Petrol Diesel Price Hike: మళ్లీ పెట్రో బాదుడు తప్పదా.. లీటరుపై మరో రూ.33 పెరిగే అవకాశం..?

Petrol Diesel Price Hike Expected: వాహనదారులకు చమురు సంస్థలు గట్టి షాక్ ఇవ్వనున్నాయి. ఇప్పటికే నాలుగు సార్లు పెరిగిన ఇంధన ధరలు.. మున్ముందు లీటరుపై మరో రూ.20 నుంచి రూ.33 వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Arun Chilukuri
Published on: 25 May 2026 12:08 PM IST
Petrol Diesel Price Hike
X

Petrol Diesel Price Hike: మళ్లీ పెట్రో బాదుడు తప్పదా.. లీటరుపై మరో రూ.33 పెరిగే అవకాశం..?

Petrol Diesel Price Hike: దేశంలో సామాన్యుడిపై ఇంధన భారం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వరుసగా నాలుగు సార్లు ఇంధన ధరలు పెరగడంతో లీటరుపై దాదాపు రూ.7.38 వరకు అదనపు భారం పడింది. అయితే, ఈ బాదుడు ఇంతటితో ఆగదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల పెరుగుదల, దేశీయ చమురు సంస్థల భారీ నష్టాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో ధరలు మరింత పెంచక తప్పదని తెలుస్తోంది.

ఇండియన్ ఆయిల్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) లాంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థల నష్టాలు తాజా ధరల పెంపుతో ఏమాత్రం భర్తీ కాలేదని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు, మన దేశీయ రిటైల్ ధరలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని పూర్తిగా భర్తీ చేయాలంటే.. లీటరు ఇంధనంపై మరో రూ.20 నుంచి రూ.33 వరకు పెంచాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే అంత భారం ఒకేసారి వేయడం సాధ్యం కాదు కాబట్టి, విడతల వారీగా లీటరుపై కొంత మొత్తాన్ని పెంచుకుంటూ పోయే అవకాశం ఉంది.

గత ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్ వివాదం కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు (Crude Oil) ధరలు రికార్డు స్థాయిలో భారీగా పెరిగాయి. అయినప్పటికీ, మనదేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా వరుసగా 74 రోజుల పాటు ఇంధన ధరలను పెంచకుండా చమురు సంస్థలు నిలిపివేశాయి.

భారత్ తన మొత్తం చమురు అవసరాల కోసం ఏకంగా 88 శాతం ముడిచమురును ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయంగా రేట్లు పెరిగినా దేశంలో ధరలను స్థిరంగా ఉంచడం వల్ల ఈ మూడు ప్రభుత్వ రంగ సంస్థలపై ఏకంగా రూ.1.2 లక్షల కోట్లకు పైగా అదనపు ఆర్థిక భారం పడింది. ఇప్పుడు ఆ నష్టాల నుంచి గట్టెక్కేందుకే ధరల పెంపునకు మొగ్గు చూపుతున్నాయి.

భవిష్యత్తులో ఇరాన్, అమెరికా మధ్య చర్చలు సఫలమై అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఒకవేళ తగ్గినా, దేశీయంగా వాహనదారులకు వెంటనే ఊరట లభించే అవకాశం లేదు. పెరిగిన రవాణా ఖర్చులు, చమురు సంస్థల పాత నష్టాల రికవరీ కారణంగా ధరల భారం అలాగే కొనసాగవచ్చు. ఇటు ప్రజలపై ద్రవ్యోల్బణం (Inflation) భారం పడకుండా, అటు చమురు సంస్థలు దెబ్బతినకుండా సమతుల్యతను పాటించడం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story