Pavani Bugatha: హల్వా అమ్ముతూ కోటి రూపాయల టర్నోవర్..ఓ సామాన్య మహిళ అసాధారణ విజయం..!
Pavani Bugatha: వెయ్యి రూపాయల పెట్టుబడి కూడా లేకుండా మాడుగుల హల్వా బిజినెస్ స్టార్ట్ చేశారు.
Pavani Bugatha
Madugula Halwa: సాధారణంగా ఒక వ్యాపారం మొదలుపెట్టాలంటే లక్షల్లో పెట్టుబడి, సొంత ఆఫీస్, పెద్ద టీమ్ ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ, ఇవేమీ లేకపోయినా.. కేవలం ఒక ఆలోచన, దానికి తోడు అకుంఠిత దీక్ష ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించారు ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ పావని బుగత.
ట్రోల్స్ నుంచి టర్నోవర్ వరకు..
అనకాపల్లి జిల్లా మాడుగుల అనే చిన్న గ్రామానికి చెందిన పావనిది దిగువ మధ్యతరగతి కుటుంబం. బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి, ఎంబీఏ సీటు సాధించినా.. పెళ్లి తర్వాత తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని తపన పడేవారు. మొదట్లో సరదాగా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ అందరిలాగే విమర్శలు, ట్రోల్స్ ఎదుర్కొన్నారు. కానీ, ఆ విమర్శలనే తన విజయానికి పునాదిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు.
పెట్టుబడి సున్నా
పావని ఎంచుకున్న ఆయుధం తన ఊరి స్పెషల్ 'మాడుగుల హల్వా'. గోధుమ పాలు, బెల్లం, నెయ్యితో తయారయ్యే ఈ సంప్రదాయ తీపి వంటకాన్ని ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేసి ఒక రీల్ పోస్ట్ చేశారు. ఆ ఒక్క వీడియో పావని జీవితాన్ని మలుపు తిప్పింది. వందలాది మంది ఆర్డర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే, చేతిలో పెట్టుబడికి పైసా లేదు. ఇక్కడే ఆమె ఒక స్మార్ట్ బిజినెస్ మోడల్ ఆలోచించారు.కస్టమర్ల దగ్గర ముందుగా డబ్బులు తీసుకుని, ఆ తర్వాతే హల్వా తయారు చేసి పంపడం. ముందుగా చేసి పెట్టుకోకుండా, ఆర్డర్ వచ్చినప్పుడే అప్పటికప్పుడు తాజా హల్వాను సిద్ధం చేయడం.
ఇంటి గది నుంచి అంతర్జాతీయ స్థాయికి..
ఒకటి రెండు ఆర్డర్లతో మొదలైన ప్రయాణం.. నేడు రోజుకు 100 కిలోల విక్రయానికి చేరుకుంది. సొంత ఇంట్లోనే ఒక గదిలో మొదలైన ఈ హల్వా ఎంపైర్, నేడు గుంటూరు వంటి నగరాల్లో ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. దేశ విదేశాల్లో దాదాపు 20 వేల మందికి పైగా కస్టమర్లను సంపాదించుకున్న పావని, నేడు ఏడాదికి కోటి రూపాయల టర్నోవర్ సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. చక్కెర లేదు, నూనె లేదు.. కేవలం ఆరోగ్యం మరియు రుచిని నమ్ముకుని పావని చేసిన ఈ ప్రయోగం నేడు ఎంతోమంది మహిళలకు ఆదర్శం. "వ్యాపారానికి కావాల్సింది బ్యాంకు బ్యాలెన్స్ కాదు.. పట్టుదల కలిగిన మనసు" అని పావని బుగత చాటి చెప్పారు.




