజిక భద్రత పథకాలలో సభ్యులుగా ఉన్నవారు లేదా ఆదాయపు పన్ను చెల్లించే వారు ఈ పథకానికి అర్హులు కారు. అలాగే దరఖాస్తుదారుడి నెలవారీ ఆదాయం రూ.15,000 లేదా అంతకంటే తక్కువ ఉండాలి.
దరఖాస్తుకు అవసరమైన పత్రాలు
PM-SYM పథకంలో చేరేందుకు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా (జన్ ధన్ లేదా సాధారణ సేవింగ్స్ అకౌంట్), మొబైల్ నంబర్, నెలవారీ ఆదాయానికి సంబంధించిన వివరాలు వంటి డాక్యుమెంట్స్ కచ్చితంగా కావాలి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఈ పథకంలో చేరేందుకు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ను సందర్శించాలి. అక్కడ ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు ఇచ్చి నమోదు చేసుకోవచ్చు. నమోదు పూర్తైన తర్వాత బ్యాంకు ఖాతాకు ఆటో డెబిట్ సదుపాయం ఏర్పాటు చేస్తారు. దీంతో ప్రతి నెలా నిర్ణయించిన చందా ఆటోమేటిక్‌గా ఖాతా నుంచి కట్ అవుతుంది. నమోదు అనంతరం పెన్షన్ కార్డు కూడా జారీ చేస్తారు. అయితే ఈ పథకం పూర్తి ప్రయోజనం పొందాలంటే ప్రతి నెలా చందాను క్రమం తప్పకుండా చెల్లించాలి. మధ్యలో చెల్లింపులు నిలిపివేస్తే పథకం ప్రయోజనాలు తగ్గే అవకాశం ఉంది.




