Petrol Price: సామాన్యుడిపై పెట్రో బాంబ్..రోజుకు 1,700 కోట్ల నష్టం..!
Petrol Price: పశ్చిమాసియా యుద్ధం కారణంగా భారత్‌లో ఇంధన సంక్షోభం తలెత్తుతోంది.
Petrol Price: సామాన్యుడిపై పెట్రో బాంబ్..రోజుకు 1,700 కోట్ల నష్టం..!
Petrol Price Hike: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టనున్నాయా? అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ సెగలు గడిచిన 10 వారాల్లో ప్రభుత్వ ఆయిల్ కంపెనీలను ఏకంగా రూ. 1 లక్ష కోట్ల నష్టాల్లోకి నెట్టేశాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే భారతీయులకు పెట్రో షాక్ తప్పదనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరా గొలుసును దెబ్బతీశాయి. భారత్ తన చమురు అవసరాల కోసం ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. అంతర్జాతీయంగా బ్యారెల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నా, దేశీయంగా మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ వ్యత్యాసమే ఇప్పుడు కంపెనీల పాలిట శాపంగా మారింది.
ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు రోజుకు రూ. 1,600 నుంచి రూ. 1,700 కోట్ల నష్టాన్ని భరిస్తున్నాయి. గత రెండున్నర నెలల్లోనే ఈ నష్టం అక్షరాలా రూ. 1 లక్ష కోట్లకు చేరింది. నష్టాలు పెరగడంతో కొత్తగా చమురు కొనుగోలు చేయడానికి ఈ సంస్థలు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో జపాన్, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే పెట్రో ధరలను 30 శాతం మేర పెంచి భారాన్ని తగ్గించుకున్నాయి. కానీ భారత్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పటికే కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి సామాన్యుడికి ఊరటనిచ్చింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 14 వేల కోట్ల ఆదాయం గండిపడింది. ఒకవైపు కంపెనీల నష్టాలు, మరోవైపు ప్రభుత్వ ఆదాయ తగ్గుదల.. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడం ఇప్పుడు మోదీ సర్కారుకు సవాలుగా మారింది.
పెట్రో బాంబ్
సాధారణంగా ఎన్నికల సమయంలో ధరల పెంపు జోలికి వెళ్లని ప్రభుత్వం, ఇప్పుడు ఫలితాలు వెలువడిన తర్వాత కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. చమురు కంపెనీల ఆర్థిక మనుగడ సాగాలంటే ధరల పెంపు ఒక్కటే మార్గమని నిపుణులు అంటున్నారు. ఇది కేవలం ఆర్థిక అంశమే కాక రాజకీయ అంశం కూడా కావడంతో, ఎంత మేర పెంచాలి? ఎప్పుడు పెంచాలి? అనే తుది నిర్ణయం ప్రధాని కార్యాలయం నుంచే రావాల్సి ఉంది. ఒకేసారి భారీగా పెంచకుండా, విడతల వారీగా ధరలను సవరించే అవకాశం ఉందని సమాచారం.
పశ్చిమాసియా సెగలు చల్లారకపోతే, ఆ వేడి భారత పెట్రోల్ బంకుల వద్ద సామాన్యుడికి తగలడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ప్రభుత్వం ఈ సంక్షోభం నుండి గట్టెక్కడానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇంధన ధరల పెంపు జరిగితే అది నిత్యావసర వస్తువుల ధరలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.




