Loan: పర్సనల్ లోన్ EMI చెల్లించడంలో విఫలమైతే.. జైలుకు వెళ్లాల్సి ఉంటుందా.?
Loan: ప్రస్తుతం బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, మొబైల్ యాప్‌ల ద్వారా పర్సనల్ లోన్ తీసుకోవడం చాలా సులభమైంది.
Loan: పర్సనల్ లోన్ EMI చెల్లించడంలో విఫలమైతే.. జైలుకు వెళ్లాల్సి ఉంటుందా.?
Loan: ప్రస్తుతం బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, మొబైల్ యాప్‌ల ద్వారా పర్సనల్ లోన్ తీసుకోవడం చాలా సులభమైంది. కొన్ని నిమిషాల్లోనే రుణం అకౌంట్‌లో జమ అవుతోంది. అయితే ఉద్యోగం కోల్పోవడం, వ్యాపారంలో నష్టాలు రావడం లేదా ఇతర ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలామంది నెలవారీ EMIలు చెల్లించలేకపోతున్నారు. దీంతో "EMI చెల్లించకపోతే జైలుకు పంపిస్తారా?" అనే భయం చాలా మందిలో ఉంటుంది.
EMI చెల్లించకపోతే జైలుకు వెళ్లాల్సిన అవసరముందా?
సాధారణంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా పర్సనల్ లోన్ EMI చెల్లించలేకపోవడం నేరం కాదు. నిజాయితీగా రుణం తీసుకుని, పరిస్థితులు అనుకూలంగా లేక చెల్లించలేకపోతే కేవలం ఆ కారణంతో ఎవరినీ జైలుకు పంపించలేరు. ఇది సివిల్ వ్యవహారం మాత్రమే. అందువల్ల భయపడాల్సిన అవసరం లేదు.
EMIలు చెల్లించకపోతే బ్యాంకు ఏం చేస్తుంది?
మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ EMIలు చెల్లించకపోతే మొదట బ్యాంకు ఫోన్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా గుర్తు చేస్తుంది. అయినా స్పందించకపోతే లీగల్ నోటీసులు పంపుతుంది. చాలా కాలం చెల్లింపులు జరగకపోతే మీ రుణ ఖాతాను NPA (నాన్-పర్ఫార్మింగ్ అసెట్)గా ప్రకటిస్తుంది. దీంతో మీ CIBIL స్కోర్ తీవ్రంగా దెబ్బతింటుంది. భవిష్యత్తులో కొత్త లోన్, క్రెడిట్ కార్డు పొందడం కష్టమవుతుంది. అవసరమైతే బ్యాంకు కోర్టును ఆశ్రయించి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. రుణానికి ఏదైనా ఆస్తిని హామీగా పెట్టి ఉంటే దానిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
ఏ పరిస్థితుల్లో జైలుకు వెళ్లే అవకాశం ఉంటుంది?
EMI చెల్లించలేకపోవడం వల్ల కాదు, బ్యాంకును మోసం చేసినప్పుడు మాత్రమే జైలు శిక్ష వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కేసు నమోదు కావచ్చు.. నకిలీ పత్రాలతో రుణం తీసుకోవడం. ఉద్యోగం లేదా ఆదాయం గురించి తప్పుడు సమాచారం ఇవ్వడం. మొదటి నుంచే డబ్బు తిరిగి చెల్లించకుండా మోసం చేయాలనే ఉద్దేశంతో రుణం తీసుకోవడం. బ్యాంకును ఉద్దేశపూర్వకంగా మోసం చేయడం. ఇలాంటి సందర్భాల్లో బ్యాంకు పోలీసులకు ఫిర్యాదు చేసి క్రిమినల్ కేసు నమోదు చేయవచ్చు. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల EMI చెల్లించలేకపోవడం దీనికి పూర్తిగా భిన్నం.
రికవరీ ఏజెంట్లు బెదిరిస్తే ఏం చేయాలి?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం రికవరీ ఏజెంట్లు మర్యాదగా మాత్రమే వ్యవహరించాలి.
బకాయి గురించి ఫోన్ చేయడం, అవసరమైతే ఇంటికి లేదా కార్యాలయానికి రావడం మాత్రమే వారికి ఉన్న హక్కులు. కానీ బెదిరించడం, దుర్భాషలాడడం, అవమానించడం, అర్ధరాత్రి లేదా అసమయాల్లో ఫోన్ చేసి వేధించడం వంటి అధికారులు వారికి ఉండవు. ఎవరైనా రికవరీ ఏజెంట్ ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులకు లేదా RBIకి ఫిర్యాదు చేయవచ్చు. చట్టం రుణగ్రహీత హక్కులను కూడా రక్షిస్తుంది.
EMI చెల్లించలేని పరిస్థితి వస్తే ఏం చేయాలి?
చాలామంది బ్యాంకు నుంచి ఫోన్ వస్తే భయపడి ఎత్తరు. ఇది సమస్యను మరింత పెంచుతుంది. దానికి బదులుగా నేరుగా బ్యాంకును సంప్రదించండి, మీ ఆర్థిక పరిస్థితిని స్పష్టంగా వివరించండి, EMI తగ్గించే అవకాశం ఉందా అని అడగండి, రుణ కాలపరిమితి పెంచే అవకాశంపై చర్చించండి, అవసరమైతే కొంతకాలం మొరటోరియం కోరండి, పరిస్థితిని బట్టి వన్ టైమ్ సెటిల్‌మెంట్ (OTS) అవకాశాన్ని కూడా పరిశీలించండి. చాలా బ్యాంకులు వినియోగదారుల పరిస్థితిని బట్టి పరిష్కార మార్గాలు సూచిస్తాయి. అందువల్ల భయపడకుండా బ్యాంకుతో మాట్లాడటం ఉత్తమ మార్గం.




