Petro Price Hike: సామాన్యుడికి మరో వాత.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే ఛాన్స్..?

Petro Price Hike: దేశంలో వాహనదారులకు మరోసారి ఇంధన ధరల షాక్ తగిలేలా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 5 నుండి రూ. 10 వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Arun Chilukuri
Published on: 7 Jun 2026 12:00 PM IST
Petro Price Hike
X

Petro Price Hike: సామాన్యుడికి మరో వాత.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే ఛాన్స్..?

Petro Price Hike: దేశంలో నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్యుడికి మరో బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు మరో 5 నుంచి 10 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గత మే 15వ తేదీన పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు దాదాపు రూ. 7.5 మేర పెరిగిన సంగతి తెలిసిందే. మే నెలలోనే ఇంధన ధరలు దాదాపు 8 శాతం పెరిగినప్పటికీ, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల (OMCs) ఆర్థిక ఇబ్బందులు ఇంకా తొలగిపోలేదు. పెరిగిన ముడి చమురు ధరలు, పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ఈ కంపెనీలు ప్రతిరోజూ సుమారు రూ. 610 కోట్ల మేర నష్టాలను చవిచూస్తున్నాయి. ప్రస్తుత ధరల వద్ద కూడా కంపెనీలకు లీటర్ పెట్రోల్‌పై రూ. 5.5, డీజిల్‌పై రూ. 4.5 చొప్పున నష్టం వస్తోంది. ఈ నష్టాలను పూడ్చుకోవడానికి ధరల పెంపు మినహా మరో మార్గం లేదని తెలుస్తోంది.

ఇంధన ధరల పెరుగుదల దేశీయ సరఫరా గొలుసును (Supply Chain) తీవ్రంగా ప్రభావితం చేయనుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ 'క్రిసిల్' (Crisil) హెచ్చరించింది. ఇంధన ధరలు లీటరుకు రూ. 7.5 పెరిగితే వినియోగదారుల ద్రవ్యోల్బణానికి 36 బేసిస్ పాయింట్లు, అదే రూ. 10 పెరిగితే ఏకంగా 48 బేసిస్ పాయింట్లు అదనంగా చేరవచ్చని క్రిసిల్ పేర్కొంది.

భారతదేశ లాజిస్టిక్స్ వ్యయంలో సరుకు రవాణా వాటా 54 శాతం కాగా, ఇందులో 71 శాతం రోడ్డు రవాణా ద్వారానే జరుగుతుంది. రోడ్డు రవాణా ఖర్చులలో కేవలం ఇంధనానికే 42 శాతం ఖర్చవుతుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల పాల ఉత్పత్తులు, పండ్లు, పప్పుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, టీ, కాఫీ, గుడ్లు, మాంసం, చేపలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగే ప్రమాదం ఉంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు సగటున సుమారు $112 (112 డాలర్లు) గా నమోదయ్యాయి. ఇది క్రిసిల్ వార్షిక అంచనా ($95) కంటే చాలా ఎక్కువ. ఇరాన్‌తో అమెరికా జరుపుతున్న చర్చలు సఫలమై, ఇజ్రాయెల్ వైపు నుంచి దాడులు ఆగితేనే ముడి చమురు ధరలు తగ్గే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం హర్మూజ్ జలసంధి వేదికగా జరుగుతున్న ఆధిపత్య పోరు, లెబనాన్‌పై దాడుల వల్ల అంతర్జాతీయ ఇంధన మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే భారతీయ వినియోగదారులకు ఇంధన మంట తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story